ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో, అద్భుతమైన డాన్సులతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ రంభ. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలతో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అటువంటి రంభ జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం...
రంభ అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత రంభ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. 1976 జూన్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆమెకు నటనంటే ఎంతో ఇష్టం. చదువుపై పెద్దగా ఆసక్తి చూపించకపోయినా నటన, నృత్యం అంటే మాత్రం చాలా ఇష్టం. ఆమె ఏడో తరగతి చదువుతున్న సమయంలో పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో అమ్మవారి పాత్రలో నటించారు. అదే కార్యక్రమానికి హాజరైన దర్శకుడు హరిహరన్ ఆమెను గమనించారు. ఆమె రూపం, నటన చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1992లో మలయాళంలో విడుదలైన ‘సర్గం’ సినిమాతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో చదువు మధ్యలోనే ఆపేసి సినిమాలపై దృష్టి పెట్టారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నటిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు.
తెలుగు సినీ ప్రవేశం
మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రంభకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఆమె అందం, నటన, డాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొదట చిన్న చిన్న పాత్రలు, సెకండ్ హీరోయిన్ పాత్రల్లో నటించిన రంభ ఆ తర్వాత హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కూడా నటించారు. ఆ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.
స్టార్ హీరోల సరసన
1994లో వరుస సినిమాలతో బిజీగా మారిన రంభ జగపతిబాబు సరసన నటించిన ‘అల్లరి ప్రేమికుడు’ సినిమాతో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, హిట్లర్, బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు వంటి సినిమాలతో రంభ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడంతో రంభ క్రేజ్ మరింత పెరిగింది. తెలుగులోనే కాకుండా హిందీ సినిమాల్లో కూడా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఓ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తితో పరిచయం ఏర్పడటంతో హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని చెబుతారు. అక్కడ కూడా గ్లామర్ పాత్రలు, డాన్స్‌లకు సంబంధించిన అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. అదే సమయంలో కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు, ఇలా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ రంభ బిజీ హీరోయిన్గా కొనసాగారు.
నిర్మాతగా..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రంభ నిర్మాతగానూ తన సత్తా చాటాలని భావించారు. 2003లో తన అన్న సహకారంతో ‘త్రీ రోజెస్’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రంభతో పాటు జ్యోతిక, లైలా ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే సినిమా నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఎలాగోలా సినిమాను పూర్తి చేసి విడుదల చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో రంభకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలింది. ఆ సమయంలో భోజ్‌పురి సినిమాల్లో కూడా రంభ నటించారు. కొన్ని సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ ఆమె ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అలా కెరీర్, ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
వ్యాపార వేత్తతో పెండ్లి
ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు రంభకు పెండ్లి చేయాలని భావించారు. ఆమెను అభిమానించే శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభి వివాహానికి ముందుకు వచ్చారు. 2010 ఏప్రిల్ 8న తిరుమలలో వీరి వివాహం జరిగింది. పెండ్లి తర్వాత ఆమె కెనడాలో స్థిరపడ్డారు. వీరికి మొదట ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. భర్తతో విభేదాలు పెరగడంతో రంభ తన ఇద్దరు పిల్లలతో కలిసి కొంతకాలం భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ సమయంలో మళ్లీ సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించారు. అలాగే కొన్ని టెలివిజన్ కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరించారు. ప్రకటనల్లో కూడా కనిపించారు. అయితే గతంలో ఉన్నంత బిజీగా సినిమాలు చేయలేకపోయారు. ఆ తర్వాత భర్తతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని మళ్లీ కెనడాకు వెళ్లారు. 2018లో రంభ బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి కెనడాలో కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా...
ఒకప్పుడు తన అందంతో, నటనతో, అద్భుతమైన డాన్సులతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రంభ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా మారి సొంతంగా సినిమా నిర్మించాలనుకున్నారు. కానీ త్రీ రోజెస్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెళ్లి, కుటుంబ జీవితం విషయంలోనూ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగడం ముఖ్యం. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రంభ ఇప్పుడు తన కుటుంబంతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్నారు.



కామెంట్లు (0)