Friday, February 6, 2026
E-PAPER
Homeబీజినెస్భారత జీడీపీలో దక్షిణాది రాష్ట్రాలు కీలకం

భారత జీడీపీలో దక్షిణాది రాష్ట్రాలు కీలకం

- Advertisement -

2030 నాటికి రికార్డ్‌ వృద్ధి
దేశ సగటు కంటే ఎక్కువ పెరుగుదల
ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌-డిజర్వ్‌ రిపోర్ట్‌ వెల్లడి


నవతెలంగాణ – హైదరాబాద్‌
భారత ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌-డెజర్వ్‌ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. 2026-30 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలు సగటున 6.8 శాతం జీడీపీ వద్ధిని నమోదు చేయనున్నాయని విశ్లేషించింది. ఇది జాతీయ సగటు అంచనా 6.3 శాతం కంటే మెరుగ్గా ఉండటం విశేషం. దేశ ఆర్థిక కేంద్ర బిందువుగా దక్షిణాది నిలువనుందని తెలిపింది. రాబోయే ఐదేళ్లలో దేశ సగటు వృద్ధి రేటు కంటే దక్షిణాది రాష్ట్రాలే అత్యధిక పెరుగుదలను నమోదు చేయనున్నాయని వెల్లడించింది.

2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల మార్కును చేరుకోవడంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయని విశ్లేషించింది. ఈ పరిణామాలు కేవలం రాష్ట్రాల ఆదాయాన్నే కాకుండా ఇన్వెస్టర్ల సంపద సృష్టిలో కూడా పెను మార్పులు తీసుకురానున్నాయి. భారతదేశ ఆర్థిక ముఖచిత్రంలో దక్షిణాది రాష్ట్రాలు ఇకపై కేవలం భాగాలు మాత్రమే కాదని, దేశ వృద్ధికి అసలైన ఇంజిన్లుగా అవతరించాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

తమిళనాడు భళా..
ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌-డెజర్వ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. 2026-30 మధ్య కాలంలో భారతదేశ సగటు జీడీపీ 6.3 శాతంగా ఉండనుండగా.. దక్షిణాది రాష్ట్రాలు ఏకంగా 6.8 శాతం సగటు వృద్ధిని సాధించనున్నాయి. ఇందులో కర్నాటక 7.4 శాతం, తెలంగాణ 7.2 శాతం వృద్ధి రేట్లతో నిలవబోతున్నాయి. తమిళనాడు ఏకంగా 16 శాతం వృద్ధితో దేశంలోని ప్రధాన రాష్ట్రాలన్నింటికంటే వేగంగా దూసుకుపోతుండటం విశేషం. ఈ రాష్ట్ర జిడిపి 2023-24లో రూ.26.88 లక్షల కోట్లుగా ఉండగా.. 2024-25లో రూ.31.19 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని గుర్తు చేసింది.

వెన్నెముకగా ఐటీ రంగం
ఈ భారీ పురోగతికి ఐటీ, సాంకేతిక సేవా రంగాలు ప్రధాన శక్తిగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం వాటా 13 శాతంగా ఉండగా, కర్నాటకలో ఇది ఏకంగా 22 శాతానికి చేరి దేశంలోనే అత్యధిక వాటా కలిగిన రాష్ట్రంగా నిలిచింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఐటీ రంగం రాబోయే కాలంలో 11 నుంచి 12 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది.

భారీ పెట్టుబడులు
అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల పెట్టుబడులు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తోన్నాయి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏఐ, క్లౌడ్‌ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ.1.46 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించిన విషయాన్ని ఆ రిపోర్ట్‌ గుర్తు చేసింది. గూగుల్‌ సంస్థ విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ కోసం రూ. 51,000 కోట్లను వెచ్చిస్తోందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -