కవి నడిచి వచ్చిన దారే అతని కవిత్వానికి ముడి సరుకు. దృక్పథం, దృష్టి కోణం, వైఖరి ఇవన్నీ ఆ దారిలో అతడు దాటిన రాళ్లు, ముండ్లు, పూలు. అరుదైన భావ వ్యక్తీకరణను అక్షరాలలో అంతరాత్మను భావంలో లోతును అతడి జీవితంలో నుంచి అనుభవ సారంలోంచి వెతుక్కుంటాడు. కవిగా తాను మాత్రమే చెప్పాల్సిన కొన్ని అంశాలను అతడు తన జీవితంలో నుంచి ఏరుకొని ప్రజా జీవితానికి పరచయం చేస్తాడు. కొందరు విరివిగా రాస్తారు. కొందరు విరివిగా చదువుతారు. అలా విరివిగా చదువుతూ తను మాత్రమే చెప్పాల్సిన కొన్ని అంశాలను తనదైన తీరులో బలంగా చెప్పిన కవి మద్దికుంట లక్ష్మణ్.
జీవిత సారాన్ని కాచి వడబోసి సహచర కవులను చదివి మిగిలిపోయిన ఖాళీలను పూరించడానికి తాను వర్గమూలం కవితా సంపుటిని తెచ్చాడు. ఇందులో 30 కవితలు ఉన్నాయి. అవి విభిన్నంగా మూడు పదుల జన జీవన మార్పులను మనిషి తనను తానే కాకుండా మనిషితనాన్ని కూడా కోల్పోయిన వైనాన్ని అక్షరమాలగా పేర్చి కవితల్లో పట్టుకొచ్చారు. కవిగా కంటే అతడు నడిచి వచ్చిన జీవితం ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఓటమికి తలవంచని ధీరత్వం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ కవి ఆ సంఘర్షణలోంచే పుట్టాడు. అందుకే కాబోలు ఒంటరి కెరటంలా పడి లేచిన అతడు చెప్పిన నాలుగు వాక్యాలు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
లక్ష్మణ్ శ్రమకోర్చిన మనిషి. జీవితం ఎప్పడూ అతనికి ఒక సవాలే. శ్రమ విలువ తెలిసిన వాడు కాబట్టే అతడు చెమట చుక్కల్ని కవిత్వంతో తూకం వేసాడు. మట్టిలో విత్తనం నాటింది మొదలు కల్లంలో పంట చేరే దాకా పంట దళారీల కంట పడకుండా కాపాడుకునే స్తోమత లేని రైతు జీవితాన్ని కళ్ళకు కట్టాడు. ఓ సాదారణ రైతులాగే లక్ష్మణ్ ఒంటి చేత్తో జీవితాన్ని ఈదాడు. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. కుటుంబ పెద్దగా పిడికెడు మెతుకులు పెట్టడానికి అరిగోస పడ్డాడు. కాల గతిలో దాటుకుంటూ దాటుకుంటూ తీరం చేరినా కాలం ఎప్పుడూ అతడికి ఒక పరీక్షనే. అందుకే అతను బలమైన వ్యక్తీకరణతో ‘ఒక నమ్మకం జీవితాన్ని నడిపిస్తుంది. ఒక ధైర్యం కడలిని దాటిస్తోంది. ఒక పొడి వాక్యం ఎడారిలో ఒయాసిస్సులా అక్కున చేర్చుకుంటుంది’ అంటూ దాటి వచ్చిన దారులను నెమరు వేసుకుంటూ ‘ఒక్కొక్క జ్ఞాపకం మానని గాయం లా సలవర పెడుతుంది’ అంటాడు.
60 ఏళ్ల ఆయన జీవితంలో ఊరు నీరు మనిషి ఇల్లు తల్లి పల్లె ఇవన్నీ అల్లుకుపోయాయి. పట్టణ జీవితం అలవాటు పడ్డా ఆయన గుండెల్లో పల్లె అలాగే అదిలంగా కొలువై ఉంది. వాన ధార పారినా నీటి చినుకు జారినా పులకరించే పల్లెనే గుర్తొస్తుంది. పూడికలు తీసిన బావులు, తవ్విన కాలువలు, ఆకుపచ్చ రంగు వేసుకున్న పొలాలు అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే నీటి కల పల్లెలో ఎంతటి పండుగను తెస్తుందో చెప్పుతూ ‘చెరువు నిండితే వాన కొట్టితే బతుకు మీద భరోసా పెరిగిన బడుగు జీవులు మసూల్ దారి మల్లయ్య మొదలు చిందు రాయమల్లుదాక ఊరు ఆనందాల రాగ రంజితమైతది. అరొక్క కలతోని అలరారుతది. రాత్రి కలతలు లేని నిశ్చింత నిద్రల జోగుతది’ అంటూ పలవరిస్తాడు. కవిగా తన ప్రయాణం పల్లె నుండి మొదలైంది. తన ఆరాటం పోరాటం పల్లె తోనే ముడి పడింది. సుదీర్ఘ సమాసాలు పెద్దపెద్ద అర్థాలు వాక్యాలు ఇవేవీ అతని కవిత్వంలో ఉండవు. గుండెను ముళ్ళుతో కెలికినట్టు చదివినాక చిన్న సలపరింత మాత్రం ఆ అక్షరాలకు అద్దుకొని ఉంటుంది.
రెక్కాడితే కానీ డొక్కాడని అనేక మంది కష్టజీవుల కష్టాలను తనదిగా చేసుకుని మత్యు ఒకటే అయినా అనేక మరణాలను అతడు గుండె అవిసిపోయేలా చెప్తాడు. ‘ఏముంది బాయి రాత్రయితే ఎప్పుడు తెల్లారుతుంది అని సూసుడు. తెల్లారితేముంది ఎప్పుడు రాత్రి అయితదని ఎదురు చూసుడు అంటూ భారమైన జీవితాల బరువును నాలుగు వాక్యాల్లోకి వంపేసి తాను పక్కకు తప్పుకొని మనల్ని కుండపోత కన్నీటిలో ముంచేస్తాడు. కవిగా జీవించడం అంటే ప్రపంచపు బాధను తనదిగా నెత్తిన మోయడమే. లక్ష్మణ్ ఆ బాధను మోయడమే కాదు పొక్కగాని పాములా నిరంతరం మార్పుకూ మార్పుకూ మద్య పొడిబారిన మనసును తడిచేసుకుంటూ ఆధునికీకరణ పట్టణాలను పల్లెలను చుట్టుముట్టాక కరి మింగిన వెలగపండులా వట్టిపోయిన పల్లెలో అతడు కనిపించని శత్రువును గుర్తుపట్టి శబ్ద బేధితో చేదిస్తాడు.
ప్రపంచాన్ని పెట్టుబడితో ఆక్రమించినవాడికి వాడికి ప్రజలైన ప్రకతి అయినా పచ్చ నోట్ల కింద లెక్క అంటూ పెట్టుబడి సూత్రాన్ని చెప్పి అడవిని చెరబడుతున్నానని బ్రమిసేవాడికి గాలిని బంధిస్తున్నానని మురిసే వాడికి ఈ అడవితో ఈ గాలితో పెనవేసుకున్న మా జీవితాలు ఎలా అర్థం అవుతాయి అంటూ ఆవేదనగా పెట్టుబడి మనస్తత్వాన్ని చెప్తాడు. మారుతున్న సమాజంలో మానవ సంబంధాలు కూడా అంగడి సరుకై అమ్మకానికి పెట్టిన తరుణంలో మానవ సంబంధాల మధ్య మార్పును నాలుగు వాక్యాలలో చెప్పి ఇంతకంటే ఎక్కువ ఎవరు వ్యక్తికరించలేనంతగా బలంగా. ‘మా చెల్లికి పెళ్లి అయింది. స్నేహితుడే కానీ నా అనుమానం అంతా భర్త పోస్టు మీదనే’ అని చెబుతాడు. లక్ష్మణ్ కు లోతైన పరిశీలన ఉంది. శతస్కోపును సమాజపు గుండె మీద పెట్టి ప్రకంపనాలను నమోదు చేసి, మైక్రో స్కోపుతో చూసి కవిగా కవిత్వంలో నమోదు చేశ్తాడు.
అలాంటి పరిశీలనతో బలంగా మానవ సంబంధాలను చెప్పిన మరొక కవిత ‘లెక్క ప్రకారమే’. భార్యాభర్తలుగా దశాబ్దాలుగా విడదీయలేని బంధాన్ని కొనసాగించి పిల్లలను ప్రయోజకులను చేస్తే ఆస్తులు పంచుకున్నట్టే అమ్మానాన్నలను కూడా పంచుకుంటున్న ఆధునిక సమాజం పై ఎక్కుపెట్టిన కవిత ఇది. ఇప్పుడు ఆ వద్ధ దంపతులు భార్య ఒకచోట భర్త ఒకచోట లెక్క ఎక్కడ తప్పిందా అని బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. తళుకు బెలుకు రాళ్ళు తట్టడేలా అన్నట్టుగా ఎన్ని కవితలు రాసాము ఎన్ని సంపుటాలు తెచ్చామన్నది కాకుండా తెచ్చిన కవితా సంపుటిలో ఎక్కుపెట్టిన ఆయుధాలు ఎన్ని అని లెక్కకడితే లక్ష్మణ్ తెచ్చిన వర్గమూలం సంపుటిలో రాసిన ముప్పయి కవితలూ ఈ సమాజం మీద ఎక్కుపెట్టిన ప్రశ్నాస్త్రాలే. ఈ సమాజపు మూలాలు తెలువాలంటే ఈ వర్గమూలం చదవాల్సిందే.
పెద్దింటి అశోక్ కుమార్
సినీ రచయిత