కొందరు నటులు తారలుగా ఎదుగుతారు. కొందరు సుపరిచితమైన ముఖాలుగా మిగిలిపోతారు. ఇంకొందరు తాము పోషించే పాత్రలతో వారి ఉనికి విడదీయరాని విధంగా ముడిపడిపోతారు. నానా పటేకర్ ఈ చివరి కోవకు చెందుతాడు. చాలామందికి ఆయన ‘క్రాంతివీర్’లోని హీరో. ఇతరులకు ‘పరిందా’లోని గ్యాంగ్‌స్టర్, ‘ప్రహార్’లోని సైనికుడు, ‘ఖమోషీ ది మ్యూజికల్’ లోని సమస్యలతో సతమతమయ్యే ఉపాధ్యాయుడు, ‘అబ్ తక్ చప్పన్’లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ‘రాజనీతి’లో రాజకీయ నాయకుడు, ‘నట్ సామ్రాట్’లో వయసు మళ్లిన నాటక నటుడు, ‘వెల్కమ్’లోని ఉదయ్ శెట్టి. వీరందరూ నానా పటేకరే. అయినా వారిలో ఎవరూ ఒకే వ్యక్తిలా లేరు. మనకు అలా కనిపించరు కూడా.
నానా పటేకర్ భారతీయ సినిమా రంగంలోని పది మంది అందగాళ్లలో ఒకడిగా పిలవబడతాడని చెప్పలేము. అందం, కండలు, జుట్టు అలంకరణలో లోపాలు ఉన్నా, నటన ఆయనకున్న ఒకే ఒక గొప్ప ఆయుధం ఉంది. అత్యంత సహజంగా నటించగలడు. బాలీవుడ్లో ప్రధాన అర్హత డ్యాన్స్ చేయడం, కన్ను కొట్టడం, డిజైనర్ బట్టలు, గాగుల్స్‌తో మాచోగా కనిపిస్తూ కనుబొమ్మ ఎగరేయడం అయినప్పుడు, నటించగలగడం అనేది ఒక అనర్హతే. నానా అలా కాదు. ఆయన లోతైన బేస్ గొంతులో కూడా ఒక మోటుదనం ఉంటుంది, అది ఆయనను కఫ్ పరేడ్ కంటే ధారవికి దగ్గరగా నిలబెడుతుంది. అయినా ఆ మనిషికి ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం వస్తుంది. ఏ ప్రమాణంలో చూసినా అది ఎక్కువే. అమితాబ్ బచ్చన్ మృత్యుదాతా ఘోరంగా ఫ్లాప్ అయిన తర్వాత, బిగ్ బి తర్వాత సినిమా ఫ్లాప్ కాకుండా చూడటానికి నానానే వరుసలో నిలబెట్టారు. ఆయన వృత్తిపరమైన స్థాయికి ఇంతకంటే మరొక సర్టిఫికెట్ అవసరం లేదు.
కానీ ఆ మనిషి మూడీ. అనిపిస్తే బూతులు తిడతాడు. మరో క్షణంలో ఏడుస్తాడు. ఆయనలో దాగి ఉన్న రైటిస్ట్ భావజాల సంప్రదాయవాదం ఆయన తీసే సినిమాల్లో కనిపిస్తుంది. అది ఆయనను దేశ అభ్యున్నతి, విలువల పునరుజ్జీవనం, నిర్బంధ సైనిక శిక్షణ గురించి మాట్లాడేలా చేస్తుంది. అవినీతికి, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడేలా చేస్తుంది. ఆయన కోపంతో కూడిన చాలా పాత్రలు విఫలమైన ఆదర్శవాది సహజ నిరాశావాదాన్ని ప్రదర్శిస్తాయి. ఆయన పాత్రలు విషయభరితంగా ఉంటాయి. హావభావాలను చక్కగా వాడుకుంటాడు. పరిందాలో విలన్ పనులు తప్పినప్పుడు నుదురు కొట్టుకుంటాడు. క్రాంతివీర్లో కథానాయకుడు వెర్రి నవ్వు నవ్వుతూ ‘చిన్న మెదడు మీద కొట్టకు’ అని అంటాడు. ప్రహార్‌లో పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఫైటింగ్ పోజు కొడతాడు.
అంత క్యారికేచర్ ఉన్నా ఆయన కపటి కాదు. ప్రముఖ నటుడైన చాలా కాలం తర్వాత కూడా మాహిమ్‌లోని ఒక బార్లో పాత స్నేహితులతో కలిసి తాగేవాడు. కొడుకు పుట్టినరోజును అనాథాశ్రమంలో జరుపుకుంటాడు. షూటింగులకు తన మధ్యతరగతి తల్లిని తీసుకువస్తాడు. తన జీతంలో కొంత భాగాన్ని ప్రధానమంత్రి నిధికి ఇచ్చేవాడు. చాలా దానధర్మాలకు ఖర్చు చేసాడు. ఆత్మహత్యలు చేసుకోబోతున్న రైతుల జీవితాలలో వెలుగులు నింపడానికి తాను సంపాదించిన దాంట్లో కొంత భాగం ఖర్చు చేసిన అసలు సిసలైన సామాజిక కార్యకర్త నానాపాటేకర్. ఎవరైనా ఇంటర్వ్యూ కావాలని అడిగితే.. కానీ నానాకు ఇంటర్వ్యూలు అంటే అసహ్యం. ‘నన్నెందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు? జీవితంలో నేనేం చేశాను? ఏ విషయం మీద నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు?’ అంటూ ఫోన్లో కొన్ని నిమిషాల పాటు గొంతు పెంచుతాడు. కొంత బతిమాలిన తర్వాత చివరకు ఒప్పుకునేవాడు. రంగస్థలంపై, సినిమా తెరమీద ఆయన నటించిన పాత్రలలో ఎన్ని వైరుధ్యాలు కనపడతాయో ఆయన జీవితంలో కూడా అన్ని వైరుధ్యాలు కనిపిస్తాయి. మాట్లాడాలనుకున్నది మాట్లాడాడు. చెప్పాలనుకున్నది నిర్భయంగానే చెప్తాడు. ఏ సామాజిక సేవైనా ఒంటిచేత్తో చేసి చూపించాడు. ఎన్ని ఎత్తు పల్లాలు ఎదురైనా తన జీవితంలో స్వేచ్ఛనే కోరుకున్నాడు. చాలా సందర్భాల్లో వాదవివాదాలతో వార్తల్లో కనిపించినప్పటికీ, నటుడుగా తన స్థాయిని ఏనాడూ దిగజార్చుకోలేదు.
ఐదేళ్ల వయసులోనే నటించడం మొదలుపెట్టిన నానా చాలా కాలం మరాఠీ రంగస్థలంపై పనిచేశాడు. పురుష్, హమీదాబాయిచీ కొఠీతో సహా అనేక అవార్డు గెలుచుకున్న నాటకాల్లో నటించి, ఆ తర్వాత మరాఠీ టీవీ, సినిమాల్లోకి, ఆపై చంద్రా అంకుష్‌తో బాలీవుడ్‌లోకి వచ్చాడు. ‘నానా నటిస్తూనే చాలా పనులు చేశాడు. జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్స్ట్‌లో కమర్షియల్ ఆర్ట్స్ డిప్లొమా చేశాడు, ఒక ప్రకటనల ఏజెన్సీలో కూడా పనిచేశాడు. 13 ఏళ్ల వయసులోనే సినిమా పోస్టర్లు గీశాడు. తనకు ఒక పూట భోజనం, 35 రూపాయలు పగార్గా వచ్చేవి. ఆ సమయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేదు. ‘నేను అందంగా లేనని నాకు తెలుసు. కానీ నా నటన అందంగా ఉండాలని కోరుకున్నాను. నీ పని నీ గురించి మాట్లాడాలి. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా నీ గురించి ఎంత రాసినా, చివరకు లెక్కించేది నటనే’ అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. తన పాత్రల గురించి మాట్లాడటం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఒకప్పుడు ఫిల్మ్‌ఫేర్ జ్యూరీని విమర్శించిన ఆయన, 1995లో క్రాంతివీర్కి ఉత్తమ నటుడి అవార్డు గెలిచినప్పుడు బహిరంగంగా తన అభిప్రాయాన్ని మార్చుకుని, వేదికపైనే ఏడ్చేశాడు. ‘స్క్రీన్ అవార్డు వస్తుందని నాకు తెలుసు. కానీ ఫిల్మ్‌ఫేర్ అవార్డులపై నాకు అనుమానం ఉండేది. అవార్డులన్నీ కూరగాయల్లా అమ్ముడవుతాయని అనుకునేవాడిని. కానీ నాకు అవార్డు వచ్చినప్పుడు అది ఏడవ అంతస్తులో ఉన్నట్లు అనిపించింది. నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను’ అన్నారా సందర్భంలో. ఆయన భార్య నీలకాంతి చాలా కాలం ఆయన అవార్డు గెలవాలని ఆశించింది. ఇప్పుడు విడిపోయినా, వేదికపై ఆమె కలను గుర్తుచేసుకుని ఏడ్చేశాడు.
పరిందా గురించి ఆయన ‘‘నా విచిత్రమైన విలన్ పాత్ర నాకు ఎక్కువ మైలేజ్ ఇచ్చింది. ‘జావో అప్నే భాయ్ కో సంఝావో, నహీ సంఝా తో గోలీ మార్ దో’ అనే డైలాగ్ ఇప్పటికీ యువతకు ఇష్టమైనది’’ అనేవాడు. అంకుష్ గురించి ‘‘ఇతనీ శక్తి హమే దేనా దాతా అనే పాట ఇప్పటికీ నా ఆరు ఇంద్రియాల్లో మోగుతూ నన్ను లక్ష్యం వైపు నడిపిస్తుంది. హింస హింసను పెంచుతుంది, ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది అని ఆ సినిమా చెబుతుంది’’ అంటాడు. 1992 బొంబాయి అల్లర్ల సమయంలో శివసేనతో సన్నిహిత సంబంధాలున్నా శాంతి కోసం వీధుల్లోకి వచ్చి ప్రజలను హింస ఆపమని వేడుకున్నాడు. ఆ అనుభవాన్నే క్రాంతివీర్లో చొప్పించాడు. తిరంగాలో తాగుబోతు సీన్ కోసం నిజంగా తాగారా అంటే ‘నేను ఎప్పుడూ సెట్స్‌లో తాగలేదు. తాగి పని చేయలేను. ఆ సీన్ అంత నిజంగా అనిపించడం నాకు కాంప్లిమెంట్’ అన్న నానా తాగుబోతులు ఎలా ప్రవర్తిస్తారో గమనించి అలా చేశాడు. సమకాలీన సినీ, నాటక రంగాలలో చాలామంది సహజనటులు ఉన్నప్పటికీ, తెరపై ఏ పాత్రలోనైనా అసహ్యంగా జీవించగలిగిన నానా పాటేకర్ వంటి మహానటుడు మరొకరు లేరని చెప్పడంలో అతిశయం ఉండబోదు.
భవిష్యత్తు తన కొడుకు మల్హర్ దే అని అంటారు. ‘వాడు నటుడు కావాలనుకుంటే అవుతాడు. ప్రహార్‌లో చిన్నప్పటి నాలా నటించాడు. కానీ ఇప్పుడు 14 ఏళ్లు, ఆర్మీలో చేరాలనుకుంటున్నాడు. వాడు వ్యవసాయంలోకి వెళ్లాలని నేను కోరుకుంటున్నా. వాడు ఏది చేయాలనుకున్నా నేను సపోర్ట్ చేస్తా’ అనే నానా పాటేకర్ ఒక స్వేచ్ఛా భావనకు ప్రతీకగా నిలిచిన నటుడుగా భారతీయ రంగస్థల, సిని చరిత్రలో నిలిచిపోయాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆయన ప్రస్థానం, రంగస్థలం, హిందీ, మరాఠీ సినిమా అనేక విభిన్న కథన రూపాలలో సాగింది. నానా పటేకర్‌లో నిర్వచించడం కష్టమైన ఒక విషయం. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉనికి ఉంది. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఒక సన్నివేశంలోకి ప్రవేశించి, దాని వాతావరణాన్ని మార్చగలడు. ఆయన కోపాన్ని భయానకంగా, నిశ్శబ్దాన్ని అసౌకర్యంగా, దుఃఖాన్ని అత్యంత వ్యక్తిగతంగా, హాస్యాన్ని ఊహించని విధంగా సునాయాసంగా మార్చగలడు. ఆయన గొంతును ఎవరూ తప్పుగా గుర్తించలేరు. కానీ ఆ గొంతు వెనుక ఉన్న వ్యక్తిని ప్రేక్షకులు గుర్తుంచుకుంటూనే ఉన్నారు. ఆయన మరణంతో ఆయన కెరీర్ ముగిసింది. ఒక సంప్రదాయ సినీ స్టార్ అనే భావనలో ఇమడటానికి ఏనాడూ ఆసక్తి చూపని ఒక నిజమైన కళాకారుడిని మనం కోల్పోయాం.
ఆయనది రంగస్థలంపై రూపుదిద్దుకున్న నట జీవితం
సినిమాల్లో పేలిపోయే పరిందాలోని అన్నాగా, నటసామ్రాట్ లోని విషాద అప్పాసాహెబ్ గా మనకు తెలియకముందే, విశ్వనాథ్ పటేకర్ ముంబైలో ఒక రంగస్థల కార్యకర్త.
1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుద్-జంజీరాలో జన్మించి, సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్, ముంబైలో కమర్షియల్ పెయింటింగ్స్ లో శిక్షణ పొందిన పటేకర్ కు అసలైన బడి 1970ల నాటి మరాఠీ ప్రయోగాత్మక రంగస్థలం. కుటుంబాన్ని పోషించడానికి నెలకు 35 రూపాయలకు సినిమా పోస్టర్లు గీసేవాడు, రోజూ 16 కి.మీ నడిచేవాడు. రోడ్లమీద ప్రయాణికులకు హెచ్చరికలుగా వేసే జీబ్రా క్రాసింగ్ లైన్లను పెయింట్ చేసేవాడు. ఐతే "ఆకలే నాకు నటన నేర్పింది" అని ఆయనే తర్వాత చెప్పుకున్నాడు. ఈ పని చేస్తూనే ముంబై థియేటర్ సర్క్యూట్ లో చేరాడు.
1970ల ప్రారంభంలో నాటకాల్లో నటించడం మొదలుపెట్టి 1977-78 నుండి ప్రయోగాత్మక, వాణిజ్య నాటకాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తక్కువ పారితోషికానికే పనిచేస్తూ, స్వర నియంత్రణ, హావభావాలు, ఆ ప్రసిద్ధ ఘాటైన డైలాగ్ డెలివరీని నేర్చుకున్నారు.
ఆయన ప్రారంభంలో హమీదాబాయిచీ కొఠీ పురుష్ నాటకం ఆయన గంభీరమైన నటనా ప్రతిభను నిరూపించింది. ఆయన నాటకం మహారాష్ట్ర రాష్ట్ర నాటక పోటీలలో బహుమతి గెలుచుకున్న తర్వాత, శాశ్వతంగా నటనలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఆయన రంగస్థల కృషే ఆయనను మరాఠీ సినిమాలోకి నడిపించింది. సింహాసన్ (1979), భాలు, రఘు మైనా, సావిత్రి, గమన్ (1978) తో హిందీలోకి అడుగుపెట్టినా, మళ్లీ మళ్లీ రంగస్థలానికే వచ్చేవాడు. సినిమా కెరీర్ శిఖరాల్లో ఉన్నప్పుడు కూడా జీవితాంతం మరాఠీ థియేటర్ తో తన అనుబంధం కొనసాగించాడు. సినిమాల్లో మనం చూసిన ఆయన భాషపై పట్టు, ముడి శక్తి, శక్తివంతమైన డైలాగ్ డెలివరీ అంతా రంగస్థలం ఇచ్చిన వరమే.
ఆయన రంగస్థల జీవితం 2016లో నటసామ్రాట్ తో కవితాత్మకంగా పూర్తయింది. జీవితాన్ని రంగస్థలానికే అంకితం చేసిన విరమణ పొందిన షేక్స్పియర్ నాటక నటుడు అప్పాసాహెబ్ బెల్వాల్కర్ పాత్రలో నటించి, విమర్శకులచే కెరీర్ లోనే ఉత్తమంగా పేర్కొనబడ్డారు. అది ఆయనకు నటన కాదు. అది ఆయన సొంత జీవిత కథ. రంగస్థలంపై మొదలైన వ్యక్తి, రంగస్థలాన్ని వదలలేని వ్యక్తి గురించి మాట్లాడటం.
పటేకర్ రంగస్థలాన్ని సత్య శిక్షణగా భావించేవారు. సినిమా లాగా రీటేక్ ఉండదు. ఆ క్రమశిక్షణే ఆయనకు ఒకే నాటకంలో భయపెట్టేలా, సున్నితంగా, హాస్యంగా, లేదా లోతైన నిగ్రహంతో నటించే సామర్థ్యాన్ని ఇచ్చింది. చివరి సంవత్సరాల వరకు ప్రయోగాత్మక మరాఠీ థియేటర్ గ్రూపులకు ప్రదర్శనలు ఇస్తూ, రాస్తూ, మద్దతు ఇస్తూనే ఉన్నారు. 2026 అక్టోబర్ 8న 75 ఏళ్ల వయసులో గోవాలో ఆయన మరణించినప్పుడు వచ్చిన వారు "ఆయనది రంగస్థలంపై ముంబై నగర వీధులలో రూపుదిద్దుకున్న కెరీర్" గా అభివర్ణించారు.
హెచ్.రమేష్‌బాబు,
93916 34727







కామెంట్లు (0)