విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన
నగర స్వచ్ఛతలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టే గ్లోబల్ సిటీకి చిరునామాగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి కోసం ఐదు ప్రధాన అంశాలుగా విభజించి, మొత్తం 111 ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. వీధుల ఆధునీకరణ, సుందరీకరణ పనుల నిర్వహణ, అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది కుటుంబాలు నగరానికి వలస వస్తున్నాయని అన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ప్రాథమిక విద్యను అందరికీ అందించే సంస్కరణలు ముందుగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లోని ప్రభుత్వ ప్ర్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కాలేజీలన్నింటినీ గుర్తించాలన్నారు. నర్సరీ నుంచి నాల్గో తరగతి వరకు, ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు, తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు మూడు కేటగిరీలుగా నాణ్యమైన విద్యను అందరికీ అందించాలన్నారు. పేదలందరికీ తక్షణ వైద్య సాయం అందుబాటులో ఉండేలా ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెత్త సేకరణలో నిర్ల్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్, జీహెచ్‌ఎంసీ అధికారులను హెచ్చరించారు. కోర్ అర్బన్ సిటీలో ఒక్క ప్రభుత్వ ఆఫీస్ కూడా అద్దె భవనాల్లో ఉండేందుకు వీల్లేదనీ, సొంత భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో పునరుత్పాదక విద్యుత్‌ను వాడాలని ఆదేశించారు. నాలాలు, కుంటలు, చెరువుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలని సూచించారు. ”ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా జరిగేందుకు అధునాతన సిగలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సిటిలో ఉన్న అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలి. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ప్రణాళిక రూపొందించండి.
ట్రాఫిక్ నియంత్రణలో బాగంగా వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయండి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో వినియోగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి” అని అధికారులకు సీఎం సూచించారు. డ్రైనేజీ, మ్యాన్ హౌల్స్ క్లీనింగ్‌కు రోబోలను వాడాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో మూసీ పరివాహకంలో ఉన్న అంబర్‌పేట స్మశాన వాటికను అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్, సైకిల్ ట్రాక్‌తో పాటు మల్టీ లెవల్ పార్కింగ్ కోసం వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. నగరంలో ఇప్పుడున్న పార్కులన్నింటిలో పిల్లల ఆటపాటలకు వీలుగా ప్లే జోన్లను అభివృద్ధి చేయాలన్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలోని అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ల అప్ గ్రేడేషన్‌తో పాటు, ట్రాన్స్ ఫార్మర్లను స్ట్రీమ్ లైన్ చేసి రీ-లొకేట్ చేయాలని ఆదేశించారు. మంచినీటి, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి సేవించి పట్టుబడితే బాధితులగా చూడవద్దనీ, కనీసం పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని సీఎం ఆదేశించారు. చర్లపల్లి జైలు ప్రాంగణంలో రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి దాని నిర్వహణ, పర్యవేక్షణకు మాజీ మిలిటరీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES