ఆమె వెళ్లిపోయింది

13 నిమిషాల క్రితం

She
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 6 నిమిషాల చదవడం

స్టూడియో దగ్గరకు చేరేసరికి సాయంత్రం చీకట్లు మెల్లగా కమ్ముకుంటున్నాయి. కిటికీలోంచి పసుపు రంగు వెలుతురు బయటికి కనిపిస్తోంది. తలుపు పూర్తిగా మూయలేదు. నేను వస్తానని ఎదురుచూస్తున్నట్టుగా సగం తెరిచి ఉంది. తలుపు తోసుకుని లోపలికి వెళ్లాను. ఎప్పటిలాగే రంగుల వాసన. గోడలకు ఆనించి ఉన్న పెద్ద పెద్ద కాన్వాస్‌లు. ఒకదాని మీద నగర నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు. మరొకదానిలో బస్తీ వీధి. కిటికీ పక్కన నిలబెట్టిన ఈజిల్ మీద సగం పూర్తయిన చిత్రం. ఆమె పెద్ద కాన్వాస్ ముందు నిలబడి ఉంది. చేతిలో బ్రష్. దాని చివర ఎరుపు రంగు తడిగా ఉంది. చిత్రంలో ఒక కార్మికుడి ముఖం సగమే పూర్తయింది. నా అడుగుల చప్పుడు వినగానే వెనక్కి తిరిగింది.

“వచ్చావా రామ్!” ఆమె గొంతులో ఎదురుచూపు తీరిన ఆనందం వినిపించింది. “ఏమిటి? అర్జెంట్‌గా రమ్మన్నావ్... అంత ముఖ్యమైన పని ఉందా?” “ఉంది. చాలా ముఖ్యమైనది.” ఆమె బ్రష్‌ను పక్కన పెట్టి టేబుల్ దగ్గరకు వచ్చింది. అక్కడున్న తెల్లటి కవరును చేతిలోకి తీసుకుంది. కవరు మీద విదేశీ చిరునామా. పైభాగంలో గ్లోబల్ ఫౌండేషన్ ఫర్ అర్బన్ ఆర్ట్స్ – బెర్లిన్ అని ఉంది. దాని అంచులు కొద్దిగా నలిగిపోయాయి. చాలాసేపటి నుంచి చేతిలోకి తీసుకుని మళ్లీ పక్కన పెట్టిన ఆనవాళ్లు. “ఇది ఎప్పుడొచ్చింది?” అడిగాను. “మధ్యాహ్నం.” “మరి ఇంకా తెరవలేదా?” ఆమె తల అడ్డంగా ఊపింది. “నీ కోసం ఎదురుచూస్తున్నాను.” ఆమె ముఖంలోకి చూశాను. కళ్లలో ఉత్సాహం ఉంది. దాని వెనుక చిన్న ఆందోళన కూడా ఉంది. “ఏముంటుందోనని భయమా?” “భయం కాదు రామ్... ఆశ.” ఆమె కవరును నా చేతిలో పెట్టింది.

“మనిద్దరం కలిసి తెరుద్దాం.” నేను కవరు తెరిచాను. ఉత్తరాన్ని బయటకు తీసి ఆమెకు అందించాను. ఆమె దాన్ని అందుకుని చదవడం మొదలుపెట్టింది. మధ్యలో ఆపి నా వైపు చూసింది. “రామ్...” ఆమె గొంతు ఒక్కసారిగా మారిపోయింది. “ఏమైంది?” ఆమె ఉత్తరాన్ని నా చేతికి అందించింది. నేను చదివాను. నా ముఖంలో నవ్వు మొదలైంది. అమ్ములూ! You’ve been selected!” “నిజంగానా?” “అవును బుజ్జీ! నిజంగా!” ఆమె కళ్లల్లో ఆనందం ఒక్కసారిగా వెలిగింది. ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంది. నేను నా రెండు చేతులతో ఆమె భుజాలు పట్టుకున్నాను. “కంగ్రాట్స్ బుజ్జితల్లీ!” ఆమె ఆ ఆనందంలో నన్ను గట్టిగా హత్తుకుంది. నేను కూడా ఆమెను దగ్గరకు తీసుకున్నాను. ఆమె ముఖంలోకి చూస్తూ, “సాధించావురా బంగారం! నీ ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చింది” అన్నాను. ఆమె నా ఛాతీ మీద ముఖం ఆనించింది.


కాసేపటికి తలెత్తి నా వైపు చూసింది. “నిజంగా సాధించానా రామ్?” “ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? సాధించావు!” ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఎంత ఆనందమో! ఆమె కళ్లలో మెరుపును చూస్తుంటే నాకూ మాటలు రావడం లేదు. “ఈ వార్త నీతోనే చెప్పాలనుకున్నాను. నువ్వు వచ్చేదాకా ఎన్నిసార్లు ఆ కవరు తెరవాలనిపించిందో తెలుసా?” “మరి ఎందుకు ఆగావు?” “ఈ ఆనందాన్ని ఒంటరిగా అనుభవించాలనిపించలేదు.” ఆమె చేతిలోని ఉత్తరాన్ని మళ్లీ తీసుకుని చదివింది. ఈసారి నెమ్మదిగా, ప్రతి వాక్యాన్నీ ఆస్వాదిస్తున్నట్టుగా చదివింది. “ఏడాది పాటు బెర్లిన్‌లో ఉండాలి. అక్కడి ఆర్టిస్టులతో కలిసి పనిచేయాలి. నా పెయింటింగ్స్‌తో ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది.” ఆమె గొంతులో ఉత్సాహం ఉంది. కానీ ఏడాది పాటు అక్కడ ఉండాలన్న విషయం దగ్గరికి వచ్చేసరికి చదవడం ఆపి నా వైపు చూసింది. “రామ్... నువ్వు పక్కన లేకుండా ఒక్క రోజే గడపలేను.


అలాంటిది ఏడాది ఎలా గడపాలి?” ఆ మాటతో నా గొంతు కూడా బరువెక్కింది. “నాకూ నువ్వు లేకుండా కష్టమే బుజ్జీ.” “అయితే వెళ్లొద్దని చెప్పు.” నేను ఆమె చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. “వెళ్లొద్దనే చెప్పాలని ఉంది. కానీ ఎలా చెప్పగలను?” ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. “నాకూ వెళ్లాలని లేదు రామ్. కానీ ఈ ఇంటర్నేషనల్ ఆర్ట్ ప్రాజెక్టులో భాగం కావడం గొప్ప అవకాశం. ఇక్కడ మనం కలిసిన కార్మికుల జీవితాలు, వాళ్ల కథలతో రూపొందించిన నా పెయింటింగ్స్‌ను అక్కడ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాలి. ఇదంతా నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ నిన్ను వదిలి ఏడాది పాటు వెళ్లాలన్న ఆలోచనే మనసును కలచివేస్తోంది.” “ఒకటి నీ కళ, మరొకటి నీ ప్రేమ.. రెండూ నీ జీవితంలో భాగమే కదా!” “నువ్వు నా జీవితంలో భాగం కాదు రామ్. నా జీవితమే నువ్వు.” ఆ మాటకు నేను ఆమెను దగ్గరకు తీసుకున్నాను. “నువ్వు వెళ్లాలి బుజ్జీ. నీ కలను వదులుకోకూడదు. నేను ఇక్కడే ఉంటాను.” ఆమె నెమ్మదిగా నా దగ్గర నుంచి విడిపోయింది. కిటికీ పక్కన ఉన్న కుర్చీ దగ్గరకు వెళ్లి కూర్చుంది.

ఉత్తరాన్ని చేతిలోనే పట్టుకుని కాసేపు దానివైపు చూస్తూ ఉండిపోయింది. “నువ్వు ఇక్కడ ఉంటావని తెలుసు. కానీ నేను తిరిగొచ్చాక మనం ఎక్కడ ఉంటాం? మళ్లీ ఇదేనా? కలవడం, విడిపోవడం, ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోవడం?” నేను ఆమె పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను. “రామ్, ఒకటి అడుగుతాను. నిజాయితీగా చెప్పు.” “అడుగు.” “మనిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామా? లేక ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇలా ఉండిపోవాలనుకుంటున్నామా?” ఆ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది. ఆమెను ప్రేమించడంలో నాకు ఎప్పుడూ సందేహం లేదు. ఆమెతో కలిసి జీవించాలన్న కోరిక కూడా కొత్తది కాదు. కానీ ఆ నిర్ణయం విషయంలో మాత్రం మేమిద్దరం ముందడుగు వేయలేదు. ఆమె కళా ప్రయాణాన్ని, నా బాధ్యతలను, మా స్వతంత్రతను గౌరవించుకుంటూ వచ్చాం. ఇక ఆ నిర్ణయాన్ని వాయిదా వేయకూడదనిపించింది. “కలిసి జీవించాలనుకుంటున్నాను” అన్నాను. ఆమె నా చేతిని పట్టుకుంది. "అంటే..?" నేను ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాను.

“నువ్వు తిరిగొచ్చాక మనం పెళ్లి చేసుకుందాం.” ఆమె ముఖంలో నెమ్మదిగా నవ్వు విరిసింది. కళ్ళల్లో మాత్రం నీళ్లు ఉన్నాయి. “నిజంగా?” “నిజంగా.” ఆమె నా చేతిని తన చెంపకు ఆనించుకుంది. “ఇంతకాలం ఈ మాట నీ నోట వినాలని ఎంత ఎదురుచూశానో!” “నువ్వు కూడా అడగొచ్చుగా!” “కొన్ని మాటలు అడిగి తెలుసుకోవడం కంటే, మనసులోంచి రావడం బాగుంటుంది.” ఆమె కళ్ళలోని నీటిని నా వేళ్లతో తుడిచాను. స్టూడియోలో కొద్దిసేపు నిశ్శబ్దం. గోడల మీద ఆమె చిత్రాలు. టేబుల్ మీద బెర్లిన్‌ నుంచి వచ్చిన ఉత్తరం. ఒక మూలన ఇంకా పూర్తికాని కాన్వాస్. ఆమె లేచింది. ఉత్తరాన్ని టేబుల్ మీద పెట్టి కాన్వాస్ దగ్గరకు వెళ్లింది. కొద్దిసేపు దాన్ని పరిశీలించింది. “ఈ చిత్రం పూర్తి చేయాలి.” నేను కూడా లేచి ఆమె పక్కకు వెళ్లాను. “ఎందుకు ఆగిపోయింది?” “ఈ కార్మికుడి కళ్ళు ఇంకా సరిగ్గా రావడం లేదు.” నేను కాన్వాస్‌ను దగ్గరగా చూశాను. “అతని కళ్ళల్లో ఏం ఉండాలి?” “అలసట ఉండాలి. కానీ ఓటమి ఉండకూడదు.” ఆమె బ్రష్ తీసుకుని రంగులో ముంచింది.

కాన్వాస్ మీద కొన్ని క్షణాలు దృష్టి నిలిపి, మళ్లీ నా వైపు తిరిగింది. “రామ్, నేను వెళ్లాక ఈ స్టూడియోకి వస్తావా?” “వస్తాను.” “అప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావా?” “నిన్ను గుర్తు చేసుకోవడానికి ఈ స్టూడియోకే రావాలా?” ఆమె నవ్వింది. బ్రష్‌ను పక్కన పెట్టి నా దగ్గరకు వచ్చింది. రెండు చేతులతో నా ముఖాన్ని పట్టుకుంది. “నిన్ను వదిలి వెళ్లడం నాకు నిజంగా ఇష్టం లేదు.” “నాకూ.” “మరి నన్ను దగ్గరికి తీసుకో.” ఆమెను గట్టిగా హత్తుకున్నాను. ఆమె నా భుజం మీద ముఖం దాచుకుంది. నా చేతులు ఆమెను మరింత దగ్గరగా చేర్చుకున్నాయి. కొద్దిసేపు ఇద్దరం అలాగే ఉండిపోయాం. ఆ క్షణంలో మాట్లాడుకోవాల్సిన మాటలేవీ మిగల్లేదు. ** విమానాశ్రయంలో ఆమె పక్కనే ఉన్నాను. చెక్‌ఇన్ పూర్తయింది. ఆమె చేతిలో పాస్‌పోర్టు, బోర్డింగ్ పాస్ ఉన్నాయి. చిన్న హ్యాండ్‌బ్యాగ్ నా చేతిలో ఉంది. “ఏమైంది? అలా చూస్తున్నావేంటి?” అడిగింది. “ఏమీ లేదు.

