మ్యాచ్‌ ఫిక్సింగ్‌ హైడ్రామా

28 నిమిషాల క్రితం

fixing
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 3 నిమిషాల చదవడం

జుట్టుపోలుగాడు : ఓయమ్మో ఓర్నాయనో మీకు మరీ ఇంత ఆకలా..? బకాసురుల్ని మించిపోయారు. ఎంతగా తినిపించినా మీ ఆకలి చల్లారడం లేదుగా.. వేలకోట్ల రూపాయలు రాయితీలు మింగుతూ మీ కంపెనీల్లో జనానికి కొత్త ఉద్యోగాలు ఇవ్వరా? వున్న ఉద్యోగులకు జీతాలు పెంచరా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? కార్పొరేట్లని బలుపా? ఇండస్ట్రియలిస్టులని మదమా? ఒక్కొక్కరి తాట తీస్తా.. నేను ఒట్టి వెధవలా కన్పిస్తున్నానా మీ కళ్లకు. ఈ దేశ ప్రధానిని. బరాబర్‌ ‌శ్రీమాన్‌ ‌నరేంద్రమోడీని. భారతీయ మార్కెట్‌ అంటే లెక్కలేదా? అరెరె. పన్ను మినహాయింపులు, రాయితీలు మీకా, నౌకరి జీతాల బాధ్యత మాదా? మన మార్కెట్‌‌ను నెంబర్‌ ఒన్‌‌గా నిలబెడదాం అంటే అడ్డగోలుగా అడ్డంపడ్తారా..? చూపిస్తా నా తఢాకా.. మీరు నాకు చప్పట్లుకొట్టకపోయినా పర్వాలేదు. కానీ నా మాటల్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అదే అదే నాక్కోపం. ఒక్కొక్కడు దొంగ చూపులతో హేళనగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు. నాకంతా సమజైపోతానే ఉంది. ప్రతిదీ ఎక్స్‌‌పోర్ట్‌ ‌క్వాలిటీ అంటున్నారు. అంటే మనోళ్లకు గా క్వాలిటీ అక్కర్లేదా? మాట్లాడరేం తేలుకుట్టిన దొంగల్లా.. తినడం, తాగడం, జల్సా చేయడమేనా భారతీయ సంస్కృతి? అసలు సోయిలో వుంటున్నారా? లేదా?

కేతిగాడు : (స్వగతం) ఇక చాల్లే నోర్మూసుకో ముసలోడా.. మేమేమన్నా అలగా జనమా? ఈ దేశాన్ని నడిపించే.. ఇంకా చెప్పాలంటే ఈ దునియాను నడిపించే ధనశక్తులం. కుబేర కార్పొరేట్‌ ‌సార్వభౌములం. మా దగ్గర కుప్పిగంతులేస్తే ఎలా? మాకు రాయితీలు నీవేమన్నా తేరగా ఇస్తున్నావా ఏంటి? ఎన్నికలు వచ్చినప్పుడల్లా బాండ్ల రూపంలో పార్టీ ఫండ్‌ ‌మా వద్ద నుండి దండుకుంటున్నావుగా. వాటికేమన్నా లెక్కా పత్రమా? మాకిచ్చే పన్ను రాయితీలు రిటన్‌ ‌గిఫ్ట్‌‌లు. అవి లేకపోతే మీకూ మాకు బంధం ఏంది? సంబంధం ఏంది?

జుట్టుపోలుగాడు : నేను ప్రధానిగా వచ్చీరాగానే 2014లో 30శాతం ఉన్న కార్పొరేట్‌ ‌పన్నును 22కు తగ్గించాను. పన్ను రిటర్న్‌, రిఫండ్‌ ‌ఆ కిరికిరి గొడవల్ని ఎంతో అలవోకగా చేశాను మీకోసం. మీ తయారీ వస్తువులపై జి.ఎస్‌.టి. తగ్గించాను. అయినా మీకు కనికరం లేదు. బాధ్యత లేదు. మా సర్కార్‌ ‌వంతుగా ఉద్యోగులకు 12 లక్షలు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చాం. మరి మీరు జీతాలు పెంచరా? కొత్త ఉద్యోగాలు ఇవ్వరా? ఇదెక్కడి న్యాయం?

కేతిగాడు : అబ్బో.. న్యాయం గురించి తాతగారు భలే సుద్దులు చెప్తున్నారే.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎవడు వాగ్దానం చేయమన్నాడు? ఎన్నికలొచ్చినప్పుడు ఓట్ల కోసం బట్టలూడేలా సోయి పోయేది మీకు, మాక్కాదు. సర్కారు ఇవ్వాల్సిన కొలువులు ఇవ్వక మా మీదపడి ఏడిస్తే ఏం లాంభం? మా లాభాల కోసం మేం పని చేస్తాం కానీ జనోద్ధారణతో మాకేం పని? మేమేమన్నా లీడర్‌‌లమా?

జుట్టుపోలుగాడు : కొత్తగా ఏర్పాటు చేసుకునే మాన్యుఫాక్చరీ కంపెనీలకూ కార్పొరేట్‌ ‌పన్ను 15 శాతమే. ఆల్టర్‌‌నేట్‌‌టాక్స్‌ ‌కూడా పద్దెనిమిదిన్నర నుండి 15 కే తగ్గించాం. అంటే దాదాపు మూడులక్షల కోట్ల ప్రజాధనం మీకు రాయితీలు ఇచ్చాం. ఇదేమైనా చిన్న విషయమా? ఇప్పుడైనా కొట్టొచ్చుగా చప్పట్టు. అయినా మీరు కొట్టడం లేదు. ఛ.. ఛ.. చప్పట్లు అడుక్కోవడం సిగ్గుగా వుంది.

కేతిగాడు : అబ్బబ్బబ్బ ఏమి యాక్టింగ్‌? ఎంతనటన? జనం ఓట్లు కావాలంటే ఆ మాత్రం ఓవర్‌ ‌యాక్షన్‌ ఉండాలి. జనం ముందు నువ్వు హీరోలా కన్పించాలి. మా కార్పొరేట్‌‌లు అంతా విలన్‌‌లు కావాలి అంతేగా.

జుట్టుపోలుగాడు : అరెరె. నేనెంతగా మొత్తుకున్నా మీ గొడవ మీదేనా..? ఇలా ఎడముఖం పెడముఖం ఎన్నాళ్లు. దేశంలో 150 కోట్ల మంది ప్రజలున్నారు. వాళ్లు మీ తయారీ వస్తువులను నచ్చినట్టు కొనుక్కోవాలా? చచ్చినట్టు కొనుక్కోవాలా? అది కూడా నేనే చెప్పాలా?

కేతిగాడు : వారి! ఈ క్లాసు పీకుడేందిరా? డిమాండ్‌ - సప్లై, లాభాలు - నష్టాల పాఠాలు మనం ఇప్పుడు నేర్చుకోవాలా ఏంది?

జుట్టుపోలుగాడు : ఫ్రీట్రేడ్‌ ఎగ్రిమెంట్‌ ‌కాలంలో మనం వున్నాం. అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటేనే మనం నెంబర్‌ 1‌కి వస్తాం. లేకుంటే 50 కోట్లమంది భారతీయుల్ని పేదరికం నుండి బయట పడేశామన్న విషయం గల్లంతైపోతుంది. కనీసం ఆ సోయుందా..?

బంగారక్క : గుడ్‌. మ్యాచ్‌ ‌ఫిక్సింగ్‌ ‌డ్రామా అదిరింది. గజం మిద్య - పలాయనం మిద్య అంటే ఇదే. పేదరికం నుండి బయటపడటం కూడా ఇలాంటిదే. దేశంలో అది పల్లా.. పట్నామా.. నగరమా.. ఎక్కడైనా చూడు, బిచ్చగాళ్లు, బాలకార్మికులు, నిరుద్యోగులు, అనాథలు నిత్యం తారసపడుతూనే వున్నారు. చెత్తా చెదారంతో మురికి కూపాలుగా పేదల నివాస ప్రాంతాలు, పబ్లిక్‌ ‌ప్లేసులు, రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ ‌ఫారాలు, బస్‌‌స్టాండ్‌‌లు, బజార్లు కనిపిస్తుంటాయి. దారిద్ర్యం అడుగడుగునా ఇలా తాండవిస్తుంటే 50 కోట్లమంది జనం పేదరికం నుండి బయటపడ్డారని ప్రపంచబ్యాంకు ప్రకటించటం, అది డబ్బాకొట్టుకుంటూ ఊరేగటం చూస్తుంటే నవ్వలేక మనం ఏడుస్తున్నాం. నలభై శాతం ప్రజల సంపద ఇలాంటి కార్పొరేట్ల ఒక్క శాతంలో కేంద్రీకృతమై వుంది. అందుకే మనం ప్రపంచ ఆకలి సూచిలో నూరో స్థానంలో వున్నాం. ప్రజల ఆదాయాలు, వేతనాలు పెరిగితేనే కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌‌లు వృద్ధి అవుతాయి. కార్మిక చట్టాలు రద్దు చేసి కొత్తగా తెచ్చిన లేబర్‌ ‌కోడ్‌‌లో కనీస వేతన ప్రస్థావన లేదు. కార్మికుల పట్ల సర్కార్‌ ‌సరిగా వ్యవహరించకుండా కార్పొరేట్‌‌లపై విరుచుకుపడటం హైడ్రామా కాక మరేమిటి?


కె.శాంతారావు, 99597 45723

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్