ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ గురువారం ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ ఏ.ఈలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటివరకు గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యలు ఏమిటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న ఆయా మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు పురోగతి సాధించడం లేదని నిలదీశారు. ప్రభుత్వం వెంటదివెంట బిల్లులను మంజూరు చేస్తూ, తగిన తోడ్పాటును అందిస్తోందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇంటి నిర్మాణం పనులు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. మంజూరీలు పొందిన వారందరూ తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ, క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం పనులు చేపట్టేలా చూడాలని, ఇందిరమ్మ కమిటీల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న లబ్ధిదారులకు ఐ కే పీ, మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు ఇప్పించాలన్నారు. బిల్లుల చెల్లింపులలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు లబ్దిదారుల వివరాలు ఆధార్ కార్డు వివరాలతో సరిపోలి ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాలని, ఎవైనా మార్పులు అవసరం ఉంటే ఆధార్ అప్డేషన్ చేయించాలని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. తాను ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తానని, ఎప్పటికప్పుడు స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్న, తదితరులు పాల్గొన్నారు.
