Monday, August 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపాతబస్తీ మెట్రో పనుల్లో వేగం

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం

- Advertisement -

ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100 నుంచి 900కు కుదింపు
పిల్లర్ల మార్కింగ్‌
పనులు షురూ..
రోజువారీగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో

ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట మధ్య మెట్రోరైల్‌ కారిడార్‌ ఏర్పాటుకు సంబంధించిన రోడ్డు విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. 7.5 కిలోమీటర్ల మార్గంలో అలైన్‌మెంట్‌ అద్భుతంగా ఉండేలా చర్యలు చేపట్టామని, ఈ రూట్లో రోడ్డు విస్తరణ వల్ల ప్రభావితమయ్యే ఆస్తుల సంఖ్యను తగ్గించేలా మార్గాన్ని రూపకల్పన చేశామని హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. మెట్రో పనులకు సంబంధించి ఇంజినీరింగ్‌, రెవిన్యూ అధికారులతో రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందనుకు న్న అంచనా ప్రకారం 1100 ఆస్తులు ఈ విస్తరణలో కూల్చాల్సి ఉంటుందని భావించామని, కానీ అలైన్‌మెంట్‌ను ఇంజనీరింగ్‌ నవకల్పన ద్వారా సరిదిద్దటం వల్ల ఆ సంఖ్య 900 వరకు తగ్గిందని చెప్పారు. వీటిలో ఇప్పటికే 412 ఆస్తులకు సంబంధించిన అవార్డులు జారీ చేశామని, 380 ఆస్తుల కూల్చివేతలు ఇప్పటివరకు పూర్తయ్యాయని, వీటి కోసం రూ.360 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్టు తెలిపారు.

జనజీవనానికి ఇబ్బంది లేకుండా పనులు
ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ, కూల్చివేతలు చేసి అవశేషాల ను తొలగించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించి పనులు ముమ్మరంగా చేపడుతున్నామని మెట్రో ఎండీ తెలిపారు. ఇక్కడ ఇండ్లు ఒకదానిని ఒకటి ఆనుకుని ఉండటం వల్ల, పైగా ప్రతి కట్టడానికి సంక్లిష్టమైన విద్యుత్‌ లైన్లు, ఇతర కేబుళ్లు వేలాడుతూ ఉండటంతో వాటిని చాలా అప్రమత్తంగా తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అర్థరాత్రి సమయాల్లో విస్తరణ పనులు ముమ్మరంగా చేస్తున్నామని చెప్పారు. మిగిలిన ఆస్తుల స్వాధీనానికి, త్వరితగతిన కూల్చివేతలు పూర్తిచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు.

త్వరలో భూసామర్థ్య పరీక్షలు
మరోవైపు మెట్రో నిర్మాణ పనులు ప్రారంభించడానికి వీలుగా చర్యలు చేపట్టామని మెట్రో ఎండీ తెలిపారు. ఈ కారిడార్‌లో వచ్చే పిల్లర్ల ఏర్పాటుకు తగిన స్థలాలను గుర్తించి వాటిని మార్కింగ్‌ చేసే పని ప్రారంభమైందన్నారు. వయాడక్ట్‌ను నిలిపే పిల్లర్ల మధ్య 25 మీటర్ల(సుమారు 82 అడుగులు) దూరం ఉంటుందని చెప్పారు. మెట్రో స్తంభాలు, స్టేషన్లు వచ్చే చోట భూసామర్థ్య పరీక్షల కోసం ఏజెన్సీని నియమించామని, త్వరలో భూసామర్థ్య పరీక్షలూ చేపడతామని అన్నారు. చారిత్రక, ఇతర సున్నిత కట్టడాలకు అంతరాయం కలగకుండా, పిల్లర్‌, మెట్రో స్టేషన్ల స్థానం నిర్ణయించేందుకు డీజీపీఎస్‌ సర్వే నిర్వహించామని తెలిపారు. నిర్మాణ సమయంలో సర్వే సులభంగా జరిగేలా భూమిపై తాత్కాలిక బెంచ్‌ మార్క్‌(టీబీఎం) లొకేషన్లు నిర్ణయించినట్టు స్పష్టం చేశారు.

విద్యుత్‌లైన్లను అండర్‌ గ్రౌండ్‌ లేబుళ్లుగా..
పిల్లర్లు, స్టేషన్లు వచ్చే ప్రాంతాల్లో భూగర్భ మురుగునీటి లైన్లు, మంచినీటి లైన్లు, వరదనీటి డ్రైన్లు, పైన వేలాడే విద్యుత్‌ లైన్లు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎండీ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశానుసారం విద్యుత్‌ లైన్లను అండర్‌ గ్రౌండ్‌ లేబుళ్లుగా మారుస్తామని అన్నారు. ఇందుకోసం వాటర్‌ బోర్డు, జీహెచ్‌ఎంసీ, టీజీఎస్పీడీసీఎల్‌ విభాగాల నుంచి వచ్చే కొద్ది రోజుల్లో అంచనాలు సమర్పించవలసిందిగా కోరామని చెప్పారు. ఆయా శాఖల అధికారులతో మెట్రో అధికారులు రేయింబవళ్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ.. ముఖ్యమైన యుటీలిటీస్‌ని గుర్తించే పని చేపట్టారని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -