Thursday, May 22, 2025
Homeరాష్ట్రీయంకేరళకు 3,4 రోజుల్లో నైరుతిపవనాలు

కేరళకు 3,4 రోజుల్లో నైరుతిపవనాలు

- Advertisement -

– చురుగ్గా ముందుకు సాగుతున్న వైనం
– మండు వేసవిలో రాష్ట్రంలో భారీ వర్షాలు
– బుధవారం ఒక్కరోజే 837 ప్రాంతాల్లో వాన
– మంచిర్యాల జిల్లా తపాల్‌పూర్‌లో 9.9 సెంటీమీటర్ల వర్షం
– వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
– ఉష్ణోగ్రతలు పడిపోయినా తగ్గని ఉక్కపోత

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ఆగమనం జరుగుతుంది. కానీ, ఈ ఏడాది వారం ముందుగానే అవి కేరళను తాకబోతున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయిని ఐఎమ్‌డీ అంచనా వేస్తున్నది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్నాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అది ఉత్తర దిక్కుల్లో కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. కర్నాటక తీర సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్ర ఆవర్తనం నుంచి కోస్తాంధ్ర తీరం వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి.
తెలంగాణలో మండుటేసవిలోనూ వానలు దంచికొడుతున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు రాష్ట్రంలో 837 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. గతంలో మే నెలలో ఎన్నడూ ఈ స్థాయిలో వర్షం పడలేదు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్‌పూర్‌లో అత్యధికంగా 9.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ 8.83 సెంటీమీటర్ల వాన పడింది. హైదరాబాద్‌లోనూ మలక్‌పేట, సైదాబాద్‌, అంబర్‌పేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. గురువారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం)తో కూడిన భారీ వర్షాలు కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షం కురిసే సూచనలున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లోహెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశముంది. మే నెలలో భగభగమండిపోయే భానుడు ఈసారి తన ప్రతాపాన్ని చూపట్లేదు. సాధారణంగా మే మూడో వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగానే నమోదయ్యేవి ప్రస్తుతం అవి 40 డిగ్రీల లోపే రికార్డవుతున్నాయి. ఈ సారి మే నెలంతా చల్లగానే ఉంది. వర్షాలు పడుతూనే ఉన్నాయి. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రతి ఏటా నమోదయ్యే సాధారణం కంటే ఏడెనిమిది డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
(బుధవారం రాత్రి 10:30 వరకు)

తపాల్‌పూర్‌ (మంచిర్యాల జిల్లా) 9.90 సెంటీమీటర్లు
సూర్యాపేట 8.83 సెంటీమీటర్లు
బండ్లగూడ(హైదరాబాద్‌) 8.73 సెంటీమీటర్లు
కల్లెడ(వరంగల్‌) 8.50 సెంటీమీటర్లు
సైదాబాద్‌(హైదరాబాద్‌) 8.25 సెంటీమీటర్లు
మలక్‌పేట(హైదరాబాద్‌) 8.23 సెంటీమీటర్లు
మాసాయిపేట(మెదక్‌) 8.05 సెంటీమీటర్లు
అంబర్‌పేట్‌(హైదరాబాద్‌) 7.90 సెంటీమీటర్లు
మెన్‌డోరా(నిజామాబాద్‌) 7.90 సెంటీమీటర్లు
బుట్టాపూర్‌(నిర్మల్‌) 7.90 సెంటీమీటర్లు
గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా
ఆదిలాబాద్‌ 40 డిగ్రీలు
నల్లగొండ 36 డిగ్రీలు
ఖమ్మం 35.4 డిగ్రీలు
రామగుండం 35 డిగ్రీలు
భద్రాచలం 34.4 డిగ్రీలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -