రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఒకప్పటి గ్రామం తుక్కుగూడ. తుక్కుగూడలోని వేంకటేశ్వరాలయ ప్రాంగణంలో కొత్త శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు ఉపాధ్యక్షులు బీవీ భద్రగిరీశ్, వేముగంటి మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి, యాదేశ్వర్ దండేత్కర్, కావలి చంద్రకాంత్, అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ గుర్తించారు. హరగోపాల్ ఈ శాసనాన్ని చదివి పరిష్కరించారు.
తుక్కుగూడలో చిన్న బోడగుట్ట మీద వేంకటేశ్వరాలయం. పోయినవిపోగా గుడివున్న గుట్టప్రాంతం విశాలంగా ఖాళీగానే వుంది. అంతా ఒక అంతస్తు, రెండంతస్తుల ఎత్తులో దేవాలయాలు. ఒకటి వేంకటేశ్వరునిది. మరొకటి శివాలయం. రెండు గుహల్లోనే ఉన్నాయి. ఈ గుడులు, శిల్పాలు అన్నీ 17వ శతాబ్దం తర్వాతవే. అంతకు ముందరి శిల్పాలు లేవు. పూర్తి శిల్పాలు లేవు అన్నీ అర్థశిల్పాలే(ఉల్బణశిల్పాలే).. ఏవో కొన్ని గణపతుల వంటివి శిల్పాలున్నా అవి ఇటీవలి కాలానివే.
మెట్లెక్కి పైకి పోగానే నాలుగు స్తంభాల కళ్యాణమంటపం. ఆ స్తంభాలు రాష్ట్రకూటశైలి స్తంభాల అనుకరణ. ఆ పక్కన సత్రం, రథం. పడుమటికి మెట్లెక్కి లోపలికి పోతుంటే రాతిగుండ్ల మధ్య నుంచి దారి. గుండ్ల నడుమ రాతిగోడ మీద విష్ణు అర్థశిల్పం. హనుమంత శిల్పాలు, గరుడాళ్వారు. గుడిలోనికి ద్వారానికి వైష్ణవ ద్వారపాలకులు, అంతకుముందే రాతిగుండ్ల మీద ద్వారపాలకులు మొత్తం నలుగురు అగుపిస్తారు. గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా శ్రీదేవి, పద్మావతులతో వేంకటేశ్వర్లున్నారు. నేరుగా చూడలేనందుకు ఎదురుగా అద్దంలో దర్శనం. కూకట్పల్లి రంగనాయకాలయంలో ఉన్నట్టే, ఇక్కడ ఆ ఏర్పాటుంది. అవతలివైపు గుహలో కిందికి లోతున వుంటుంది. అందులో శివలింగం, నంది, వినాయకశిల్పాలున్నాయి. గుడిబయట వీరభద్రుని అర్థశిల్పం ఆరు అడుగులకు ఎక్కువే ఎత్తుంటుంది.
గుడి నిర్మాత తన ఇద్దరు భార్యలతో అర్థశిల్పాల రూపంలో గుడిలోనికి వెళ్ళేతోవలో రాతిగుండుపైన కనిపిస్తాడు. ఆ శిల్పానికి ఎదురుగా మెట్లదారిలో ఒక రాతిగుండుమీద తెలుగు శాసనముంది. అది 18వ శతాబ్దపునాటిది. శాసనంలో పేర్కొన్నట్టు ఈ గుట్ట పేరు ‘వేంకటపతి కొండ’. గుడిలోని దేవుడు (తి)రుపతి ప్రసన్న వెంకటద్రిగా శాసనం చెప్తున్నది. ఈ శాసనం వికృతినామ సంవత్సర మాఘ శుద్ధ దశమి, గురువారం అంటే ఎఫిమెరిస్ ప్రకారం 1762 ఫిబ్రవరి 4వ తేదీన వేసినట్టు తెలుస్తున్నది. లక్ష్మికాంతయ్య లక్ష్మీకొమార కేశవయ్య (చం)ద్రయగారల వంశీకులు రామయగారు వేయించిన ధర్మశాసనం.
క్షేత్ర పర్యటన : ఉపాధ్యక్షులు బీవీ భద్రగిరీశ్, వేముగంటి మురళీకృష్ణ, కార్యవర్గ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి, యాదేశ్వర్ దండేత్కర్, కావలి చంద్రకాంత్, అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్-
కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యులు
శాసన పరిష్కారం: శ్రీరామోజు హరగోపాల్, 9949498698







కామెంట్లు (0)