Magazines

తుపాన్లకు పేర్లు ఎందుకు?

1 గంట క్రితం

Why are cyclones given names?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం


తీరం వైపు దూసుకొస్తున్న తుపాను గురించి చెప్పి, ప్రజలను హెచ్చరించడానికి, అది మిగిల్చిన నష్టాన్ని గుర్తు చేసుకునేందుకు, ఏ తుపాను వల్ల ఎంత నష్టం కలిగిందో తేల్చేందుకు తుపాన్లకు పేర్లు అవసరం. అందుకే తుపాన్లకు తిత్లీ, హుద్​హుద్, హాంఫన్, అర్నబ్ అంటూ ఇలా ప్రత్యేకమైన పేర్లను పెడతారని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.

ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. అలాగే నాలుగు ప్రాంతీయ ఉష్ణమండల తుపాను హెచ్చరికల కేంద్రాలున్నాయి. ఇవి తుపాన్ల గురించి హెచ్చరికలు, సూచనలు ఇస్తుంటాయి. అలాగే వాటికి పేర్లు పెడుతుంటాయి. భారత వాతావరణ శాఖ ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాల్లో ఒకటిగా పనిచేస్తోంది. ఇది ఉత్తర హిందూ మహాసముద్రంపై గరిష్ఠంగా గంటకు 60కిమీ ఉపరితల వేగంతో గాలులు వీచే తుపాన్లకు పేర్లు పెడుతోంది. అక్షర క్రమం బట్టి ఒక్కో దేశం ఓ తుపానుకు పేరును సూచిస్తుంది. ప్రతిసారీ ఆ పేరు కొత్తగా, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలి. పేరు ఎనిమిది అక్షరాలకు మించరాదు. అది ఏ సభ్యదేశానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు. ఇలా అన్ని రూల్స్ పరిగణనలోకి తీసుకున్నాక తుపాన్లకు పేర్లు పెడతారని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

కొన్ని తుపాన్ల ప్రభావం వారం రోజులకన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే సమయంలో మరో తుపాను వస్తే ఎలా అని ఆలోచించి, వాటికి పేర్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఒక్కో తుపానుకు ఒక్కో పేరును పెడితే డిజాస్టర్ మేనేజ్​మెంట్​, మీడియా, సాధారణ ప్రజలకు ఇది పలానా తుపాను అని గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఆ తుపాను పేరుతో ప్రజలను అప్రమత్తం చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ పేర్లు వీలైనంత చిన్నగా, సులభంగా పలికేవిధంగా ఉండాలనే నిబంధన ఉంది.

తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000రలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్(ESCAP), వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనేజేషన్(WMO) సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలున్నాయి. 2018లో ఈ గ్రూపులోకి ఖతార్, సౌదీ ఆరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), యెమెన్ చేరడంతో మొత్తం దేశాల సంఖ్య 13కు చేరింది.

ఒక్కో దేశం 13 పేర్లతో 2020లో 169 పేర్లతో కూడిన ఒక జాబితాను సిద్ధం చేశాయి. బంగాళాఖాతం, ఆరేబియా సముద్రాల్లో పుట్టే తుపాన్లకు ఈ దేశాలు పేర్లు పెడతాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటు అయిన ఒక ప్రత్యేక ప్యానెల్ తుపాన్లకు పేర్లను నిర్ణయిస్తుంది. ఆయా దేశాల అక్షర క్రమంలో ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఉంచుతారు. ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్​ది కాగా, భారత్​ది రెండో పేరు, ఆ తర్వాత ఇరాన్, మాల్దీవులు, ఒమన్, పాకిస్థాన్, ఖతార్ ఇలా కొనసాగుతాయి. తాజాగా బంగాళాఖాతం​లో ఏర్పడిన తుపానుకు బంగ్లాదేశ్ ‘అర్నాబ్’ అని పేరు పెట్టింది. బెంగాళీలో అర్నాబ్ అంటే సముద్రం లేదా మహాసముద్రం అని అర్థం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్