ఊరి చివర పెద్ద మర్రిచెట్టు బాగా ఊడలు దిగి ఉన్నాయి.రోజూ చెట్టుకింద పిల్లలు ఆడుకుంటే కొంచెంపెద్దపిల్లలు ఊడలుపట్టి ఊగేవారు.పిల్లల కి కూడా అలా ఊగాలని ఉండేది.కానీ వారి బుల్లిచేతులు అంత గట్టిగా పట్టుకుని ఊగే శక్తిలేక ఉసూరనేవారు. శివ ఒకరోజు వారి బాధ చూడలేక.. ‘ఇదిగో నాభుజం మీద ఒకరు కూచోండి. నేను ఊడతో ఊగుతే మీరు కూడా ఊగవచ్చు’ అన్నాడు. అలా ఇద్దరు ముగ్గురుపిల్లల్ని ఊపాడు. ఇక పిల్లలంతా గోల పెట్టారు ‘అన్నా! మమ్మల్ని ఊపవా?’ అంటూ.
‘అరె! ఇప్పటికే నాభుజాలు నొప్పి పడుతున్నాయి. అతి పనికిరాదు. రేపు ఇంకో ఇద్దరిని ఊపుతా’ అన్నాడు. కానీ రాము ఏడ్పు మొదలెట్టాడు. శివ అన్నాడు ‘అరె! ఆవేశం కోపం అనర్ధం. మీకో కథ చెప్తాను వినండి. ఒక చెట్టుపై కాకి గూడు కట్టి పిల్లలతో హాయిగా ఉంది. ఆ చెట్టు కింద బొరియలో ఓఎలుక ఉంది. ఎలుకకి తన కన్నం చీకటిగా ఇరుకుగా ఉండటం నచ్చటంలేదు. ఒకరోజు కాకితో ‘కాకీ! ఎంచక్కా చెట్టుపై గూడులో దర్జాగా ఉంటావు. నాకన్నం చీకటికొట్టం. దాన్ని పెద్దగా తవ్వుతాను’ అన్నది. ‘వద్దు, నీ బొరియ పెద్దది చేస్తే శత్రువులు చొరబడవచ్చు. పిల్లి తిరుగుతోంది. జాగ్రత్త’ అని సమాధానం చెప్పింది కాకాఇ.
‘ఆ! చీకట్లో నాకు కష్టంగా ఉంది’ అని ఎలుక తన కన్నాన్ని బాగా తవ్వేసింది. బాగా ఎండ పడటంతో ఖుషీగా గంతులేసింది. పైనుంచి కాకి చూస్తోంది. దూరంగా పిల్లి మెల్లగా అడుగులేస్తూ వస్తోంది. కాకి అరుస్తుండగానే పిల్లి చటుక్కున ఎలుకను నోట కరుచుకు దౌడు తీసింది. కాకి పిల్లిపై వాలి దాని మూతిపై పొడవటంతో పిల్లి బాధగా నోరు తెరిచి మ్యావ్ అనటం ఆలస్యం ఎలుక బతుకుజీవుడా అని కన్నం లోపలికి దూరింది. కానీ పిల్లి మూతిని బొరియలో దూర్చి దాని తోకను పట్టి బైటికి లాగి నోట కరుచుకు పారిపోయింది.
‘అయితే అన్నా! మేమంతా నీలాగా ఊడపట్టుకు ఊగితే ఢాం అని కింద పడి దెబ్బలు తగిలి ఏడుస్తాం కదూ?’ రోహిత్ మాటలకి శివ ‘ఔను’ అని ‘ఆవేశం అనర్థం’ అనగానే పిల్లలు కిక్కురుమనక ఇంటికి పరుగుదీశారు.
అచ్యుతుని రాజ్యశ్రీ, 8985035283







కామెంట్లు (0)