నోడల్ అధికారుల నియామకం తప్పనిసరి
కేంద్రం సహా అన్ని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన పిల్లల కోసం ప్రత్యేక చర్యలు అవసరమని సుప్రీం కోర్టు సూచించింది. ఈ కేసుల పర్యవేక్షణకు కేంద్రం, తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలు/యూటీలు ప్రత్యేక నోడల్ అధికారిని తప్పనిసరిగా నియమించాలని ఆదేశించింది. గురియా స్వయంసేవి సంస్థ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌పై మంగళవారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. మధ్యవర్తుల ద్వారా పిల్లలను ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రా లకు అక్రమంగా తరలించి, విక్రయిస్తున్న మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్ గురించి పిటిషనర్ తరపు సీనియర్ అడ్వొకేట్ అపర్ణ భట్ కోర్టుకు నివేదించారు.
మధ్యలో కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ…. తప్పిపోయిన పిల్లల కేసులను పర్యవేక్షించడానికి ట్రాక్ చైల్డ్ పోర్టల్, ఖోయా-పాయ పోర్టల్ అనే రెండు పోర్టల్‌లు పని చేస్తున్నాయని ధర్మాసనానికి నివేదించారు. ఈ పోర్టల్‌లను 2025లో మిషన్ వాత్సల్య పథకంలో కూడా విలీనం చేసినట్టు తెలిపారు. దీనిపై జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకొని ఈ పోర్టల్‌లు రెండు వైపులా ఉండే విధానాన్ని కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలు (ఒకవేళ పిల్లవాడు దొరికితే), తల్లిదండ్రులు/సంరక్షకులు (ఒకవేళ పిల్లవాడు పోతే) ఫిర్యాదు నమోదు చేసుకోనేలా ఉంటే బాగుంటుందన్నారు. అయితే ఆ వ్యవస్థ ఇప్పటికే ఉందని ఏఎస్ జీ బదులిచ్చారు. అలాగే ట్రాక్ చైల్డ్ పోర్టల్ చట్ట అమలు సంస్థలకు మాత్రమే అని, ఖోయా-పాయ పోర్టల్ ప్రయివేట్ వ్యక్తులతో సహా అందరికీ అందుబాటులో ఉందని తెలిపారు.