Magazines

సాంకేతిక యుగంలో దిగజారుతున్న నైతిక విలువలు

24 అక్టోబర్, 2026

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 3 నిమిషాల చదవడం

రాతియుగం నుంచి నేటి సాంకేతిక యుగం వరకు మనిషి చేసిన ప్రయాణం మానవ చరిత్రలోనే ఒక అద్భుత పరిణామం. ఒకప్పుడు రాతి పనిముట్లతో జీవించిన మనిషి, నేడు కృత్రిమ మేధస్సును సృష్టించే స్థాయికి ఎదిగాడు. నిప్పును కనుగొనడం, చక్రాన్ని సృష్టించడం నుంచి అంతరిక్ష పరిశోధనలు, స్మార్ట్‌ఫోన్ ద్వారా సమగ్ర విశ్వ సమాచారాన్ని అరిచేతిలోకి తెచ్చుకోవడం వరకు శాస్త్ర విజ్ఞానంలో అపారమైన పురోగతి సాధించాడు. అక్షరాస్యత పెరిగింది, ఉన్నత విద్య విస్తరించింది. కానీ, విజ్ఞానంలో ముందడుగు వేస్తున్న మనిషి మానవత్వంలో, నైతిక విలువల్లో మాత్రం వెనకబడిపోతున్నాడనే తీవ్రమైన ప్రశ్న నేడు మన ముందు నిలుస్తోంది.

ఇటీవల అక్టోబర్ 2, 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో యువతులు పాల్గొన్నప్పటి దృశ్యాలు ఈ నైతిక పతనాన్ని మరోసారి ఎత్తిచూపాయి. వారు చేసే నిరసన ఉద్దేశంపై, రాజకీయ అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, విమర్శలు, రాజకీయ చర్చలు సహజమే. కానీ ఒక మహిళ ప్రజాసమస్యలపై నిరసన తెలుపుతున్నప్పుడు, మన దృష్టి ఆమె మాట్లాడే మాటలపై, ఆమె నిరసన వెనుక ఉన్న ఉద్దేశంపై ఉండాలి. అంతేకానీ, సామాజిక మాధ్యమాలలో అనైతికంగా సంచలనాలు సృష్టించడం కోసం ఆమె దుస్తులపై, వ్యక్తిగత శరీర భాగాలపై కెమెరాలను కేంద్రీకరించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం తీవ్రమైన బాధ్యతారాహిత్యం, అసహ్యకరమైన చర్య.

ఒక వ్యక్తి పోరాటాన్ని, ఆలోచనను తర్కంతో ఎదుర్కోవాలి. కానీ ఒక మహిళ శరీరాన్ని విమర్శకు ఆయుధంగా మార్చడం ఏ ప్రజాస్వామ్య చర్చకూ గౌరవం తీసుకురాదు. పోరాటాన్ని ప్రశ్నించవచ్చు, ఆలోచనను విమర్శించవచ్చు, వాదనను ఖండించవచ్చు. కానీ ఏ ఒక్క వ్యక్తి ఆత్మ గౌరవాన్ని మాత్రం కించపరచకూడదు! మనకు స్వేచ్ఛ ఉంది, అభిప్రాయం ఉంది, సాంకేతికత ఉంది, ప్రసార సాధనాలు ఉన్నాయి. అయితే వాటితో పాటు బాధ్యత, విచక్షణ, మానవత్వం కూడా ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆ నిరసనలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నవారంతా విద్యావంతులు, ఉన్నత అధికారులు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారే. కానీ వారి మధ్య నుండే ఈ అసభ్యకరమైన వీడియోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంటే మనం విద్యాలయాల్లో నేర్చుకుంటున్న చదువు మనకు సంస్కారాన్ని, విచక్షణను నేర్పడంలో విఫలమవుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.

నేడు ప్రతి ఒక్కరి చేతిలోనూ కెమెరా, ఇంటర్నెట్ రూపంలో అపారమైన స్వేచ్ఛ ఉంది. అయితే స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలి. కెమెరా కేవలం సంచలనాలు సృష్టించే పరికరం కాదు. అది సమాజానికి అద్దం పట్టే బాధ్యత కలిగిన సాధనం. ఒక దృశ్యాన్ని లేదా వీడియోను ప్రసారం చేసేటప్పుడు ‘దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి? ఎంత వైరల్ అవుతుంది?’ అని మాత్రమే కాకుండా ‘ఇది నిజమా, న్యాయమా? దీనివల్ల ఎదుటి వ్యక్తి గౌరవానికి భంగం కలుగుతుందా?’ అని ఆలోచించడమే నిజమైన డిజిటల్ సంస్కారం. సొంత ఇంట్లో తల్లి, సోదరి, కుమార్తెలకు ఇచ్చే గౌరవ ప్రాధాన్యతలను, సమాజంలో కనిపించే అపరిచిత మహిళకూ అందించడమే పరిణతి చెందిన నాగరికతకు ప్రాతిపదిక.

ముగింపు మాటగా ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏమిటంటే.. చదువు, హోదా, ఆర్థిక ప్రగతి మాత్రమే ఒక వ్యక్తి ఉన్నతికి కొలమానాలు కావు. విద్య మనకు ఎలా జీవించాలో నేర్పితే, జ్ఞానం ఎలా ఆలోచించాలో నేర్పుతుంది. విజ్ఞానం ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇస్తే, సంస్కారం ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలో నేర్పుతుంది! బాధ్యత, విచక్షణ, మానవత్వం లేని ఏ సాంకేతికతైనా సమాజానికి ప్రమాదకరమే. మనిషి సాంకేతిక శక్తిని ఎంతగా పెంచుకున్నాడో, తన హృదయంలో మానవత్వాన్ని, నైతిక విలువలను కూడా అంతే స్థాయిలో పెంచుకోవాలి. చంద్రుడిపై అడుగుపెట్టిన మనిషి, తన పక్కన నిలబడిన మనిషి గౌరవాన్ని కాపాడగలిగినప్పుడే ఆ ప్రగతికి విలువ ఉంటుంది. యంత్రాలతో పాటు మనుషుల మనసులు, ఆలోచనలు కూడా నాగరికత వైపు ప్రయాణించినప్పుడే సాంకేతిక ప్రగతికి సంపూర్ణమైన అర్థం చేకూరుతుంది. రాతియుగం నుంచి డిజిటల్ యుగానికి ప్రయాణించిన మనిషి, సాంకేతికంగా ఎంత ఎదిగినా తన ఆలోచనా విధానంలో పాతరాతి యుగానికి తిరిగి వెళ్లకుండా జాగ్రత్తపడటమే నేడు మన ముందున్న అగ్నిపరీక్ష.


ననుబోలు రాజశేఖర్, 9885739808

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్