నవతెలంగాణ – హైదరాబాద్: పీఎం ఈ డ్రైవ్ కింద 575 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని త్వరలోనే కొత్తగా 2800 ఈవీ బస్సులు వస్తున్నాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అయన మాట్లాడుతూ.. వరంగల్ మున్సిపాలిటీకి 100, నిజామాబాద్ మున్సిపాలిటీకీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా 50 బస్సులు రాబోతున్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ సంవత్సరం కాలంలో లక్ష ఈవీ వాహనాలు అమ్ముడుపోయాయన్నారు. చార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలలో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని ఈవీ వాహనాల రాయితీ అమలుతో రూ. 900 కోట్ల పన్ను ప్రభుత్వానికి నష్టం జరిగినప్పటికీ ఈవీ పాలసీ ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం తగ్గింపు ఇవ్వాలని కంపెనీలను ఈ సందర్భంగా కోరామని చెప్పారు. ఎంఎన్‍సీ కంపెనీలు, పాఠశాలలు తమ వాహనాల్లో 25 నుంచి 50 శాతం వరకు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేలా నిర్భంద విధానం తీసుకువచ్చేలా ప్రణాళిక ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వ వాహనాల్లో కూడా 25-50 శాతం ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన ప్రభుత్వంలో జరుగుతోందన్నారు. హైదరాబాద్ లో పొల్యూషన్ తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇందులో భాగంగా నగరంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చే రెట్రో ఫిట్టింగ్ అంశంపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించారని మంత్రి చెప్పారు.



