Saturday, May 24, 2025
Homeఆటలుసెమీస్‌లో శ్రీకాంత్‌

సెమీస్‌లో శ్రీకాంత్‌

- Advertisement -


క్వార్టర్‌ఫైనల్లో ఉత్కంఠ విజయం
మలేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌

కిదాంబి శ్రీకాంత్‌ చాన్నాండ్ల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టాడు. మలేషియా మాస్టర్స్‌లో అద్భుతంగా రాణిస్తున్న కిదాంబి శ్రీకాంత్‌ కౌలాలంపూర్‌లో ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచుల్లో విజయాలు నమోదు చేశాడు. ఫ్రాన్స్‌ ఆటగాడిపై విజయంతో పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించిన కిదాంబి శ్రీకాంత్‌.. 2023 తర్వాత తొలిసారి ఓ టోర్నమెంట్‌ టాప్‌-4లో నిలిచాడు.
కౌలాలంపూర్‌ : భారత వెటరన్‌ షట్లర్‌, పురుషుల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2023 తర్వాత తొలిసారి ఓ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది థారులాండ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న శ్రీకాంత్‌.. 2023లో స్విస్‌, మకావు ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకున్నాడు. కౌలాలంపూర్‌ స్పోర్ట్స్‌ సిటీలో జరుగుతున్న మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో మెరిసిన శ్రీకాంత్‌ మళ్లీ సెమీఫైనల్లో కాలుమోపాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఫ్రాన్స్‌ ఆటగాడు టోమ జూనియర్‌పై మూడు గేముల మ్యాచ్‌లో శ్రీకాంత్‌ గెలుపొందాడు. 74 నిమిషాల పాటు ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 24-22, 17-21, 22-20తో పైచేయి సాధించాడు. గతంలో రెండు సార్లు టోమ చేతిలో ఓడిన శ్రీకాంత్‌.. మలేషియా మాస్టర్స్‌లో అతడికే చుక్కలు చూపించాడు.
తొలి గేమ్‌లో 10-11తో విరామ సమయానికి ఓ పాయింట్‌ వెనుకంజ వేసిన శ్రీకాంత్‌ ద్వితీయార్థంలో పుంజుకున్నాడు. ప్రతి పాయింట్‌కు ఆధిక్యం చేతులు మారిన మ్యాచ్‌లో 22-22 వరకు నువ్వా నేనా అన్నట్టు సాగింది. ఆఖర్లో వరుసగా రెండు పాయింట్లు సాధించిన శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో గేమ్‌ను టోమ 21-17తో గెల్చుకుని లెక్క సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ సైతం ఉత్కంఠ రేపింది. విరామ సమయానికి 7-11తో తడబాటుకు గురైన శ్రీకాంత్‌.. ఆ తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. వరుస పాయింట్లతో 13-13తో స్కోరు సమం చేశాడు. 18-17, 20-17తో శ్రీకాంత్‌ ముందంజ వేసినా.. టోమ 20-20తో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. ఒత్తిడిలో ఉత్తమ ప్రదర్శన చేసిన కిదాంబి శ్రీకాంత్‌ మరోసారి టైబ్రేకర్‌లో పైచేయి సాధించాడు. 22-20తో మూడో గేమ్‌తో పాటు సెమీఫైనల్‌ బెర్త్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌ షట్లర్‌ టనకతో పోటీపడనున్నాడు. ఇదిలా ఉండగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టోలు వరుస గేముల్లో ఓటమి చెందారు. 22-24, 13-21తో టాప్‌ సీడ్‌ చైనా షట్లర్ల చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో మలేషియా మాస్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ ఒక్కడే భారత టైటిల్‌ ఆశల భారం మోస్తున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -