రెండో టీ20లో ఆసీస్ పైచేయి
కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా) : భారత అమ్మాయిలు ఛేదనలో చతికిల పడ్డారు. 164 పరుగుల ఛేదనలో భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 144/9 పరుగులకే పరిమితమైంది. దీంతో గురువారం కాన్‌బెర్రాలో జరిగిన రెండో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36, 30 బంతుల్లో 5 ఫోర్లు), ఓపెనర్లు స్మృతీ మంధాన (31, 24 బంతుల్లో 4 ఫోర్లు), షెఫాలీ వర్మ (29, 23 బంతుల్లో 5 ఫోర్లు) సహా రిచా ఘోష్ (19, 20 బంతుల్లో 3 ఫోర్లు) రాణించినా.. భారత్ విజయానికి చేరువ కాలేదు.
జెమీమా రొడ్రిగ్స్ (4), ఆమన్జోత్ కౌర్ (3), దీప్తి శర్మ (0) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లె గార్డ్‌నర్ (3/22), కిమ్ గార్త్ (2/16), అనాబెల్ (2/18), సోఫీ (2/37) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జియా వోల్ (88, 57 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) భారీ అర్థ సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ బెత్ మూనీ (46, 39 బంతుల్లో 4 ఫోర్లు) దంచికొట్టింది. భారత పేసర్ అరుంధతి రెడ్డి (2/30) రాణించింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మక పోరు ఆదివారం ఆడిలైడ్‌లో జరుగనుంది.



