ఆ రోజు పొద్దుగాల్నే పాలకుర్తి ఊరి మీద మంచు దుప్పటి కప్పుకున్నట్టుంది. రాత్రి కురిసిన మంచుకు జొన్నచేను ఆకుల మీద ముత్యాల్లెక్క నీటి బిందువులు మెరుస్తున్నయి. చేలకెళ్లే రైతులు నాగళ్లను భుజానేసుకుని బయలుదేరుతున్నరు. గొల్లపిల్లలు గొర్రెల మందలను తోలుకపోతున్నరు. ధరం బావి దగ్గర ఆడబిడ్డలు నీళ్లు తోడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నరు. ఇండ్ల ముందర పొయ్యిల మీద రొట్టెలు కాలుతున్నయి. ఐదు గూళ్ల దగ్గర తుమ్మచెట్టు కింద కొమురయ్య తన ఎడ్లకు మేతేస్తూ కూసున్నడు. అప్పుడే బడికెళ్తున్న పిల్లల గుంపు అటువైపు వచ్చింది. వాళ్ల చేతుల్లో ఎర్రజెండాలున్నయి. కొందరి చేతుల్లో తెల్లటి కాగితాల మీద నల్లటి అక్షరాలతో రాసిన నినాదాలున్నయి. ‘పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుదాం!’.. మర్రిచెట్టు కింద కూసున్న కొమురయ్యకు ఆ మాటలు అర్థం కాలేదు.‘ఏందిరా బిడ్డా! ఈ పాలస్తీనా ఏ ఊరు? మన జనగామ పక్కనుంటదా? లేక వరంగల్ దిక్కున్నదా?’ అని చిన్నోడ్ని అడిగిండు.
‘కాదు తాతా! అది మన దేశం కాదు. చాలా దూరాన ఉన్న దేశం’ అన్నడు పిల్లగాడు. ‘అయితే మనకెందుకురా వాళ్ల గొడవ? మన ఊర్లనే బోలెడన్ని సమస్యలున్నయి. ఇవన్నీ వదిలిపెట్టి ఆ దేశం గురించి ఎందుకురా?’. పిల్లగాడు నవ్విండు. ‘అక్కడ కూడా మనలెక్కనే మనుషులున్నరు. మనలెక్కనే రైతులున్నరు. మనలెక్కనే కూలీలున్నరు. మనలెక్కనే పసిపిల్లలున్నరు. వాళ్ల ఇండ్లు కూలగొడుతున్నరట. బాంబులేసి పిల్లల్ని చంపుతున్నరట. అందుకే మా మాస్టారు వాళ్లకు సంఘీభావం తెలపాలన్నడు.’ కొమురయ్య చేతిలోని గడ్డి పరక నేలమీద జారిపోయింది. ‘అట్లనా బిడ్డా!’ ఆ మాట వినగానే అతని మనసు గతంలోకి జారిపోయింది. కొమురయ్యకు చిన్నప్పటి దొరల కాలం గుర్తుకొచ్చింది. ఊరి మీద దొర పెత్తనం, పటేలు పట్వారీల దౌర్జన్యం, వెట్టిచాకిరీ, భూమి కోసం జరిగిన కొట్లాటలు కండ్లముందు కదలాడినయి.
ఒకసారి దొర మనుషులు వాళ్లింటికి వచ్చి గాదెలో ఉన్న జొన్నలు బలవంతంగా ఎత్తుకపోయిన సంఘటన ఇప్పటికీ అతనికి గుర్తుంది. ఆ జొన్నలతోనే ఆ కుటుంబం ఏడాదంతా బతకాలి. తాత ఎదిరిస్తే కర్రలతో కొట్టినరు. నాయన వెట్టికి పోనంటే ఊరి మధ్యలో నిలబెట్టి అవమానించినరు. ఆ రోజుల్లోనే రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన మనుషులను చూశాడు. ఊళ్లకు ఊళ్లు కదిలిన రైతులను చూశాడు. నేల కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని పోరాట యోధుల కథలు విన్నాడు. అతని తాత చెప్పిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతుంటయి.
‘భూమి మీద హక్కు లేనోడికి బతుకు మీద కూడా హక్కుండదు రా! దొర మనిషిని మనిషిగా చూడనప్పుడు తలవంచి బతకడం కంటే ఎదిరించి నిలబడటమే మేలు.’ ఆ మాటలు గుర్తుకొచ్చిన కొమురయ్య తనలో తానే అనుకున్నడు. ‘మరి ఇప్పుడు ఆ పాలస్తీనా వాళ్లకు కూడా తమ భూమి లేకుండా చేస్తున్నరా? తమ ఇంట్లో తామే పరాయివాళ్లను చేస్తున్నరా?’
ఆ సాయంత్రం ఊరి బడిలో పాలస్తీనా ప్రజల సంఘీభావ సభ పెట్టిండ్రు. బడిగోడల మీద పిల్లలు గీసిన బొమ్మలున్నయి. ఒక బొమ్మలో చిన్న పిల్లవాడు తన తల్లి చెయ్యి పట్టుకుని శిథిలాల మధ్య నిలబడి ఉన్నడు. ఇంకో బొమ్మలో నేలమట్టమైన ఇంటి ముందు ఒక ముసలాయన చేతిలో ఇంటి తాళం పట్టుకుని నిలబడి ఉన్నడు. అతని కళ్లల్లో దుఃఖం కనిపిస్తోంది. కొమురయ్య ఆ బొమ్మల ముందు చాలాసేపు నిలబడ్డడు. ‘ఈ ముసలాయన చేతిలో తాళం ఎందుకున్నది సారూ?’ అని ఉపాధ్యాయుడ్ని అడిగిండు.‘అది వాళ్ల ఇల్లు తాతా! ఆ ఇంటిని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. మళ్లీ ఎప్పుడో ఒకరోజు తిరిగొస్తామనే ఆశతో ఇంటి తాళం దాచుకున్నడు’. కొమురయ్య గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ‘అయ్యో! ఇల్లు పోతే మళ్లీ కట్టుకోవచ్చు సారూ. మనిషి జ్ఞాపకాలు దాచుకున్న గడపే లేకుంటే ఎట్ల బతుకుతడు? ఆ ఇంటి ముందు పెరిగిన చెట్టును, ఆ చెట్టు కింద ఆడుకున్న పిల్లలను, ఆ గడప మీద కూసుని కబుర్లు చెప్పుకున్న మనుషులను ఎక్కడ వెతుక్కుంటడు?’
మాస్టారు అతనివైపు చూశాడు. ‘అందుకే వాళ్లు తమ ఇంటి తాళాలను ఇప్పటికీ దాచుకుంటున్నరు కొమురయ్యా! ఆ తాళం వాళ్లకు ఒక ఇంటిని మాత్రమే గుర్తుచేయదు. తమ నేల మీద తమకున్న హక్కును గుర్తుచేస్తుంది.’ ‘అంటే తాళం చేతిలో ఉన్నా ఇంట్లోకి పోనివ్వరన్నమాట!’
‘అవును తాతా!’కొమురయ్య చాలాసేపు ఆ బొమ్మనే చూస్తూ నిలబడిపోయిండు. సభ మొదలైంది. మాస్టారు పిల్లల ముందు ప్రపంచ పటాన్ని పరిచాడు. ‘ఇదిగోండి పిల్లలూ! ఇది పాలస్తీనా. ఇది గాజా. ఇది వెస్ట్ బ్యాంక్. తరతరాలుగా పాలస్తీనా ప్రజలు ఈ నేల మీద బతుకుతున్నారు. వాళ్ల ఊళ్లు, పొలాలు, ఇండ్లు, పండుగలు, సంస్కృతి అన్నీ ఈ నేలతోనే ముడిపడి ఉన్నాయి.’ ‘మాస్టారూ! మరి వాళ్లు ఇప్పుడు అక్కడ ఎందుకు ఉండలేకపోతున్నరు?’ ఒక పిల్లాడు అడిగిండు. ‘1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన సమయంలో లక్షలాది మంది పాలస్తీనా ప్రజలు తమ ఇండ్లను, ఊళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు. ఆ విషాదాన్ని వాళ్లు ‘నక్బా’ అంటారు.
అంటే మహా విపత్తు. ఆ తర్వాత 1967 యుద్ధంలో గాజా, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం ఇజ్రాయెల్ ఆక్రమణలోకి వెళ్లాయి. అప్పటి నుంచి ఆక్రమణలు, నిర్బంధాలు, భూదోపిడీ, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.’ ‘మరి వాళ్లకు సొంత దేశం లేదా మాస్టారూ?’ ఓ చిన్నారి అడిగింది.
‘వాళ్లకు సొంత నేల ఉంది బిడ్డా! ఆ నేల మీద స్వేచ్ఛగా, గౌరవంగా బతికే హక్కు ఉంది. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసమే వాళ్లు పోరాడుతున్నరు.’ ‘మరి ఇన్ని దేశాలున్నయి కదా! ఎవ్వరూ వాళ్లను కాపాడరా?’ మాస్టారు కాసేపు ఆగాడు.
‘ప్రపంచంలో అధికారమున్న దేశాలన్నీ న్యాయం వైపు నిలబడవు బిడ్డా! కొన్ని దేశాలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం, ఆయుధాల అమ్మకాల కోసం యుద్ధాలకు మద్దతిస్తయి. అమెరికా, ఇజ్రాయెల్ విధానాలు అందుకు ఉదాహరణలు. కానీ ప్రపంచంలోని సామాన్య ప్రజలంతా అట్లా ఉండరు. గాజాలో పిల్లలు చనిపోతుంటే అమెరికాలోనూ విద్యార్థులు రోడ్ల మీదకొస్తున్నరు. కార్మికులు గొంతెత్తుతున్నరు. ప్రపంచవ్యాప్తంగా యువత, మహిళలు, ప్రజాస్వామిక శక్తులు పాలస్తీనా ప్రజలకు అండగా నిలుస్తున్నయి.’
‘మాస్టారూ! మన భారతదేశం కూడా వాళ్లకు అండగా ఉంటుందా?’ ‘తప్పకుండా ఉండాలి బిడ్డా! మన దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. మనకు స్వాతంత్ర్యం రాకముందే మన జాతీయోద్యమ నాయకులు పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతిచ్చినరు. 1947లో ఐక్యరాజ్యసమితి పాలస్తీనా విభజన ప్రణాళికను ప్రతిపాదించినప్పుడు భారతదేశం దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అలీనోద్యమ స్ఫూర్తితో పాలస్తీనా ప్రజల హక్కులకు అండగా నిలిచింది.’ ‘అంటే మనం కూడా వాళ్లకు సాయం చేయాలన్నమాట!’ ‘అవును బిడ్డా! అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించడం మన బాధ్యత.’ అప్పటిదాకా వెనుక వరుసలో కూసున్న కొమురయ్య లేచిండు.‘మాస్టారూ! నేనొక మాట చెప్తా వినుండ్రి’.. సభలో ఉన్నవాళ్లంతా అతనివైపు చూశారు.‘మా తాతలు తెల్లదొరల మీద పోరాడింది ఎందుకు? మన నేల మీద మనం బతకాలనే కదా! మా ఊరి దొరలు మా భూములు లాక్కుంటే మేము ఎదిరించినం. మా ఇండ్ల నుంచి మమ్మల్ని వెళ్లగొట్టాలని చూస్తే ఎదురుతిరిగినం. మరి ఇంకో దేశం వాళ్లను వాళ్ల ఇండ్ల నుంచి వెళ్లగొడుతుంటే మనం ఎట్లా ఊరుకుంటం?’
అతని మాటల్లో ఆవేశం కంటే ఆవేదనే ఎక్కువగా ఉంది. కొమురయ్య మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టిండు. ‘మన దేశం ఒకప్పుడు ఎవరి ముందు తలవంచకుండా ఉండాలని చెప్పింది. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తింది. ఇప్పుడు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్తోటి స్నేహం పేరుతో పాలస్తీనా ప్రజల బాధ గురించి గట్టిగా మాట్లాడకపోవడం బాధగుంది. స్నేహం వేరు, అన్యాయాన్ని సమర్థించడం వేరు కదా సారూ! మన దేశం తన పాత మాటను, తన పాత విలువలను మరిచిపోవద్దు.’ సభలో నిశ్శబ్దం అలుముకుంది. ‘మా తాత చెప్పిన మాట ఒకటి గుర్తుకొస్తుంది. దొర ఇంటి ముందు పేదోడు తలవంచి నిలబడితే దొర పెత్తనం పెరుగుతదని. అన్యాయం జరిగేటప్పుడు ఎవరో ఒకడు గొంతెత్తాలె. లేకపోతే రేపు మన ఇంటి మీదికి వచ్చినప్పుడు మనకోసం గొంతెత్తే మనిషి ఉండడు. మన ఇంటి పొయ్యి ఆరిపోతే మనకు ఎంత కడుపుమంట ఉంటదో, ఇంకో ఇంటి పొయ్యి ఆరిపోయినా అంతే కదా! మన పిలగాడు బడికి పోతుంటే మనకు ఎంత సంతోషమో, వాళ్ల పిల్లలు బడికి పోతుంటే వాళ్ల తల్లిదండ్రులకు కూడా అంతే సంతోషం ఉంటది. మరి వాళ్ల బడుల మీద బాంబులెందుకు వేస్తున్నరు? దూరంగా ఉందని ఒక మనిషి బాధ మన బాధ కాకుండా పోతదా?’ పిల్లల చప్పట్లు బడిగోడల్ని తాకి మార్మోగినయి.
సభ అయిపోయినంక కొమురయ్య ఇంటికి పోయిండు. అతని మనవరాలు లాస్య బడిలో గీసిన పాలస్తీనా బొమ్మను పట్టుకుని వచ్చింది.
‘తాతా! ఈ బొమ్మను నీకు ఇస్తున్నా. ఇందులో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఇద్దరు పిల్లలున్నరు. వాళ్ల ఇంటిని ఎవరూ కూలగొట్టకుండా ఉండాలని నేను గీసిన.’ కొమురయ్య బొమ్మను చేతిలోకి తీసుకుని చూశాడు. ‘బాగుంది బిడ్డా! మన పాలకుర్తిలో కూడా ఇంటి ముందు వేపచెట్టు, బాదం చెట్టు ఉంటయి కదా! వాళ్ల ఇంటి ముందు కూడా చెట్టు ఉంటదన్నమాట.’ ''అవును తాతా! వాళ్లకు కూడా మనలాగే ఇల్లంటే ఇష్టమే. వాళ్లకూ అమ్మానాన్నలుంటరు. వాళ్లకూ పండుగలుంటయి. వాళ్లకూ బడికెళ్లాలని ఉంటది. మనలెక్కనే వాళ్లకు కూడా ఆడుకోవాలనుంటది.’
‘మరి వాళ్లను బతకనియ్యరా?’‘లేదు తాతా! అందుకే మనం వాళ్లకు అండగా ఉండాలె.’ ఆ చిన్నారి మాటలకు కొమురయ్య కళ్లు చెమ్మగిల్లినయి.
‘బిడ్డా! మనిషి గొప్పతనం తన కడుపు నింపుకోవడంలోనే ఉండదు. పక్కోడు ఆకలితో ఉంటే వాడి ఆకలి గురించి ఆలోచించడంలో ఉంటది. తన బిడ్డల్ని ప్రేమించడమే కాదు, ఎక్కడో ఉన్న ఇంకో బిడ్డ చావు గురించి విని కన్నీళ్లు పెట్టుకోవడంలో ఉంటది. అదే అసలైన మనిషితనం.’
లాస్య కాసేపు ఆలోచించి అడిగింది. ‘తాతా! మనం కూడా వాళ్లకు ఉత్తరం రాయొచ్చా?’ ‘ఎందుకు రాయకూడదు బిడ్డా? మనసులో మాటను రాయడానికి దూరం అడ్డం వస్తదా?’ ఆ రాత్రి లాస్య తన పలక మీద ఒక వాక్యం రాసింది. ‘పాలస్తీనా పిల్లలారా! మీకు మళ్లీ బడికి వెళ్లే రోజులు రావాలని కోరుకుంటున్నాం.’ కొమురయ్య ఆ పలకను చూసి మనవరాలిని దగ్గరకు తీసుకున్నడు. మరుసటి రోజు పల్లె కూడలిలో చిన్న సభ జరిగింది. ఎర్రజెండాలు ఎగిరినయి. పిల్లలు నినాదాలిచ్చినరు.
‘గాజా బిడ్డలకు బతికే హక్కు కావాలి!, పసిపిల్లలపై బాంబులు వద్దు!, ఇళ్లు కూల్చడం ఆపాలి.. ప్రాణాలు తీయడం ఆపాలి!, పాలస్తీనా నేల పాలస్తీనా ప్రజలదే!, పాలస్తీనా ప్రజలకు స్వేచ్ఛ కావాలి!’.. కొమురయ్య కూడా సభకు వచ్చిండు. చేతిలో మనవరాలు గీసిన బొమ్మ ఉంది. మాట్లాడమని అడిగితే మొదట కొంచెం తడబడ్డడు. తర్వాత తన సహజమైన తెలంగాణ యాసలో ‘నాకు పెద్ద పెద్ద దేశాల పేర్లు తెల్వవు. అమెరికా ఎక్కడుంటదో, ఇజ్రాయెల్ ఎక్కడుంటదో కూడా తెల్వదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. ఆకలితో ఏడ్చే బిడ్డ ఏ దేశంలో ఉన్నా ఆ ఏడుపు ఒకటే. తన బిడ్డను కోల్పోయిన తల్లి బాధ ఏ భాషలో చెప్పినా ఒకటే. మన ఊరి రైతు తన భూమిని ప్రేమిస్తడు. తన ఇంటి గడపను ప్రేమిస్తడు. తన బిడ్డల్ని ప్రేమిస్తడు. మరి పాలస్తీనా రైతు తన నేలను ప్రేమించకూడదా? తన ఇంటిని కాపాడుకోకూడదా? తన బిడ్డల్ని బతికించుకోకూడదా? మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనం ఎంత సంబురపడ్డమో, వాళ్లకు కూడా స్వేచ్ఛ కావాలె కదా!
మన పిల్లలు బడికి పోతున్నప్పుడు వాళ్ల పిల్లలు కూడా బడికి పోవాలె కదా! మన ఇండ్ల ముందు పూల చెట్లు పూస్తున్నప్పుడు వాళ్ల ఇండ్ల ముందు కూడా పూలు పూయాలె కదా! మన దేశానికి ఒక చరిత్ర ఉంది. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతిచ్చిన చరిత్ర ఉంది. ఆ చరిత్రను మరిచిపోవద్దు. మన దేశం ఎవరి యుద్ధాలకు బానిస కాకూడదు. ఎవరి ఆయుధాల వ్యాపారం కోసం మనిషి ప్రాణాలను తక్కువ చేయకూడదు. మన దేశం శాంతి వైపు, న్యాయం వైపు నిలబడాలె. ఇంకో మాట చెప్తా వినుండ్రి. మన ఇంటి ముందు మంటలు అంటుకుంటే నీళ్లు తీసుకెళ్లి ఆర్పుతం. పక్కింట్లో మంటలు అంటుకుంటే కూడా పరుగెత్తుకుపోతం. మరి సముద్రాల అవతల ఒక దేశం మంటల్లో కాలిపోతుంటే మనకు సంబంధం లేదనడం ఎట్ల? మన పిల్లల చేతుల్లో పలకలు ఉండాలె. పాలస్తీనా పిల్లల చేతుల్లో కూడా పలకలే ఉండాలె. ఏ పిల్లాడి చేతిలోనూ తుపాకీ ఉండొద్దు. ఏ తల్లి ఒడిలోనూ బిడ్డ శవం ఉండొద్దు. ప్రపంచంలోని ప్రతి బిడ్డ నవ్వుతూ బడికి పోవాలె. ప్రతి తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి కలలు కనాలె. అంతకంటే మనకు కావాల్సిందేముంది?’. అతని మాటలు వింటున్నవాళ్ల కళ్లల్లో నీళ్లు తిరిగినయి.
ఆ రాత్రి కొమురయ్య ఇంటి అరుగు మీద పడుకున్నడు. ఆకాశంలో చుక్కలు మిలమిలా మెరుస్తున్నయి. మనవరాలు పక్కనే పడుకుని ఉంది.
‘తాతా! పాలస్తీనా పిల్లలకు మన మాటలు వినిపిస్తయా?’ అని అడిగింది. కొమురయ్య ఆకాశం వైపు చూసిండు. ‘ఎందుకు వినిపించవు బిడ్డా! మన మాటలు వాళ్ల చెవులకు చేరకపోయినా, మన మనసుల్లో వాళ్ల బాధ బతికుంటది. ప్రపంచమంతా మనుషుల గుండెలు ఒకటైతే ఆ గుండె చప్పుడు ఎక్కడైనా వినిపిస్తది.’ ‘మరి వాళ్ల ఇండ్లు మళ్లీ కట్టబడతయా తాతా?’ ‘కట్టబడతయి బిడ్డా! తప్పకుండా కట్టబడతయి. కానీ ముందు ఆ బాంబులు ఆగాలె. ఆ తుపాకులు మూగబోవాలె. వాళ్ల నేల మీద వాళ్లకు హక్కు రావాలె. వాళ్ల పిల్లలు భయం లేకుండా బడికి పోవాలె. వాళ్ల తల్లులు కన్నీళ్లు కాకుండా పాటలు పాడాలె.’‘అప్పుడు వాళ్ల చెట్లకు కూడా పూలు పూస్తయా తాతా?’ ‘పూస్తయి బిడ్డా! మన పాలకుర్తిలో పూసినట్టే అక్కడ కూడా పూస్తయి.’ ‘తాతా! వాళ్ల బడిలో కూడా మనలెక్కనే పిల్లలు పాటలు పాడుకుంటరా?’
‘పాడుకుంటరు బిడ్డా! బాంబుల మోత ఆగితే పిల్లల నవ్వులే వినిపిస్తయి. తుపాకులు మూగబోతే పుస్తకాల పేజీలే పలుకుతయి.’ ఆ చిన్నారి తాత చెయ్యి పట్టుకుని నిద్రలోకి జారుకుంది. కొమురయ్యకు మాత్రం నిద్ర పట్టలేదు. తన ఊరి పొలాల నుంచి పాలస్తీనా నేల వరకు ఒకటే ఆలోచన అతన్ని వెంటాడింది. భూమి ఎవరిది? దాన్ని దున్నేవాడిదా? లేక తుపాకీ పట్టుకున్నవాడిదా? ఇల్లు ఎవరిది? అందులో తరతరాలుగా బతికిన కుటుంబానిదా? లేక బాంబు వేసి నేలమట్టం చేసేవాడిదా? దేశం ఎవరిది? ఆ నేల మీద పుట్టి పెరిగిన ప్రజలదా? లేక బలవంతంగా ఆక్రమించుకునే అధికారానిదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే అతని కళ్లు మూతపడ్డయి. నవంబర్ 29 వచ్చింది. ప్రపంచమంతా పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవాన్ని పాటిస్తోంది. ఎక్కడో విద్యార్థులు రోడ్ల మీద నినదిస్తున్నారు. ఎక్కడో కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఎక్కడో మహిళలు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. ఇంకెక్కడో ప్రజాస్వామిక శక్తులు పాలస్తీనా ప్రజల హక్కుల కోసం గొంతెత్తుతున్నాయి.
