Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వాస్పత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్యసేవలు

ప్రభుత్వాస్పత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్యసేవలు

- Advertisement -

అనారోగ్యంతో ఉన్న వృద్ధుల జాబితా సిద్ధం చేయండి
జెరియాట్రిక్‌ సేవలు విస్తరించండి : సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని వృద్ధుల జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలను విస్తరిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుల జాబితాను సమగ్ర వివరాలతో తయారు చేయాలని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. అందులో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తూ, డీఎంఈ నరేంద్రకుమార్‌, టీవీవీపీ కమిషనర్‌ అజరుకుమార్‌, డీహెచ్‌ రవీందర్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. జపాన్‌, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు నిర్వహించాల్సిన అవసరం రాబోతున్నదన్నారు. వారి మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ జెరియాట్రిక్‌ సేవలు అందించాలని సూచించారు. ప్రతి జీజీహెచ్‌, జిల్లా ఆస్పత్రుల్లో జెరియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్ల అటెండెన్స్‌ను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రతి ఆస్పత్రిలోనూ అవసరం మేర డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగులను నియమిస్తున్నామనీ, అందులో భాగంగానే రెండేండ్లలో వైద్యారోగ్య శాఖలో 9 వేల పోస్టులను భర్తీ చేశామని వివరించారు. మరో 7 వేలకుపైగా పోస్టులు భర్తీ కాబోతున్నాయని చెప్పారు. డాక్టర్లు ఆస్పత్రులను ఓన్‌ చేసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంచిగా పని చేసే వారికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. కొన్ని ఆస్పత్రుల్లో ఏండ్లతరబడి పాతుకుపోయి పని చేసేవారిపైనా తప్పుడు ఆరోపణలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అలాంటి వారుంటే హెచ్‌ఓడీలకు వివరాలు అందించాలనీ, చేసే పర్యటనలు, తనిఖీలు, ఫైండింగ్స్‌, యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టులను ప్రతి నెలా అందించాలని ఆదేశించారు. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, గుండె, కిడ్నీ లాంటి లైఫ్‌స్టైల్‌ వ్యాధులకు మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

రోగులను దోచుకునే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి
వైద్యం పేరిట ప్రజలను దోచుకునే ప్రయివేటు ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరించాలనీ, ఐవీఎఫ్‌, రిహాబిలిటేషన్‌ సెంటర్లు, పెయిన్‌ క్లినిక్‌ల పేరుతో అవకతవకలకు పాల్పడేవారిని ఉపేక్షించొద్దని ఆదేశించారు. మెడికల్‌ ఎడ్యుకేషన్‌, వైద్య విధాన పరిషత్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఎన్‌హెచ్‌ఎం డిపార్ట్‌మెంట్ల మధ్య కోఆర్డినేషన్‌ పెరగాలన్నారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ పకడ్బంధీగా అమలు చేయాలని ఆదేశించారు. నార్మల్‌ డెలివరీలను ప్రోత్సహించాలన్నారు. సిజేరియన్‌ డెలివరీలు మాత్రమే చేస్తున్న ప్రయివేటు ఆస్పత్రులపై దృష్టి సారించాలని ఆదేశించారు. సబ్‌సెంటర్‌ నుంచి జీజీహెచ్‌ల వరకు ఆస్పత్రుల మధ్య సమన్వయం ఉండాలనీ, రోగులను ప్రయివేటు ఆస్పత్రులకు రిఫర్‌ చేయొద్దని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -