స్వర్గలోకంలో పారిజాత వక్షం కింద ఒక సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో మయుడు, విశ్వకర్మ, సుశేషణుడు మొదలగు వారంతా తీవ్రమైన చర్చల్లో మునిగిపోయి ఉన్నారు.
ఆ సమావేశం జరుగుతున్న సంగతి గూఢచారులు ఇంద్రుడికి చేరవేశారు!
దాంతో ఇంద్రుడు కలవరపడ్డాడు. ఆ సమావేశం జరుగుతున్న సంగతి తనకు మాట మాత్రమైనా చెప్పలేదు! ఎందుకు జరువుతున్నారో! ఆ సమావేశంలో ఏం చర్చిస్తున్నారో! అన్న కలవరం ఇంద్రుడిలో మొదలయ్యింది.
”జయము! జయము! ఇంద్రా!” అంటూ నారదుడు ప్రవేశించాడు.
”జయము ఇంద్రా!” అన్న పదాలు నారదుడి నోటినుండి వినగానే ఇంద్రుడి గుండె జల్లుమన్నది! బ్రహ్మ రుద్రాదుల ఎదుట సైతం నారాయణ నామస్మరణ చేసే నారదుడు, ఇప్పుడు తనకు జయము పలకటమేమిటి? ఒకపక్క విశ్వకర్మ, మయుల సమావేశం జరుగుతున్నది. మరోపక్క నారదుడి జయధ్వానాలు దేనికి సూచన? కొంపదీసి కొత్త ఇంద్రుడు రానున్నాడా?” అని ఇంద్రుడు పరి పరి విధాల ఆలోచిస్తున్నాడు.
”ఏమిటిది ఇంద్రా! నీ స్వర్గంలో, నిర్మాణ నిపుణులు, విశ్వకర్మ, మయుడు మొ.వారు సమావేశమై చర్చిస్తున్నారు! నీకు తెలిసి, జరుగుతున్నదా? లేక తెలియక జరుగుతున్నదా?” అని ప్రశ్నించాడు నారదుడు.
అయ్యో! నారదా! వారి సమావేశము నాకు తెలియదు! వారు ఏమి చర్చిస్తున్నారో నాకు అంతకన్నా తెలియదు! పదా..వారినే అడిగి తెలుసుకుందాము! అంటూ నారదుడిని తీసుకుని, ఇంద్రుడు పారిజాత వక్షము వద్దకు వెళ్లాడు.
ఇంద్రుడిని చూడగానే విశ్వకర్మ, మయుడు చర్చలు మానివేసి లేచి నిలబడ్డారు.
”ఏమిటిది? ఈ సమావేశం ఎందుకు? ఏమి చర్చించుచున్నారు?” అన్నాడు ఇంద్రుడు.
విశ్వకర్మ, మయుడు ఏమీ మాట్లాడలేదు,
”ఇంకొక స్వర్గమును నిర్మించు ప్రణాళికలు వేయుచున్నారేమో?” సందేహం వెలిబుచ్చాడు నారదుడు.
”అసంభవం! స్వర్గం ఒక్కటే ! ఇంద్రుడు కూడా ఒక్కడే!” అన్నాడు ఇంద్రుడు.
విశ్యకర్మ, మయుడు మాట్లాడలేదు.
”వారిద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటే, వారి మనసుల్లో ఏదో ఉన్నదన్న మాట! వారు సష్టి, ప్రతిసష్టి రెండూ చేయగల సమర్థులు! ఇక నీవే అలోచించుకొమ్ము” అన్నాడు నారదుడు ఇంద్రుడితో.
ఇంద్రుడికి ఆందోళన పెరిగింది! ఏమి జరుగుతున్నది! కాని వారిని అదుపు చేయగల అధికారం తనకు లేదు!
విశ్వకర్మ, మయుడితో పాటు నారదుడిని వేసుకుని వైకుంఠం బయలు దేరాడు.
శ్రీ మహావిష్ణువు యధావిధిగా యోగ నిద్రలో ఉన్నాడు. శ్రీమహాలక్ష్మి ఆయన పాదములు ఒత్తుతున్నది.
ఇంద్రాదులు చేసిన స్తోత్రాలకు శ్రీమహావిష్ణువు కండ్లు తెరిచి చూశాడు.
”స్వామీ! విశ్వకర్మ, మయుడు, మా స్వర్గంలో నాకు తెలియకుండా సమావేశము జరుపుచున్నారు! ఎందుకు, ఏమిటీ వివరాలు తెలపమని అడిగినా తెలపటం లేదు!’ అన్నాడు ఇంద్రుడు.
”ఏమిటిది ఇంద్రా! ఇది నీకు తగునా? వారు సమావేశము జరుపుకున్నంత మాత్రాన నీకు చెప్ప వలయునా? ఇంత చిన్న విషయానికి నీవు వైకుంఠము దాకా వచ్చుట యేల?” అన్నాడు విసుగ్గా శ్రీ మహావిష్ణు.
క్షమించండి దేవా! వారు నిర్మాణ నిపుణులు. స్వర్గానికి ప్రతిసష్టి చేయుచు న్నారేమోనని ఆందోళన కలిగినది. అందుకే ఈ సమస్యను మీదాకా తీసుకు రావలసి వచ్చింది! మరి స్వర్గమును సష్టించినచో ప్రస్తుత స్వర్గ వైభవము కునారిల్లును కదా !” అన్నాడు దేవేంద్రుడు.
”ఏమది! విశ్వకర్మా,మయులారా? మా అనుమతి లేకుండానే మరో స్వర్గ లోకమును నిర్మించ దలచినారా?” ఆగ్రహంతో అడిగాడు విష్ణుమూర్తి
”ఆగ్రహించకండి ప్రభూ! వాస్తవమును మీతో నివేదించెదము! మన భారతదేశమునందు గత పదేండ్లుగా అనేక వంతెనలు కూలి పోవుచున్నవి. 530 పైగా వంతెనలు కూలి పోయాయని ఒక అంచనా! ఇందులో దాదాపు 300 వంతెనలు గత ఇదేండ్లలో నిర్మించినవే! ఈ వంతెనలు కూలిన ఘటనలలో 250 మందికి ఆమాయక ప్రజలు అసువులు బాశారు! ఇక ఎన్నిరోడ్లు కొట్టుకునిపోయాయో అంతే లేదు! మా సమావేశంలో ఈ సమస్యలపై చర్చించినాము ప్రభూ!” అన్నాడు విశ్వకర్మ చేతులు జోడించి.
”మంచిది! మీ చర్చల సారాంశమేమిటి? ఏమైనా పరిష్కారము కనుగొన్నారా?” అడిగాడు విష్ణుమూర్తి.
”తండ్రీ! మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిదేమున్నది! అయిననూ మీకు నివేదించెదము! భారతదేశములో కూలిపోతున్న వంతెనలు, రోడ్లు మామూలుగా కట్టినవి కావు! అత్యంత నిపుణులు, ఆధునిక సాంకేతిక నైపుణ్యముతో, దాని పేరు గుర్తుకు రావటం లేదు ప్రభూ….” అని విశ్వకర్మ తడుముకుంటుండగా
”స్పేస్ టెక్నాలజీ!” అంటూ మయుడు అందించాడు.
”ఆఁ. స్పేస్ టెక్నాలజీ, అది మహత్తరమైన సాంకేతిక నైపుణ్యం! ఇంతవరకూ భూగ్రహం మీద మరెవ్వరూ వాడలేదు! అంతటి విశిష్టమైన సాంకేతిక నైపుణ్యముతో నిర్మించిన వంతెనలు, రోడ్లు కొట్టుకుని పోవు చున్నవంటే, ఎంత బలవత్తరమైన ప్రకతి వైపరీత్యమే కారణము! అందువల్ల అలాంటి బలవత్తర మైన ప్రకృతి వైపరీత్యాలను సంభవించకుండా తగిన చర్యలు చేపట్టవలసిందిగా మిమ్ము వేడుకోవాలని చర్చించితిమి! ఒకవేళ అది సష్టి ధర్మానికి విరుద్ధమని మీరు భావించినచో, మేము భారతదేశము వెళ్లి స్పేస్ టెక్నాలజీతో నిర్మించిన చారిత్రిక వంతెనలు, రోడ్లను కాపాడుటకై కషిచేయుటకై మీ అనుమతి తీసుకోవాలని మేము చర్చించుకున్నాము ప్రభూ” అన్నాడు ఈ దేవశిల్పి విశ్వకర్మ. అవునన్నట్లు తలూపాడు మయుడు.
ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు పెద్దగా నవ్వాడు.
”మీకీ ఆలోచన రావటానికి గల కారణమేమి” నవ్వుతూనే అడిగాడు విష్ణుమూర్తి.
”భారతదేశ ప్రస్తుత పాలకుడు, మహాభక్తుడు. అంతేకాదు ప్రజలకోసం నిరంతరం పరితపించే మహా నాయకుడు. అంతటి నాయకుడు ప్రజలకోసం ఎంతో ఆలోచించి స్పేస్ టెక్నాలజీతో నిర్మించిన వంతెనలు, రోడ్లు కొట్టుకునిపోతుంటే భరించలేకపోతున్నాము. నాకు, మయుడికి కూడా తెలియని సాంకేతిక నైపుణ్యమైన స్పేస్ టెక్నాలజీని పది మన్యంతరాలకు అందించాలన్నదే మా తాపత్రయం! అంతే ప్రభూ” అన్నాడు విశ్వకర్మ.
”విశ్వకర్మ, మయులారా! మీరు గొప్ప నిర్మాణదక్షులే, కాని బొత్తిగా లోకజ్ఞానం లేనివారు! అందుకే స్పేస్ టెక్నాలజీని అర్థం చేసుకోలేక పోయారు! స్పేస్ అనగా అంతరిక్షం! మరి అంతరిక్షంలో వంతెనలు, రోడ్లు ఉంటాయా? ఒక గ్రహం నుండి మరో గ్రహానికో, నక్షత్రానికో వెళ్లుటకు రోడ్లు, వాటి మీద వంతెనలు ఉండవు! వాటి మధ్య గురుత్వాకర్షణ శక్తిని, సౌరశక్తిని వినియోగించు కుని, పోవు మార్గాల గురించి స్పేస్ టెక్నాలజీలో ఉంటుంది! అందుకే స్పేస్ టెక్నాలజీని అంతరిక్షంలో మాత్రమే వాడతారు! భూమిపై ఆ టెక్నాలజీ నిరుపయోగం. అందుకే భూమిపై వంతెనలు, రోడ్ల నిర్మాణానికి ఆ టెక్నాలజీని ఎవరూ వాడటం లేదు! ఆ వాగాడంబరంతో అమాయక ప్రజలు మోసపోవటం తప్ప మరేమీ లేదు! వంతెనలు, రోడ్లు మాత్రమే కాదు, రైల్వేస్టేషన్లు, విమానా శ్రయాలు, ఆఖరికి అయోధ్యలో కట్టిన రామమందిరం కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఆ నిర్మాణాలు ప్రజల మీద ప్రేమతోనో, దేవుళ్ల మీద భక్తితోనే కట్టినవి కావు! అవి ఆయా కాంట్రాక్టర్లకు, నిర్మాణ సంస్థలకు లాభ సాటిగా ఉండేలా నిర్మించుకున్నారు! ఇదంతా పాలకులకు కూడా తెలుసు! ఆ లాభాల్లో పాలక ప్రభువులకీ వాటా లుంటాయి! భారతదేశానికి ఈ కలియుగంలో మీరు వెళ్లి సాంకేతిక నైపుణ్యాన్ని కాపాడటమో, కొత్తది అందిం చటమో చేయవలసిన ఆగత్యమేమీ లేదు! భారతదేశంలో కావల్సినంత మేధో వనరులు, సాంకేతిక నైపుణ్యమూ ఉన్నాయి! వాటిని ప్రజలకోసం వినియోగించాలన్న తాపత్రయమే పాలకులకు లేదు! పాలకుల పాలనంతా ‘అ, ఆ’ లనే దిద్దుతున్నది. అందువల్ల వంతెనలు, రోడ్లు కొట్టుకుని పోతున్నాయి! కలియుగంలో మీరు తలదూర్చటం మాని స్వర్గంలో ఏమైనా కొత్తగా నగిషీలు దిద్దే ప్రయత్నం చేయండి!” అని హితోపదేశం చేశాడు మహావిష్ణువు.
– ఉషాకిరణ్