– సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అసంతృప్తి
– ‘లిల్లిపుట్’ అంటూ జగదీశ్‌రెడ్డిపై ఫైర్
– తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఎవరూ ఖండించ లేదంటూ ఆగ్రహం
– విలేకర్ల సమావేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు
– నేటి నుంచి ఇందిరాపార్కు వద్ద దీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒకవైపు ఆవేదన.. మరోవైపు అసంతృప్తి… వెరసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. సొంత పార్టీ నేతలు తన పట్ల అనుసరిస్తున్న ధోరణిపై ఆమె అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే తన పట్ల, తన ఉద్యమాల పట్ల చేసిన వ్యాఖ్యలపై కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నల్లగొండ జిల్లాలో పార్టీ ఓటమికి కారణమైన లిల్లిపుట్ నాయకుడు నా గురించి మాట్లాడుతారా? కేసీఆర్ లేకుంటే ఆ లిల్లిపుట్ ఎవరు?’ అంటూ ఆయన్ను దుయ్యబట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె ఈ కామెంట్లు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలెవ్వరూ ఖండించకపోవటంతో కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారనీ, ఇప్పటికే ఆ విషయం గురించి పదేపదే ఆలోచిస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ‘రక్త సంబంధం కంటే రాజకీయ సంబంధమే వారికి ముఖ్యమా? మల్లన్న చేసిన వ్యాఖ్యల గురించి నన్ను నేరుగా పరామర్శించేందుకు రాలేదు, అయినా ఫరవాలేదు, కనీసం ఫోన్‌లోనైనా పరామర్శించాలి కదా..?’ అంటూ ఆమె కంటతడిపెట్టినట్టు తెలిసింది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వెనుక బీఆర్‌ఎస్‌లోని పెద్ద తలకాయలు, పొడుగు నేతల హస్తముందంటూ ఆమె ఒక మాజీ మంత్రిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరు మల్లన్నను కలిశారో, ఆయనతో ఏం చెప్పారో, ఎలాంటి వ్యాఖ్యలు చేయించారోననే విషయాలన్నీ తనకు తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ… తన తండ్రి కేసీఆర్‌కు తాను రాసిన లేఖను లీకు చేసిందెవరో చెప్పాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తనకు తెలుసుగానీ, గత ఆర్నెల్ల నుంచి ఆయనతో మాట్లాడలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సోమవారం నుంచి ఇందిరాపార్కు వద్ద తాను చేపట్టబోయే దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని కవిత వాపోయారు. ‘దీక్షకు అనుమతినిస్తే సరే… లేదంటే ఇంటి నుంచే దీక్ష చేపడతా…’ అని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరి… ‘దొంగే, దొంగా దొంగా… అని అరిచినట్టుగా ఉంది…’ అని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు (72 గంటలు) ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు.
వారి మాటలనే కవిత వల్లె వేసింది
మరోవైపు కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ…’కేసీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఆయన శత్రువులైన సీఎం రేవంత్, ఆంధ్రజ్యోతి ఎమ్‌డీ రాధాకృష్ణ వాడిన పదాలను, చేసిన వ్యాఖ్యలనే కవిత వాడింది…’ అని విమర్శించారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవిత చేసిన కామెంట్లపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆమె జ్ఞానానికి జోహార్లంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌తో ఫామ్‌హౌస్‌లో భేటీ అయిన సందర్భంగా తమ మధ్య కవిత ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో ఓటమికి తానే కారణమంటూ ఆమె విమర్శిస్తున్నారనీ, అలాంటప్పుడు అంతకుముందు 2014లోను, 2018లోనూ పార్టీ సాధించిన విజయాలకు కూడా తాను కారణమే అనే విషయాన్ని ఒప్పుకోవాలి కదా? అని ప్రశ్నించారు.
-జగదీశ్ రెడ్డి
ఆవేదన.. అంతర్మథనం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES