‘సోము’గా బడిలో చేరిన సోమయ్య డస్ట్‌బిన్‌లో చెత్త సామాను ఒక దానిమీద ఒకటి పడ్డట్టు ఏళ్లు పై బడటంతో సోమయ్యయిపోయాడు. భార్యాబిడ్డలకోసం ఏళ్లకి ఏళ్లు గాడిద చాకిరీచేసి చేసి ఒంట్లో శక్తి చాలామటుకు కోల్పోయాడు. ఒంట్లో శక్తి పోతే పోయిందనుకుంటే మెదడులో వున్న పురుగు అలిగి అటూ ఇటూ తిరగడం మాసేసింది. అదలా కదలిక లేకుండా వుండడంతో ఎప్పుడు ఏం చేయాలో మరిచి పోసాగాడు. మరచిపోతే మరచిపోయాడు, వేళకు ఇంత తిని తొంగుంటే సరిపోయేది. కానీ ఓ చోట కుదురుగ్గా కూచోలేక ఊరంతా తెగ తిరగడం మొదలుపెట్టాడు.
తిరగడమయితే మొదలు పెట్టాడు కానీ ఎటు నుంచి ఎటు తిరుగుతున్నాడో తెలీడం లేదు.
ఎటునుంచి ఎటు తిరుగుతున్నాడో తెలీకపోతే పోనీ ఏదో ఓ వేళకి కొంపకి చేరాలి కదా! అలా కొంపకి చేరాలంటే అసలు తన కొంప ఎక్కడుందో గుర్తుకురావాలి కదా! తన కొంప ఎక్కడుందో తెలీకపోతే పోనీ గానీ తను ఎవరో తనకైనా తెలియాలి కదా! సోమయ్య దారంట దిక్కూ దివాణం లేకుండా తిరుగుతుంటే దారినపోయే వాడొకడు వాడిపనేదో వాడు చూసుకుపోక సోమయ్యకు ఎదురుపడి కళ్లల్లో కళ్లుపెట్టి ‘ఎవరోయ్ నువ్వు?’ అన్నాడు. అంటే అన్నాడు, తిరుగూ తిరుగూ తిమ్మప్పలా తిరిగిన చోటే తిరుగుతున్నాడు వీడెవడా అని కుతూహలపడి అడిగాడేమో గానీ సోమయ్య మెదడులో కరెంటుంటే కదా! పైగా లేని అనుమానం మొదలైంది సోమయ్యకి. తను ఎవరని అడిగిన వాడికి తను ఎవరో చెప్పాలంటే ముందు తనకు తను ఎవరో తెలియాలి కదా అని నుదురు చించుకున్నాడు. కనుబొమ్మలు చిట్లించాడు. ముఖంలో రంగులు మార్చాడు.
తలకు మొట్టికాయలు తినిపించాడు. అయినా గుర్తురాలేదు. తను ఎవరో తనకు తెలియాలి కాని ఇంకోడికి ఎలా తెలుస్తుందన్న సందేహం రాకుండా అడిగిన వాడినే ‘నేనెవరనేది నాకు తెలీడం లేదు. నువ్వయినా చెప్పు నేనెవరినో’ అని బతిమాలాడు.
‘సరిపోయింది. నెవ్వవరయిందీ నాకు తెలీకే కదా అడిగింది. చూడబోతే బుద్దీ జ్ఞానం అనే రెండూ నీ దగ్గర లేవని తెలుస్తున్నది. నువ్వెవరయిందీ వెళ్లి ఎదురుగ్గా వున్న చెట్టునో పుట్టనో అడుగు’ అంటూ దానయ్య దారంట పరారైపోయాడు. సోమయ్య చెట్టు ముందు నిలబడి ‘నేనెవరనేది నాకు తెలీడం లేదు. నువ్వైనా చెప్పు. నేనెవరినో’ అని బతిమాలాడు.
‘నువ్వెవరో నాకెలా తెలిసేను. నా కొమ్మల్లో గూళ్లు కట్టుకున్న పక్షుల్ని అడుగు’ అని మౌనం వహించింది చెట్టు.
సోమయ్య కొమ్మల్లో వున్న పక్షి గూళ్లకేసి చూస్తూ ‘నేనెవరనేది నాకు తెలీడం లేదు. మీరయినా చెప్పండి నేనెవరినో’ అన్నాడు.
‘నువ్వెవరో నాకు ఎలా తెలిసేను. పక్కనే వున్న కొలనులో చేపల్ని అడుగు’ అంటూ రెక్కలు టపటపలాడిస్తూ రివ్వున ఎగిరిపోయాయి పక్షులు.
ఏటి గట్టున కూచుని చేపల కోసం ఎదురు చూడసాగాడు సోమయ్య. ఊరికే ఎదురు చూడ్డం లాభం లేదని నీట్లో వున్న చేపలకు వినపడాలని బిగ్గరగా ‘నేనెవరనేది నాకు తెలీడంలేదు. మీరయినా చెప్పండి నేనెవరినో’ అన్నాడు.
చేపలకు చెవులున్నాయో లేదో, అవి సోమయ్య అన్న మాటలు విన్నాయోలేదో కానీ అలా సోమయ్య పదే పదే అరుస్తుంటే ఆ దారిన వచ్చిన ఊరి వాళ్లు విని కొందరు నోళ్లు తెర్చుకుని, కొందరు ముక్కులకు వేళ్లు అంటించుకుని వెళ్లి ఊరి పెద్దలకు విన్నవించారు. త్వరలో పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయి.
వీడి ఓటు మనకు చాలా అవసరం అనుకున్న సర్పంచి ఓటర్ల జాబితా పుచ్చుకుని ఏటిగట్టున నేనెవరిని అని అదేపనిగా అరుస్తున్న సోమయ్య దగ్గరికి ఆగమేఘం మీద పరిగెత్తాడు. వెంట వచ్చిన గుమస్తా సోమయ్యను కదలకుండా పట్టుకుంటే ఓటర్ల జాబితాలో సోమయ్య ఫొటో కోసం వెతికాడు గ్రామ పెద్ద. మొత్తమ్మీద సాధించేశాడు.
తెలిసిందోయ్! తెలిసింది. నువ్వెవరో తెలిసింది. ‘నువ్వు సోమయ్యవి అనగా ఓటర్వి. నీ ఇంట్లో ఎనిమిది ఓట్లున్నాయి. నువ్వెవరో చెప్పాను కనుక ఆ ఎనిమిది ఓట్లూ రేపు ఎన్నికల్లో నాకే వెయ్యాలి మరి!’ అన్నాడు సర్పంచి. ఆనందం పట్టలేక గంతులేశాడు సోమయ్య. తను ఎవరో తెల్సిన సంతోషంలో నేను ఓటర్ని, నేను ఓటర్ని అని అరచి గీపెడ్తూ బయలుదేరాడు. ఇల్లు చేరతాడో లేదో గానీ తన పేరు సోమయ్య అన్నది గుర్తు రాలేదు. నేను ఓటర్ని నేను ఓటర్ని’ అంటూ పరుగెత్తాడు.
చింతపట్ల సుదర్శన్, 9299809212






కామెంట్లు (0)