” “నాకు తెలుసు. నీ మనసులో ఏదో ఉంది.” “నిన్ను ఇక్కడే ఆపేయాలని ఉంది.” ఆమె నా చేతిని పట్టుకుంది. “నువ్వు అలా అంటే నేను వెళ్లలేనేమో రామ్.” ఆ మాటకు నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఆమె కూడా కాసేపు మౌనంగా ఉండిపోయింది. “కానీ నువ్వు అలా చేయవని నాకు తెలుసు” అంది. “చేయను.” నేను ఆమె చేతిని నా గుండె మీద పెట్టుకున్నాను. “ఇక్కడే ఉంటావు.” ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. “నువ్వు కూడా ఇక్కడే ఉంటావు.” అంటూ నా చేతిని తన గుండెపై పెట్టుకుంది. ప్రయాణికుల తనిఖీకి వెళ్లాల్సిన ప్రకటన వినిపించింది. ఆమె బోర్డింగ్ పాస్ చూసుకుంది. తర్వాత నా చొక్కా కాలర్ సరిచేసింది. ఆ పని ఎన్నిసార్లు చేసిందో! ఈసారి మాత్రం ఆమె వేళ్లు వణుకుతున్నాయి. “సరిగ్గా తినాలి. పని పేరుతో నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకోకూడదు.” “సరే.” “రాత్రి ఆలస్యంగా నిద్రపోకు.” “ప్రయత్నిస్తాను.” “మళ్లీ అదే సమాధానం!” నవ్వాను. ఆమె కూడా నవ్వింది. ఆ నవ్వు వెనుక కన్నీళ్లు దాగి ఉన్నాయి. ఆమె నా చేతిలోని హ్యాండ్‌బ్యాగ్ తీసుకుంది.

తర్వాత నన్ను గట్టిగా హత్తుకుంది. నా భుజం మీద ముఖం పెట్టుకుని చాలాసేపు కదలకుండా ఉండిపోయింది. “రామ్...” “ఊ!” “నేను తిరిగొచ్చాక మన జీవితం మొదలవుతుంది కదా?” “అవును. ఈసారి వాయిదా వేయం.” ఆమె నన్ను విడిచి రెండు అడుగులు ముందుకు వేసి మళ్లీ వెనక్కి వచ్చింది. నా చెంప మీద ముద్దు పెట్టుకుంది. “ఇది ఏడాదికి సరిపోదు” అన్నాను. ఆ మాటకు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. “తిరిగొచ్చాక మిగిలినవి తీసుకో.” ఆమె నా చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఒక్కో వేలిని విడదీస్తున్నట్టుగా నెమ్మదిగా నా చేతిని వదిలింది. “వెళ్తాను రామ్.” “వెళ్లు.” ఆమె తనిఖీ ద్వారం వైపు నడిచింది. కొద్దిదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూసింది. నేను చేయి ఊపాను. ఆమె కూడా ఊపింది.

నా కళ్లకు కనిపించకుండా పోయేవరకు చూస్తూనే ఉన్నాను. ఆమె వెళ్లిపోయింది. ఆమెతో గడిపిన రోజులు ఒక్కొక్కటిగా కళ్లముందు కదిలాయి. ఎన్ని చిన్న చిన్న సంఘటనలు! ఎన్ని మాటలు! కొన్ని నవ్వించాయి. కొన్ని ఆలోచింపజేశాయి. మరికొన్ని జీవితాన్ని కొత్తగా చూడటం నేర్పించాయి. ఆమెతో పంచుకున్న ప్రతి అనుభవం నా జ్ఞాపకాల్లో ఒక శకలంగా మిగిలింది. అలా మొదలైనవే ఈ మనోజ్ఞ శకలాలు. ఆమె వెళ్లిపోవడంతో ఆ జ్ఞాపకాల పరంపర ఇక్కడితో ముగిసింది. కానీ ఆమెతో నా అనుబంధం కాదు. ఇక ఆమె తిరిగొచ్చే రోజు కోసం ఎదురుచూడాలి.


ఆమెతో గడిపిన రోజులు ఒక్కొక్కటిగా కళ్లముందు కదిలాయి. ఎన్ని చిన్న చిన్న సంఘటనలు! ఎన్ని మాటలు! కొన్ని నవ్వించాయి. కొన్ని ఆలోచింపజేశాయి. మరికొన్ని జీవితాన్ని కొత్తగా చూడటం నేర్పించాయి. ఆమెతో పంచుకున్న ప్రతి అనుభవం నా జ్ఞాపకాల్లో ఒక శకలంగా మిగిలింది. అలా మొదలైనవే ఈ మనోజ్ఞ శకలాలు.

- రామ్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్