ఆ స్వరమాధుర్యం ఆస్వాదించని కుటుంబం లేదు : రవీంద్రభారతిలో ఎస్పీ విగ్రహావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
జీవితాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్న గొప్ప వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన స్వర మాధుర్యాన్ని ఆస్వాదించని కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో లేదనీ, అందుకే ఆయన తెలుగింటి మనిషిగా చిరస్థాయిగా నిలిచిపోతారని కీర్తించారు. సోమవారంనాడిక్కడి రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అక్షయపాత్ర వంటిదనీ, ఎవరికి ఏం కావాలో దాన్ని ఆయన తన స్వరంతో పలికించేవారని చెప్పారు. తెలుగుభాష ఉచ్ఛారణ అద్భుతంగా ఉంటుందనీ, డబ్బింగ్ ద్వారా కమల్ హాసన్ వంటి నటుల పాత్రలకు జీవం పోశారని కీర్తించారు. పాడుతాతీయగా కార్యక్రమం ద్వారా భవిష్యత్ సంగీత కళాకారుల్ని ఆయన ముందే నిర్ణయించేశారని చెప్పారు.
ప్రస్తుతం యువతరం పాశ్చాత్య వ్యామోహంలో కొట్టుకుపోతున్నదనీ, మమ్మీ డాడీ కల్చర్‌ను వదిలేసి, మాతృభాషలో అమ్మానాన్న అని మాట్లాడుకోవాలని సూచించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి భిక్షాటన చేసి, సంగీతానికి సేవ చేశారని గుర్తుచేశారు. బాలసుబ్రహ్మణ్యం ప్రతిభతో పాటు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన భౌతికంగా లేకున్నా, ఆయన స్వరం ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతుందని స్పష్టం చేశారు. తెలుగుభాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే బాలసుబ్రహ్మణ్యంకు తెలుగువారు ఇచ్చే అతిపెద్ద నివాళి అని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొంది, కోట్లాదిమంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని తెలిపారు. సంగీతానికి భాష, ప్రాంతంతో సంబంధం లేదనీ, మనిషి జీవితంలో అదో భాగమని స్పష్టం చేశారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ తెలుగు ప్రజలకు గౌరవసూచకమని అన్నారు. 50 ఏండ్లలో 16 భాషల్లో 40వేల పాటల్ని పాడి శ్రోతల మనసుల్ని గెలుచుకుని, అజాతశత్రువుగా నిలిచారని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ ప్రాంతానికి పరిమితం కాదనీ, ఆయన స్ఫూర్తివంతమైన భారతీయుడని చెప్పారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలు అమోఘమని శ్లాఘించారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, మల్లు ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం బాల్య స్నేహితులు జీవీ మురళి, విగ్రహ శిల్పి వడయార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ, ప్రదీప్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రి, కుటుంబసభ్యులు పార్వతి, శైలజ, శుభలేఖ సుధాకర్ చరణ్, పాల్గొన్నారు. సభానంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శిష్యులు ఆలపించిన సంగీత విభావరి ఆహ్లాదంగా, వీనులవిందుగా కొనసాగింది.
తెలుగింటి మనిషి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



