గ్రేడెడ్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ అమలు : సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎం గోపాల కృష్ణన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దసరా, దీపావళి, ఛట్ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు చేసినట్టు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాల కష్ణన్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వేలో సమర్థవంతంగా ఏర్పాట్లు చేసేందుకు గ్రేడెడ్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేసినట్టు తెలిపారు. ఈ ప్లాన్‌ను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అమలు చేసినట్టు వివరించారు. ప్రయాణికులు, వాహనాల కదలిక, ఫుట్ ఓవర్ బ్రిడ్జి వినియోగం, ఎక్కువ రద్దీగా ఉన్న సమయం, స్టేషన్‌కు చేరుకునే ట్రాఫిక్ తదితర విషయాలపై అధ్యయనం కోసం వివరణాత్మక సర్వేలు నిర్వహించినట్టు తెలిపారు. సికింద్రాబాద్‌లో పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. సాధారణ రోజుల్లో సగటున ఈ స్టేషన్‌కు 1.34 లక్షల మంది వస్తుండగా, పండుగల సీజన్‌లో సగటున 1.84 లక్షల మంది వస్తున్నారని చెప్పారు.
పెరిగిన ప్రయాణికుల కోసం ప్లాట్‌ఫారమ్‌కు ఒకవైపు గేట్ 2, గేట్ 4 వద్ద కొత్త హౌల్డింగ్ ప్రాంతాల ఏర్పాటు, కాజీపేట చివర వైపు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తెరవడం, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ వైపు కొత్త ఎగ్జిట్ గేట్ 5ఎ తెరవడం వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్టు గోపాల కృష్ణన్ తెలిపారు. ప్రధాన నగర టెర్మినల్స్‌లో రద్దీని తగ్గించడానికి, అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లోని 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు స్టాప్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 92 కెమెరాలతో కూడిన పటిష్టమైన సీసీటీవీ నిఘా, మెరుగైన మౌలిక సదుపాయాలు గల 17 టికెటింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, సికింద్రాబాద్ స్టేషన్, డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో వార్ రూమ్‌ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టినట్టు వివరించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసినట్టు వెల్లడించారు.
ప్రత్యేక చర్యలివే..
గేట్ల వద్ద నియంత్రిత ప్రవేశం/ నిష్క్రమణ, ఎఫ్.ఓ.బిపై రద్దీ లేకుండా చేయడం, హాట్‌స్పాట్ పర్యవేక్షణ, క్యూ నిర్వహణ, ప్రయాణీకుల సహాయం/ మార్గదర్శకత్వం నిర్ధారించడానికి ఆర్.పి.ఎఫ్, టికెట్ తనిఖీ సిబ్బందితో కూడిన వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. 24 గంటలూ వార్ రూమ్‌ల నిర్వహణ, దానాపూర్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ వంటి గుర్తించబడిన రైళ్లకు క్యూ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకుల యాక్సెస్ నియంత్రణ. జనరల్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను నియంత్రించడం ద్వారా అక్టోబర్ 19 నుంచి 21 వరకు దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఇదే విధానాన్ని అమలు చేశారు. ప్రయాణీకులు యూ.టి.ఎస్ మొబైల్ యాప్, రైల్ వన్ యాప్‌లను ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి చురుకైన అవగాహన ప్రచారాలు నిర్వహించారు. రైలు రాకపోకలు/నిష్క్రమణలు, ప్రత్యేక రైళ్లు, స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ నెంబర్లు, కోచ్ స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో సకాలంలో వ్యాప్తి చేశారు. ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణం కోసం పునరాభివద్ధి చేయబడుతున్న ప్రదేశాల్లో సరైన బారికేడింగ్, నిర్మాణ సామగ్రిని తొలగించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్/ఆపరేషన్స్ ఎ. సంజీవరావు, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ షిఫాలి, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
పండుగలకు ప్రత్యేక ఏర్పాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



