Magazines

విలువల జాబిలిలో విజ్ఞాన ముత్యాలు

49 నిమిషాల క్రితం

a collection of values
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం



బాల్యం మనిషి జీవితానికి పునాది. ఈ దశలో పిల్లలు నేర్చుకునే విలువలు వారి భవిష్యత్తు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. పిల్లలకు జ్ఞానంతో పాటు మానవత్వం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను అందించడంలో బాలసాహిత్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో బుర్లే నాగేశ్వరరావు రచించిన ‘ఆహ్లాదకరమైన చందమామ వంటి కథలు’ బాలల మనోవికాసానికి దోహదపడే విలువైన కథా సంపుటిగా నిలుస్తుంది. ఈ కథల్లోని పాత్రలు, సంఘటనలు పిల్లలకు జీవిత సత్యాలను ఆసక్తికరంగా పరిచయం చేస్తాయి. కంబోజ దేశాధిపతి ఇంద్రపాలుని కథ వ్యక్తిగత బలహీనతలను అధిగమించి కర్తవ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని బోధిస్తుంది. రామనందుడు, గోవిందుడు, కనకవల్లి కథ ఇతరుల ప్రతిభను చూసి అసూయపడకుండా ప్రోత్సహించాలని తెలియజేస్తుంది. గాంధర్వ కన్య, నహుషుడి కథ బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం, సేవాభావం గొప్పవని చాటుతుంది.

విష్ణుగుప్తుడు నిర్వహించిన పరీక్షలో శివయ్య నిజాయితీగా సంపాదించడం ద్వారా నైతిక విలువల ప్రాధాన్యతను నిరూపిస్తాడు. మందాకిని కథ రూపవివక్షను ప్రశ్నిస్తూ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రతిభకు రంగు, రూపం అడ్డంకులు కావని స్పష్టం చేస్తుంది. ఈ కథలు పిల్లల్లో తార్కిక ఆలోచన, ఊహాశక్తి, భాషా నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. నేటి డిజిటల్ యుగంలో సమాచారాన్ని విశ్లేషించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం, మానవీయ విలువలను పాటించడం ఎంతో అవసరం. ఈ లక్షణాల అభివృద్ధికి కథాపఠనం తోడ్పడుతుంది. కళారత్న దేవి ప్రసాద్ అందించిన చిత్రాలు కథలకు మరింత ఆకర్షణను జోడించి, బాలల పఠనాసక్తిని పెంచుతాయి.

మొత్తంగా ఈ కథా సంపుటి వినోదంతో పాటు విలువలను అందించే బాలసాహిత్య కానుక. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇటువంటి కథలను పిల్లలకు పరిచయం చేయాలి. చందమామ వెన్నెల రాత్రికి అందాన్నిస్తే, మంచి కథలు బాల్యానికి విలువల వెలుగును అందిస్తాయి. ఆ వెలుగులో వికసించిన బాల్యం, రేపటి సమాజానికి బాధ్యతాయుతమైన, మానవీయ విలువలు కలిగిన పౌరులను అందిస్తుంది.

డా. పూసపాటి వేదాద్రి , 9912197694

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్