చిన్నారెడ్డి ఫోన్ చేసినా ఎత్తని విద్యా, క్రీడా శాఖ అధికారులు : మంత్రితో బాధలు చెప్పుకోవాలని చిన్నారెడ్డి సలహా
త్వరలో నిరాహార దీక్షకు దిగుతాం : అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డీఎస్సీ క్రీడాకోట నియామకాల రీ-వెరిఫికేషన్ ఫలితాల గురించి తొమ్మిది నెలల నుంచి తిరుగుతున్నా తమకు న్యాయం జరగట్లేదని డీస్పీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమంలో నిరసన తెలిపారు. త్వరలో నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు. తమకు న్యాయం చేయాలని ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి.చిన్నారెడ్డికి మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో ఇదే విషయంపై విద్యా, క్రీడా శాఖ అధికారులకు చిన్నారెడ్డి ఫోన్‌చేయగా..ఆ అధికారులు స్పందించలేదు. దీంతో ఆయన క్రీడా మంత్రిని కలవాలని సూచించారు. డీఎస్సీ 2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు మాట్లాడుతూ.. 96 మంది జాతీయ క్రీడాకారులకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించారు. జాతీయ క్రీడాకారులమైన తమను కాదని క్రీడాకోట జీవో 74 కి వ్యతిరేకంగా జిల్లా సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డీఎస్సీ 2024 నియామకాల్లో అవినీతి జరిగిందనీ, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.