Magazines

పునాది రాయి

45 నిమిషాల క్రితం

పునాది రాయి
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం



1

అప్పుడెప్పుడో తండ్రిచ్చిన చిరుగుల గొడుగు,

అది ఆకారానికే ఒక వస్తువు

ఎండను ఎదిరించి నీడనివ్వదు

వాన కురిస్తే తడవకుండా ఆపదు

అయినా దాని కింద-

కాలపు ఒరిపిడిలో నలిగిన ఆకులా

పనిముట్లను ముందేసుకొని

ముడుచుకు కూర్చున్న దేహమొకటి.

2

కత్తి, ఆరె, గూటం, పనిరాయి-

చేతివేళ్ల కొనసాగింపులైన ఇనుప నరాలు

ముడతలు పడ్డ చేతుల స్పర్శతో

పులకించే నిర్జీవపు పాత చెప్పుల్లోకి

ఊపిరిని నింపుతున్న

తాతముత్తాతల చేతిపని.

3

గుండ్రని బూతద్దాల కళ్ళజోడు వెనుక

నలభై ఏళ్ల ఎండమావుల వెలుతురు

ఎద్దుకొమ్ములో దాచిన మిగ్గి స్పర్శతో

మొండి తోలులోకి సుతారంగా దిగే ఆరె

ప్రతి కుట్టుకూ..

చిట్లిపోతున్న బతుకును బిగించి కడుతున్న

నమ్మకపు తోలుదారం.

4

నకనకలాడే ఆకలి బాధ కొండంతై

నెత్తిపై కూర్చున్న అలసట భారం

నెర్రెలుబారిన దేహంతో

ఈ నగరపు పరుగులనన్నిటినీ

నిశ్శబ్దంగా మోస్తున్న

భూమిపుత్రుడు.

5

వర్షపు నీటిలో కొట్టుకుపోయే పాత చెప్పులు

సుడులు తిరిగే నీళ్లలో తేలే ఎండుటాకుల్లా

మెరిసే కొత్తజోళ్ళు చిగురించిన పసిమొగ్గలు

గుండె చప్పుడులా వినిపించే ప్రతి కుట్టూ,

కాలపు ముద్రలా పడే

ప్రతి తోలుదారపు ముడీ-

రక్తమాంసాలతో రాసుకున్న

జీవన చరిత్ర.

6

తలుపులు, కిటికీలు లేని

పూరిగుడిసెకే పరిమితమైన

నిరుపేద ప్రపంచం-

ఎగుడుదిగుడు బాటల్లో

నడిచే ఊరి పాదాలకు

ముళ్ళు గుచ్చుకోకుండా

నెత్తురు చుక్క నేల ముద్దాడకుండా

కాపాడే తోలుజోడు

7

అతడు కేవలం బతుకు తెరువు కోసం

చెప్పులు కుట్టే మాదిగోడు మాత్రమే కాదు

కఠినమైన ముళ్లబాటలన్నీ

పూలబాటలయ్యేలా

మనుషుల నడక కింద

తన గుండెను పరిచిన

పునాది రాయి.

- విల్సన్ రావు కొమ్మవరపు,

89 854 35 515

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్