పాలకుర్తి పల్లెలో కూడా ఆ రోజు ఎర్రజెండా ఎగిరింది. పాలస్తీనా ఎక్కడుందో తెలియని కొంతమంది ముసలివాళ్లు కూడా ఆ సభకు వచ్చారు. ప్రపంచ రాజకీయాలు తెలియని కొంతమంది రైతులు కూడా నినాదాలు చేశారు. పెద్ద పెద్ద సిద్ధాంతాలు చదవని మహిళలు కూడా గాజా పిల్లల కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్లకు ఒక విషయం తెలుసు. తమ ఇంటి గడప కూలిపోతే ఎంత బాధో, ఇంకొకరి ఇంటి గడప కూలిపోయినా అంతే బాధ. తమ బిడ్డకు ఆకలి వేస్తే ఎంత బాధో, ఇంకొకరి బిడ్డ ఆకలితో ఏడ్చినా అంతే బాధ. తమ నేల మీద పరాయి పెత్తనం ఎంత అన్యాయమో, ఇంకొకరి నేల మీద పరాయి పెత్తనం కూడా అంతే అన్యాయం. ఆ రోజు కొమురయ్య మనవరాలు సభ చివర నిలబడింది. కొమురయ్య మనవరాలి చేతిలోని బొమ్మను తీసుకుని సభలో ఉన్నవాళ్లకు చూపించాడు. ‘ఈ బొమ్మను చూడుండ్రి. ఇది మన పాలకుర్తిలోని ఇల్లు కాదు. గాజాలోని ఇల్లు. ఈ ఇంటి ముందు కూడా మన ఇంటి ముందున్నట్టే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద మన పిల్లల్లాంటి పిల్లలే ఆడుకుంటున్నరు. వాళ్లకు కూడా మనలాగే బతకాలనే ఆశ ఉంది. మనకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదనే కదా మన పోరాటాల అర్థం!’
ఆ మాటతో సభలో మరోసారి చప్పట్లు మార్మోగినయి. ఆ పల్లెకు పాలస్తీనా ఎక్కడుంటదో ఇప్పటికీ చాలామందికి తెల్వదు. కానీ పాలస్తీనా ప్రజల బాధ ఎక్కడుంటదో మాత్రం వాళ్లకు అర్థమైంది. అది ఆక్రమించబడిన భూమిలో ఉంది. నేలమట్టమైన ఇంటి శిథిలాల్లో ఉంది. తల్లి ఒడిని వెతుక్కుంటున్న అనాథ బిడ్డ కళ్లల్లో ఉంది. బడి గుమ్మం చూడకుండానే ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల నిశ్శబ్దంలో ఉంది. కనుక ఆ పల్లె ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. పాలస్తీనా ప్రజలకు స్వేచ్ఛ కావాలి. వారి నేల మీద వారికి హక్కు కావాలి. ఆక్రమణలు ఆగాలి. పౌరులపై దాడులు ఆగాలి. యుద్ధాలకు ముగింపు పలకాలి. ప్రపంచం ముందు మానవత్వం గెలవాలి. తెలంగాణ మట్టికి పోరాటం కొత్త కాదు. అన్యాయాన్ని ఎదిరించడం కొత్త కాదు. తన గడపను కాపాడుకోవడం కోసం పోరాడిన నేల అది. ఇంకొకరి గడప కూలిపోతుంటే చూస్తూ ఊరుకోని మనుషుల నేల అది. ఆ రోజు పాలకుర్తి ఊరు నుంచి ఒక పిలుపు బయలుదేరింది. ‘పాలస్తీనా మా పక్కింటి ఊరు కాకపోవచ్చు.. అక్కడి ప్రజల కన్నీళ్లు మా కన్నీళ్లే! వాళ్ల స్వేచ్ఛ మా స్వేచ్ఛకు మరో పేరు!!’ మనిషి మనిషికి అండగా నిలబడినప్పుడే ప్రపంచం బతుకుతుంది. పాలస్తీనా ప్రజలకు విముక్తి కలగాలి. భారత్ - పాలస్తీనా ప్రజల సంఘీభావం వర్ధిల్లాలి.
మామిండ్ల రమేష్ రాజా, 7893230218






కామెంట్లు (0)