విరిగిన పూల చెట్ల కింద
మళ్ళీ మాట కలుపుకోవాలి
ఎత్తిపోసుకున్న మట్టిని
పువ్వుల్లా దులుపుకోవాలి
సత్తువంతా వదిలిపోయి
నోరెళ్ళబెట్టిన నదీ తీరాన
నడక మరచిపోయిన నావ దగ్గర
ఒద్దికగా కాసేపు మాట్లాడుకోవాలి
అడుగుల్లో పోత పోసిన వెన్నెల
మబ్బులు వచ్చి చెదిరిపోకముందే
మట్టి నుండి తవ్విన మాటల్ని
మనసు నిండా పూసుకోవాలి
నది పారుతున్నంతసేపే
ఒడ్డుల ఎడమొహాలు
చివరి నీరు రాలిపోయాక
ఏ ఒడ్డుకూ అర్థం మిగిలుండదు
నీరు ఇంకిపోయిన చోట
రాలిన మాట బతికిపోతుంది
కాలం మొనలపై ఎప్పటికీ
ముదురాకుగానే ఉండిపోతుంది
ఇప్పటికిప్పుడు,
నదికొచ్చిన డోకా ఏమీ లేదు
మనమే బతికుండడం కావాలి
లేకపోతే, మాట మోసుకుపోతాం
- వినోద్ కుత్తుం,
9634314502







కామెంట్లు (0)