రెక్కలు చాసే ఊహల బాల్యానికి – స్థిరత్వ అనుభవాల పుట్ట వార్ధక్యానికి వారధి కడుతున్నాడు ఇక్కడ రచయిత.
ఆ వారథి నిర్మాణంలో శాస్త్ర సాంకేతిక విషయాలతో పాటు చరిత్ర భౌగోళికజ్ఞానం అన్నీ సహేతుకంగా, సమాంతరంగా పరుగులు పెరుతుంటాయి. అది రచయిత విజ్ఞత ‘ద లాస్ట్ ఎవల్యూషన్’ (ఆధునిక కాల్పనిక నవల) రచనా విశిష్టత.
ఒకవైపు ఆనందాద్భుతాల్లో తేలియాడుతూనే, మరోవైపు ఇలా నిజంగా జరుగుతుందా..? జరిగితే ఎంత బావుంగును? అనే పసితనపు అమాయకత్వంలోని జారిపోతుంటారు పాఠకులు.
450 కోట్ల సంవత్సరాల క్రితం అనంత విశ్వం నుండి భూమి పుట్టిందని, 150 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవరాసి ఆవిర్భవించిందని 50 లక్షల సంవత్సరాల క్రితం నుండే కోతి నుండి ఆది మానవుడు ఆవిర్భవించాడని శాస్త్రం చెబుతున్నది.
విశ్వజ్ఞానమే విజ్ఞానం. విశ్వం అనంతం అయినప్పుడు విజ్ఞానమూ అనంతమే. విశ్వ రహస్యాలను ఛేదించడమే విశ్వజ్ఞానం. ఆ విజ్ఞానఫలాలు అందుతున్నకొద్దీ మానవాళి ప్రగతిబాట ముమ్మరంగా పరుగులు తీస్తున్నది శాస్త్ర సాంకేతిక విస్ఫోటనం, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డిజిటల్ ప్రసారాలు, ఆయుధ క్షిపణులు, కృత్రిమ ఉపగ్రహాలు ఓహ్… ఒకటేమిటి ఇలా పరిపరి విధాలుగా మానవ విజ్ఞాన ప్రగతి విశ్వమంతా పరచుకుంటూ పోతున్నది. క్షణక్షణం ఎన్నో నూత్న ఆవిష్కరణలు. అందులో భాగంగా ట్రాన్స్ హ్యూమన్స్ .
‘మీ గ్రహంలోని కొందరు మానవుల్ని తెచ్చి, వీళ్ళు జన్యుక్రమం మార్చి మానవ యంత్రాలుగా గ్రహాంతర ట్రాన్స్ హ్యుమన్స్‌గా మార్చి భూమ్మీదకు పంపి మనుషుల్లో కలిపేసి, వాళ్ళ ద్వారా మొత్తం మానవ జాతిని తమ బానిసలుగా చేసుకోవాలనుకున్నారు. ఆ ప్రయోగాలు సక్సెస్ అయితే వాళ్ళు ఎవరినైనా తమ మాటలతో, చూపులతో, స్పర్శతో క్షణాల్లో తమ ఆధీనంలోకి తెచ్చుకుని తమతో కలిపేసుకునేవారు. నడిపించే వ్యవస్థ ఇక ఆ గ్రహాంతర వాసుల చేతుల్లో ఉండేది. అందుకు ఈ ప్రయోగాలు జరగాలంటే వాళ్ళకు ప్రాణాలతో ఉన్న మానవులు కావాలి. పిల్లలే కావాలి. అందుకే వీళ్ళను ఎత్తుకొచ్చారు.’
భూగ్రహంలోని పిల్లలకు కన్పించిన భయంకర ప్రమాదమిది. టు బి ఆర్ నాట్ టు బి. జరగవచ్చు. జరక్కపోవచ్చు. అలాగే ఇతర గ్రహాల వారికి మన మానవులందరూ గ్రహాంతర వాసులే కదా! ఇదో వస్తుగత దృష్టి.
ఇటువంటి ఊహాతీత సమస్యలను ప్రత్యేక సామర్థ్యం గల బాలలే ఎదుర్కోగలరు.
బాలవర్థన్, ప్రాచి, శరత్, రక్ష, మోక్ష, నక్షత్ర వంటి పాత్రలతో పాఠకులు ఉత్కంఠగా సహ ప్రయాణం చేస్తారు. వింత వింత లోకాల్లో విహరిస్తారు.
ఆ వాహనం క్షణాల్లో తనలోకితాను చిన్నగా ముడుచుకుపోయి ఓ రూపాయి బిళ్ళంత సైజులోకి మారి, ఎగిరి ప్రాచీ చేతిలో జారింది’ – ఇలాంటి వాఖ్యాలు పాత విఠలాచార్య జానపద చిత్రాలను జ్ఞప్తికి తెస్తాయి.
ప్రముఖ సాహితీవేత్త డా|| ఏనుగు నర్సింహా రెడ్డి సలహా మేరకు రచయిత వి.ఆర్.శర్మ ‘కానుక’ నవలకు ట్రయాలజీగా ఈ నవలను రాశారు. ఈ నవలకు బొమ్మలు గీసింది, ముందుమాట (ఇట్ కుడ్ గివ్ ఎ గుడ్ ఇన్సిప్రేషన్) రాసింది, ఆవిష్కరించిందీ తొమ్మిదవ తరగతి చదువుతున్న లక్ష్మీపురపు సహజ అంటే నమశక్యం కాదు. కానీ నిజం. కారణం రచయితకు పిల్లల పట్ల ఉన్న అవ్యాజనురాగమైన ప్రేమ. పిల్లల్లోని నిజాయితీ జిజ్ఞాస పట్ల అపారమైన నమ్మకం.
తెలంగాణ బాలసాహిత్య వారథిó గరిపల్లి అశోక్‌కు ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం ఎల్లరకూ సంతోషమేగా.
- కె.శాంతారావు, 9959745723