Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్పీకర్‌ కార్యాలయ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

స్పీకర్‌ కార్యాలయ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -

ఆ బులెటిన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో ఉండగా స్పీకర్‌ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌ రాజ్యాంగ విరుద్ధమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఆ బులెటిన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘లెజిస్లేటివ్‌ ట్రిబ్యునల్‌లో ఫిరాయింపుల కేసుపై విచారణ జరుగుతున్న సందర్భంలో స్పీకర్‌ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌ ద్వారా మీడియా, సందర్శకులు, మాజీ ప్రజాప్రతినిధులపై అసెంబ్లీలోకి ప్రవేశించడం పట్ల నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఈ కేసులో వాదిస్తున్న న్యాయవాదులు కూడా సెల్‌ ఫోన్లు తీసుకురావొద్దని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సుప్రీం కోర్టు ఫుల్‌ బెంచ్‌ విచారణలో కూడా మొబైల్‌ ఫోన్లను అనుమతిస్తారని గుర్తు చేశారు. ఈ విచారణలో ఏం గూడుపుఠాణీ నడుస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇది స్పీకర్‌ వ్యక్తిగత నిర్ణయం కాదనీ, రేవంత్‌రెడ్డి ప్రణాళికబద్ధంగా చేసిన చర్య అని అన్నారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ వ్యవహారం సాగుతోందన్నారు. ‘ఫిరాయింపుల విచారణను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించాలని కోరారు. తమ నియోజకవర్గ ప్రజలకు వారి ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వాదనలు తెలుసుకునే హక్కు ఉందని వివరించారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధోగతికి చేరిందన్నారు. హైడ్రా, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో ప్రజలపై దోపిడీ కొనసాగుతోందని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని అక్రమాలకు పాల్పడినా ధర్మమే గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు సతీష్‌రెడ్డి, హరి రమాదేవి, కల్వకుర్తి శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -