జాలి కాదు.. అవకాశాలు కావాలి

19 నిమిషాల క్రితం

opportunities
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 6 నిమిషాల చదవడం

​కండ్లు లేని తనాన్ని కర్ర నడిపిస్తుంది.. వినికిడి లోపాన్ని వినికిడి మిషన్ వినిపిస్తుంది.. శారీరక వైకల్యాలను సంక కర్ర నడిపిస్తుంది.. మానసిక రుగ్మతను మానవత్వం నడిపిస్తుంది.. బుద్ధిమాంధ్యాన్ని బుద్దిజీవులు నడిపిస్తుండ్రు.. తీవ్ర వైకల్యాన్ని తల్లిదండ్రులు మోస్తుండ్రు.. సహకారం లేని వైకల్యంకు సంరక్షకుడు సహకరిస్తుండు..


​వికలాంగుల జీవనాన్ని ఊహించుకుంటే మనసు తల్లడిల్లుతుంది. అవయవాలు సహకరించక అవస్థలు, ఆసరా కోసం ఆధారపడే జీవితాలు. అవకాశాలు రావు. సమాచారం వుండదు. ఆదరణ కరువు, అడుగడుగునా అవమానాలు, పిలుపులో వెటకారం, చూపులో చులకన భావం. అసలే వికలత్వం.. అందులో బీదరికం తోడు. మధ్యవర్తుల బెడద, దళారుల దందాల నడుమన వివక్ష, మోసం, అన్యాయం, దోపిడీలకు గురవ్వడం. దిక్కుతోచక కుంగిపోతుంటే అయ్యో పాపం అంటారు గానీ ఆదుకోరు. సానుభూతి చూపిస్తారు. చేయూత నిరాకరిస్తారు. వికలాంగులకు హక్కులు, రిజర్వేషన్లు వున్నా అభాగ్యులుగానే జీవనం. వికలాంగుల దయనీయమైన సామాజిక స్థితిగతుల నడుమ నిర్లక్ష్యానికి గురవుతూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. కారణం సభ్య సమాజం. ముందుగా వికలాంగులను అర్థం చేసుకుందాం. వివరాలు తెలుసుకుందాం.

అసలు వికలత్వం అంటే ఏమిటి? మానవుడి శరీర అవయవాల నిర్మాణంలో ఏదైనా ఒక అవయవం లోపించినా, పనిచేయకపోయిన స్థితిని ‘వికలత్వం లేదా వైకల్యం’గా నిర్వచించవచ్చు. ఎలా వస్తుందో పరిశీలిద్దాం. పోషకాహార లోపం, వ్యాధుల వలన, జన్యులోపం, వంశపారంపర్యం, ప్రమాదాలు, యుద్ధాల వలన వైకల్యాలు ఏర్పడడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.

వికలాంగులు - రకాలు

వికలాంగుల రకాలను గమనిద్దాం. ‘సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం, వికలాంగుల హక్కుల చట్టం - 1995’ ద్వారా ఏడు రకాల వికలాంగులను గుర్తించారు. ఐక్యరాజ్య సమితి 2006/డిసెంబర్‌ 3న వికలాంగుల హక్కులు తీర్మానం చేస్తే, దేశంలో 2007 అక్టోబర్‌ 1‌న రాష్ట్రపతి ఆమోదం లభించింది. మన్‌‌ కి బాత్‌ ‌కార్యక్రమంలో ‘వికలాంగ’ పేరుకు బదులు ‘దివ్యాంగ’గా నామకరణం చేసి ఐక్యరాజ్య సమితి ఒప్పందాన్ని అమలు పరుచుటకై ‘వికలాంగుల హక్కుల చట్టం -2016’ను రూపొందించారు. ఈ చట్టం, అంధత్వం, తక్కువ చూపు, వినికిడి లోపం, మాట్లాడకపోవడం, స్పెసిఫిక్‌ ‌లెర్నింగ్‌, శారీరక వైకల్యం, కుష్టు, మస్కులర్‌ ‌డిస్ట్రాపి, సెర్రిబ్రల్‌ ‌పాల్సి, మరుగుజ్జు తనం, బుద్దిమాద్యం, మానసిక వైకల్యం, నాడి సంబంధ వ్యాధులు, బహు వికలత్వం, ఆటిజం, బహు స్క్లెరోసిస్‌, తలసేమియా, హిమోఫిలియో, సికెల్‌‌సెల్‌ ‌డిసీజ్‌, పార్కినన్స్‌ బాధితులు, యాసిడ్‌ ‌దాడి బాధితులను కలిసి మొత్తం 21 రకాల వైకల్యాలను వివరించింది. చట్ట ప్రకారంగా 40శాతం పైబడిన వికలత్వంను పరిగణలోకి తీసుకుని సదరం సర్టిఫికెట్లను జారీ చేస్తారు.

వికలాంగ జనాభా

భారత దేశంలో సుమారుగా 3 కోట్లమంది వికలాంగులున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా 2.68 కోట్ల వికలాంగ జనాభా వుంటే అందులో మహిళలు 1.18 శాతం కోట్లు వుండగా, 1.49 శాతం పురుష వికలాంగులున్నారు. దృష్టిలోపం వారు 18.8 శాతం వుంటే, వినికిడి లోపం గలవారు 18.9 శాతం, శారీరక వైకల్యం కలిగ్గినది 20.3 శాతంగాను, బుద్దిమాంద్యం, మానసిక వైకల్యం వారు 5.6 శాతం వున్నారు. తెలంగాణలో 12.2 శాతం వికలాంగులున్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో వికలాంగులు కలిగిన రాష్ట్రాల జాబితాలో మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, జమ్ముకాశ్మీర్‌‌లు నిలువగా, తక్కువ వికలాంగ జనాభా వున్న రాష్ట్రంగా తమిళనాడు, అస్సాం నిలిచాయి. వికలాంగులు తక్కువగా వున్న రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని పరిశీలించి, పరిశోధనలు జరిపి ఆ విధానాలను అమలు చేయటానికి చర్యలు చేపట్టాలి.

వికలాంగుల హక్కులు - చట్టాలు

వికలాంగుల హక్కుల చట్టం - 2016 కల్పించిన హక్కులను మననం చేసుకుందాం. సాధారణ సమాజంతోటి సమానంగా జీవించే హక్కులను ఆర్టికల్‌ 21 తెలియజేస్తుంది. ఆర్టికల్‌ 49 ఆధారంగా నాణ్యమైన వైద్యం పొందటం, ఉచిత నిర్భంద విద్య హక్కు, ఆర్టికల్‌ 41‌ల ద్వారా వికలాంగుల బృతి పొందటం. స్వయం ఉపాధి, ఉద్యోగం, వృత్తిపరమైన శిక్షణలు, సమాన అవకాశాలు పొందటం, సమాచారం అందుకోవటం, సంరక్షకులను కలిగి వుంటటం, పునరావాసం, ప్రత్యేక సౌకర్యాలు, ఆసరాలు పొందటం, ఉచిత సమన్యాయం, సామాజిక భద్రతను కలిగి వుండి, స్వేచ్ఛను అనుభవించటం, ఆత్మగౌరవంతో జీవించటం వంటి హక్కులను కలిగి వున్నారు.మానసిక ఆరోగ్య చట్టం -2017 (1987) : ఈ చట్టం పూర్తిగా మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికోసం రూపొందించారు. మానసిక ఆరోగ్యం మెరుగు పరిచేందుకు, చికిత్స, సంరక్షణ, ఆస్తులను కాపాడటం ఈ చట్ట ముఖ్య ఉద్దేశ్యం.

సమాజం, మానసిక వైకల్యం గలవారు గౌరవంగా జీవించటానికి ప్రాధాన్యం కల్గి వుంది. జాతీయ ట్రస్టు చట్టం - 2016 (1999) : ఈ చట్టాన్ని గమనిస్తే, తీవ్రమైన వైకల్యంతో బాధపడే వారికి ‘జాతీయ ట్రస్టు చట్టం’ ఒక వరం అని చెప్పాలి. మస్కులర్‌ ‌డిస్ట్రాపి, సెర్రిబ్రల్‌ ‌పాల్సి, బుద్ధి మాంద్యం, బహు వికలత్వాలతో అవస్థలు పడే వికలాంగులు, అవయవాల సమన్వయం లేక కదలికలు లేక ఇతరులపై ఆధారపడి దుర్భరమైన జీవితాలు గడుపుతుండ్రు. ఇలాంటి వారి బాగోగులు చూస్తున్న తల్లిదండ్రులకు, సంరక్షకులకు సెల్యూట్‌ ‌చెయ్యాలి. ఏదైనా కారణంతోగానీ, వృద్ధాప్యం మూలాన, లేదా తల్లిదండ్రులు మరణిస్తే తీవ్రమైన వికలాంగుల పరిస్థితి ఎట్లా వుంటుంది? జీవనం ఎలా? బాగోగులు ఎవరు చూస్తారు? వంటి ప్రశ్నలు పుడతాయి. సందేహాలు కలుగుతాయి.

వాటికి సరైన సమాధానమే ‘జాతీయ ట్రస్టు - 1999 చట్టం’. ఈ చట్టాన్ని అనుసరించి తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న వారి బాగోగులు చూసేందుకు సంరక్షకులను నియమించటం ఈ చట్టం ప్రాధాన్యత. వికలత్వం తీవ్రతను బట్టి ఒకరికంటే ఎక్కువ సంరక్షకులను నిరయమించుకోవచ్చు. ఆస్తులు కాపాడే సంరక్షకులు, సేవలందించే సంరక్షకులు.. ఇలా రెండు రకాలుగా సంరక్షకులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ చట్టంపై పేదలకు అవగాహన వుందా? అవగాహన కల్పించి, చట్టాన్ని అమలు జరిపే బాధ్యత సంబంధిత శాఖలపై వున్నది.

వికలాంగులతో మెలగడం

వికలాంగులను అర్థం చేసుకుని, వారి హక్కులు గౌరవించి, మంచి జీవనం గడిపేందుకు తోడ్పాటును అందించాలి. వికలత్వం/వైకల్యం పేర్లతో పిలవకూడదు. ఒకవేళ పిలిచినా వచ్చే చిక్కులపై అవగాహన కలిగి ఉండాలి. వికలాంగులను వేధింపులకు గురి చేసినా, హింసించినా, మోసం దోపిడీకి గురిచేసినా, ప్రయోజనాలను భంగపరచినా భారీగా జరిమానాకు శక్షార్హులనే సంగతి తెలిసి వుండాలి.

సంక్షేమ పథకాలు - పునరావాసం

అవయవాల సమన్వయ లోపంతో తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో వుండి అవస్థలు పడుతుంటారు. ఇతరులపై ఆధారపడి జీవిస్తుండే వాళ్లకు సామాజిక పరిస్థితుల వలన వైకల్యాలు ఏర్పడినాయి. వచ్చిన వికలత్వం పూర్తిగా తగ్గించలేం. కనీసం కదలలేని స్థితిని కదిలించడం, తమ పనులు తామే చేసుకునే విధంగా శిక్షణలు ఇవ్వడం ద్వారా ఆత్మస్థైర్యం పెంచి పునర్జన్మ వచ్చిన భావాన్ని కల్పించడమే ‘పునరావాసం’. ఇలాంటి పునరావాస కేంద్రాలు కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, మహబూబ్‌‌నగర్‌, మెదక్‌‌ జిల్లాలో పనిచేస్తున్నాయి. వాటిని అన్ని జిల్లాలకు విస్తరింప చేయుటకు సర్కార్‌ ‌తగిన ఏర్పాటు చేయటానికి పూనుకోవాలి.

ఎన్‌.హెచ్.ఎఫ్‌.డి.సి.

వికలాంగుల ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం ఉన్నత విద్యకు సహాయం అందించడం, స్వయం ఉపాధి, వృత్తిపరమైన శిక్షణలకు, సాంకేతిక, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపకరణలకు సబ్సిడీతో కూడిన రుణాలిచ్చి, ఆర్థిక సహాయం అందించడం. వికలాంగులు తయారు చేసిన వస్తువులకు మార్కెట్‌ ‌సదుపాయాలు ఏర్పాటు చేయాలి.

సెర్ఫు, మెప్మా

పేదరిక నిర్మూలన కోసం ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత, మహిళ, వికలాంగుల సాధికారత ముఖ్య ఉద్దేశ్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ కార్యక్రమం. ఇందిర క్రాంతి పథం ద్వారా వికలాంగులను స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేసి, సంఘాల ద్వారా సి.ఐ.ఎఫ్‌. రుణాలు, రివాలింగ్‌ ‌ఫండ్‌, బ్యాంకు లింకేజి, శ్రీనిధి రుణాలు, పావలా వడ్డీ రుణాలు, ఆమ్‌ ఆద్మీ భీమా యోజ, చేయూత పెన్షన్లతో పాటు ‘ఎకనామిక్‌ ‌రిహాబిటేషన్‌ ‌స్కీమ్‌’ కింద 60 శాతం నుండి 100 శాతం వరకు సబ్సిడీ రుణాలిచ్చి, వికలాంగుల ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. ప్రత్యేక వసతులు, సహాయ పరికరాలు, పునరావాసం, నైపుణ్యాలపై శిక్షణలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

ఉపాధి హామీ పథకం

ఈ పథకం కింద అర్హులైన వారికి వికలాంగుల శ్రమశక్తి సంఘాలు ఏర్పరచి, ఉపాధి కల్పిస్తున్నారు. సాధారణ కూలీలకు 100 రోజుల పనిదినాలుంటే, వికలాంగులకు 150 రోజుల పనిదినాలున్నాయి. సాధారణ కూలీలు చేసిన పనిలో వికలాంగులను 30 శాతం పని తక్కువ చేయిస్తారు. అయినా సాధారణ కూలీలతో పాటు సమానంగా వేతనం చెల్లిస్తారు. పని ప్రదేశానికి పోవటానికి 5 కిలోమీటర్ల దూరానికి రవాణా ఖర్చు కింద అదనంగా 10 రూపాయలు, 5 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరముంటే కూలీ రేటులో 10శాతం అదనంగా చెల్లిస్తారు. ఈ పథకం కింద వికలాంగులకు సుస్థిర ఆస్తులను సృష్టించుతారు. ఈ సదుపాయాల అమలు తీరు తెన్నులపైన పర్యవేక్షణ జరిపి, అమలు జరిపేట్టు అధికారులు చొరవ, చర్యలు గైకొనాలి. వికలాంగుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ల ద్వారా లోన్లు, సామాజిక భద్రత పథకాలు, పిల్లలకు, మహిళలకు రకరకాల సంక్షేమ పథకాలున్నాయి.

గడిచిన మూడు దశాబ్దాల్లో...

వికలాంగుల సాధికారత దిశగా డిసెంబర్‌ 3‌ను ‘అంతర్జాతీయ వికలాంగుల దినం’గా, ‘1981ని వికలాంగుల దశాబద్ం’గా, 1993 - 2002 నడుమ కాలంను ‘ఆసియా పసిఫిక్‌ ‌దశాబ్దం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించింది. 80 ఏండ్లు గడుస్తున్నా, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 ఏండ్లు కావస్తున్నా, వికలాంగుల చట్టాలు చేసి మూడు దశాబ్దాలు ముగిసినా, ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందానికి 20 ఏండ్లు నిండినా వికలాంగుల బతుకులు బాగుపడ్తలేవు. ఇప్పటికీ అభాగ్యులుగానే జీవనం గడుపుతుండ్రు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా, అనేక పథకాలు ప్రవేశ పెట్టినా అటు దేశం, ఇటు రాష్ట్రంలోనూ ఆశించిన స్థాయిలో వికలాంగుల అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి ఎందుకు కుంటుపడుతుంది? సరైన అవగాహన లేకపోవడమా? విధాన పరమైన తప్పిదాలున్నాయా? ఆచరణలోపమా? సమాజం, సంస్థల నిర్లక్ష్యమా? 12.2 శాతంగా వున్న వికలాంగుల సంక్షేమం గాడిలో పెట్టేందుకు ఇంకా ఎంతకాలం కావాలి? శాశ్వత పరిష్కారం లభించేదెప్పుడు? ఆత్మ పరిశీలన అవసరం. ఆ దిశగా పరిష్కార మార్గాలు అన్వేషించాలి. తగిన చర్చలు చేపట్టాలి.

వికలాంగుల సమగ్ర అభివృద్ధికై

వికలత్వాన్ని ప్రారంభదశలోనే గుర్తించి. నిరోధించుటకు అవసరమైన నైపుణ్యాల మీద అవగాహన కల్పించి, శిక్షణలు ఇచ్చి వికలత్వాన్ని అరికట్టాలి. ప్రారంభ దశలోనే వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నిరోధక టీకాలు వేయించడం ద్వారా వైకల్యాన్ని ఆపగలుగుతాం. ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి. పోషకాలు మెండుగా వున్న సమతుల్య ఆహారాన్ని అందించటం ద్వారా వికలత్వాన్ని రూపుమాపాలి. వికలాంగులకు సమాజ ఆధారిత పునరావాసం (సిబిఆర్‌)‌ను కల్పించాలి. అంధుల కోసం ట్రాఫిక్‌ ‌సిగ్నల్‌ ‌వద్ద లైట్లతో పాటు తగిన శబ్దాలతో సూచనలు చేయాలి. సైన్‌ ‌భాషలో కార్యక్రమాలను రూపొందించాలి. టీవీలలో ప్రసారం చేయడం ద్వారా బదిరులు పాల్గొనుటకు తోడ్పాటును అందించాలి. వికలాంగుల సంక్షేమం కోసం నైపుణ్యాలను గుర్తించి, వృత్తిపరమైన, స్వయం ఉపాధి పొందేందుకు సామర్ధ్యాల ఆధారంగా శిక్షణలిచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించాలి.

వారి సుస్థిర అభివృద్ధికి తోడ్పాటు అందించాలి. నాణ్యమైన విద్య, వైద్యం పొందుటకు కృషి చేయాలి. సామాజిక భద్రతను కల్పించాలి. బ్రెయిలి లిపి, సైన్‌ ‌భాష ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలి. నాణ్యమైన సహాయ పరికరాలు అందించాలి. వికలాంగ సాధికారత లక్ష్యంగా, సమగ్ర విజన్‌‌తో ప్రణాలికలు రూపొందించివాటి అమలుకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అన్ని స్థాయిల్లో సంక్షేమం కోసం కృషి చేయాలి. వికలాంగుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు సుస్థిర ఆస్తులు సృష్టించి వికలాంగుల బలోపేతానికి ప్రోత్సహించాలి. ‘వికలాంగుల సంక్షేమమే దేశ సంక్షేమం’ అని తెలుసుకుని వికలాంగుల హక్కులను గౌరవించి, ఆత్మగౌరవంతో జీవించేందుకు, ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా ముందుకు సాగేందుకు సమాజం, సర్కారు ‌సమిష్టి బాధ్యతలను తీసుకోవాలి.

మల్లెపువ్వు బాలస్వామి, 9989611481

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్