Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేరళ తరహాలో అత్యంత పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక ప్రణాళికలు

కేరళ తరహాలో అత్యంత పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక ప్రణాళికలు

- Advertisement -

మంత్రి సీతక్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేరళ తరహాలో రాష్ట్రంలో అత్యంత పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో ఆమె సర్పంచులుగా ఎన్నికైన సూర్యాపేట, వనపర్తి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు సరిత, స్వరూపలను సన్మానించారు. జిల్లాల వారీగా నెల రోజులపాటు మహిళా సంఘాలు, సమాఖ్యలు నిర్వహించిన కార్యకలాపాలను ఆమె సమీక్షించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వారిని మహిళా సంఘాలు గుర్తిస్తే, వారి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. వారిని గుర్తించేందుకు అవసరమైన ప్రొఫార్మాను త్వరలోనే అందజేస్తామని తెలిపారు.

కేరళలో సర్వే ద్వారా 64,006 కుటుంబాల్లోని దాదాపు లక్ష మంది తీవ్రమైన పేదరికంలో ఉన్నట్టు గుర్తించి, ఆయా కుటుంబాల అవసరాలను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక మైక్రో ప్లాన్‌ను రూపొందించినట్టు చెప్పారు. తెలంగాణలో ఇదే తరహాలో మైక్రోప్లాన్‌ రూపొందిస్తామని వివరించారు. వారికి గుర్తింపు కార్డులు, ఇండ్లు, ఉపాధి అవకాశాలు, వైద్య సంరక్షణ వంటి సహాయాలు అందించనున్నట్టు వెల్లడించారు. పంచాయతీరాజ్‌ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్‌, ప్రజలను సమీకరించి ఈ లక్ష్యాన్ని సాధించిందనీ, అదే తరహాలో తెలంగాణలో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్‌కట్‌ చేసి మహిళా సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -