– ఎన్‌పీడీసీఎల్‌లాగే.. ఎస్పీడీసీఎల్‌లోనూ జీవో ఇవ్వాలి
– ఒకట్రెండు నెలల్లో సమస్య పరిష్కరించాలి
– లేదంటే చలో సెక్రటేరియెట్‌కు పిలుపునిస్తాం : తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు
– ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పని చేస్తున్న స్పాట్ బిల్లర్స్‌కు పూర్తి స్థాయిలో పని కల్పించాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎండీ ముషారఫ్ ఫరూఖీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌రావు మాట్లాడుతూ.. స్పాట్ బిల్లర్స్ నెలలో 10 రోజులు పని చేస్తే మిగతా 20 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుండటంతో పూట గడవని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పదేండ్లుగా ఎస్పీడీసీఎల్‌ను నమ్ముకుని పని చేస్తుంటే అర్బన్‌లో ఒక వేతనం, రూరల్‌లో ఒక వేతనం ఇవ్వడం సరికాదన్నారు. దాదాపు 2వేల మంది స్పాట్ బిల్లర్స్ అరకొర వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారిలో డిగ్రీ, ఐటీఐ చదివిన వారు ఉన్నారని, అందరికీ కనీస వేతనం ఇవ్వాలని కోరారు. పీస్ రేట్‌పై పని చేస్తున్న స్పాట్ బిల్లర్స్‌కు ఒక మీటర్ రీడింగ్ తీసి బిల్లు ఇస్తే రూ.3.40 పైసలు ఇస్తున్నారని, ఇలా నెలలో రూ.5వేల వరకు మాత్రమే వస్తోందని తెలిపారు.
ప్రతి నెలా 10 లోపు రీడింగ్ పూర్తి చేసి మిగిలిన 20 రోజులు అధికారులు, లైన్‌మెన్లు చెప్పే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారని అన్నారు. నెలకు వచ్చే రూ.5వేలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, నెలంతా పని కల్పించి వేతనం ఇవ్వాలని కోరారు. ఒకటి, రెండు నెలల సమయం ఇస్తున్నామని, అయినా ఈ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోతే రీడింగ్ ఆపేస్తామని, అవసరమైతే చలో సెక్రటేరియెట్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో ధర్నాలు చేస్తే అరెస్టు చేసేవారని, నేటి ప్రజాప్రభుత్వంలో పోలీసులు నేరుగా కార్మికుల ఇంటికి వచ్చి అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్రటేరియెట్‌కు రమ్మంటారా..? సమస్యలు పరిష్కరిస్తారా..? అని ప్రశ్నించారు. యూనియన్ రాష్ట్ర సెక్రెటరీ సత్యం మాట్లాడుతూ.. ఎన్‌పీడీసీఎల్‌లో మారిదిగా ఎస్పీడీసీఎల్‌లోనూ నెలలో 30 రోజుల పని కల్పిస్తూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్న స్పాట్ బిల్లర్స్ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రతి నెలా 6-10వ తేదీ లోపు కరెంట్ బిల్లులు వచ్చేలా కృషి చేస్తున్నా.. నెలకు రూ.5వేల వేతనంతో సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. ఈ ధర్నాకు జిల్లాల నుంచి కార్మికులు తరలివస్తుండగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ సర్కిల్ స్పాట్ బిల్లర్ కె.బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.
స్పాట్ బిల్లర్స్‌కు పూర్తి స్థాయిలో పని కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES