జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నేర ప్రవృత్తి కలిగిన రౌడీ షీట్లు,హిస్టరీ షీట్లు ఉన్న వారిపై పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారి ప్రస్తుత కార్యకలాపాలు, కదలికలపై అరా తీసి కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సత్ప్రవర్తన దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అసాంఘిక కార్యకలాపాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజా జీవనానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పని ఎస్పీ గారు హెచ్చరించారు.
రౌడీ షీటర్స్,హిస్టరీ షీటర్స్ ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని,నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సత్ప్రవర్తనతో మెదులుతున్న వారిని గుర్తించి షీట్స్ ను తొలగించడం జరుగుతుందన్నారు. పోలీస్ అధికారులు తెలిపిన సమయాల్లో పోలీస్ స్టేషన్ హాజరు కావాలని లేని పక్షంలో వారిని బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు.శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని,ఏదైనా నేరానికి పాల్పడిన వారు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు.



