– సికింద్రాబాద్ ‘టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్’ నిర్వాకం
– నిందితులకు 14 రోజుల రిమాండ్
– చంచల్‌గూడ జైలుకు తరలింపు
– ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ : డీసీపీ రష్మీ పెరుమాళ్
– రూ.40 లక్షలకు అమ్మకం
– రూ.90వేలకు శిశువు కొనుగోలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్’లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళలకు భర్త శుక్రకణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్రకణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిర్వాహకురాలు నమ్రతతోపాటు ఐదుగురు సిబ్బందిని గోపులపురం పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి.. జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. దాంతో న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించగా.. నిందితులను చంచల్‌గూడ జైల్‌కు తరలించారు. కాగా ఈ సెంటర్‌పై పోలీసులు నాలుగోసారి కేసు నమోదు చేశారు. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకుని గంటల కొద్ది ప్రశ్నించిన పోలీసులు, ఆ సెంటర్‌లో సోదాలు నిర్వహించారు. కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో వాడిన పరికరాలను పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లారు. అక్రమంగా నిల్వ ఉంచిన 16 స్పెర్మ్ శాంపిల్స్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. వీటిని అహ్మదాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లకు తరలిస్తున్నట్టు గుర్తించారు. గుజరాత్, ఢిల్లీలోని సరోగసీ, టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ల కోసం ఈ శాంపిల్స్ సేకరణ జరుగుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ : డీసీపీ రష్మీ పెరుమాళ్
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఐవీఎస్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆదివారం మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం కలిశారు. ఇక్కడి నుంచి ఆ దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసి అవుతుందని చెప్పారు. సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతా రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షల చెక్కు, రూ.15లక్షలు బ్యాంక్ ఎకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు. ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్‌ఏ అని తేలింది. డాక్టర్ నమ్రత జాబితాలో చాలా మంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40 లక్షలు వసూలు చేశారు. బాధిత కుటుంబం మమ్మల్ని కలిసిన వెంటనే సోదాలు చేశాం. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అడ్వకేట్‌గా పని చేస్తూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై ఏదైనా కేసులు వస్తే తనే వాదించేవారు. వైజాగ్‌లోనూ సరోగసి ద్వారా అనేక గర్భధారణలు చేశారు. నమ్రత, హైదరాబాద్‌లో ఉన్న ఒక మహిళకు రూ.80వేలు ఇచ్చి ఫ్లైట్‌లో వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సర్జరీ అయ్యాక పాపని వాళ్లకు అప్పగించి మళ్ళీ హైదరాబాద్‌కు పంపించారు. పేదలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారు. నమ్రతకు సంబంధించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లైసెన్సులతో పాటు ఆమె లైసెన్స్‌నూ క్యాన్సిల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా, డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయని డీఎస్పీ వెల్లడించారు.
మరో స్పెర్మ్ క్లినిక్ నిర్వాకం బట్టబయలు
అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వాకం బట్టబయలైంది. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్నీ, అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంకజ్‌తోపాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోను అరెస్టు చేశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా ఇండియన్ స్పెర్మ్ క్లినిక్‌ను నిర్వహిస్తూ.. వీర్య కణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరణ చేస్తున్నారు. ఈ స్పెర్మ్ డోనర్లకు రూ.4వేల చొప్పున ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ చెల్లిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
‘సృష్టి’ నిర్వాహకురాలు అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES