Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసృష్టి కేసు సిట్‌కు బదిలీ

సృష్టి కేసు సిట్‌కు బదిలీ

- Advertisement -

– ఆ ఆస్పత్రి కేవలం కన్సల్టెన్సీనే..
– ‘ఐవీఎఫ్‌’ పేరుతో శాంపిల్స్‌ సేకరణ
– వైజాగ్‌లోనే సరోగసి ప్రాసెస్‌
– ఓ జంటకు మృతిచెందిన శిశువు అప్పగింత
– మళ్లీ ప్రాసెస్‌ కోసం మరో రూ.15లక్షల డిమాండ్‌ : నార్త్‌ జోన్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌ వెల్లడి
నవతెలంగాణ-బేగంపేట్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసును సిట్‌కు బదిలీ చేసినట్టు హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ డీసీపీ రష్మీపెరుమాళ్‌ తెలిపారు. నార్త్‌జోన్‌ డీసీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. పలువురి బాధితుల ఫిర్యాదు మేరకు జులైలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 25 మందిని అరెస్టు చేశామని, 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని అన్నారు. అరెస్టయిన వారిలో సికింద్రాబాద్‌ బ్రాంచ్‌, విశాఖ బ్రాంచ్‌కు చెందిన నిందితులున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్‌లోని సృష్టి సెంటర్‌కు ఎలాంటి అనుమతులూ లేకుండా నడిపిస్తున్నారని, పిల్లల పేరుతో చాలా మంది దంపతుల వద్ద రూ. 20 నుంచి 30 లక్షలు వసూలు చేశారని వివరించారు. డాక్టర్‌ నమ్రత బ్యాంక్‌ ఖాతాను నిలిపివేశామన్నారు. గైనకాలజీ డాక్టర్‌ సూరి శ్రీమతి పేరుపై ఉన్న లైసెన్స్‌ నెంబర్‌, లెటర్‌ హెడ్స్‌తో అక్రమాలు చేశారన్నారు.
‘డీఎన్‌ఏ’ టెస్ట్‌ మ్యాచ్‌ కాలేదని మరో ఫిర్యాదు వచ్చిందని, డాక్టర్‌ సూరీష్‌, లెటర్‌పాడ్‌ తీసుకొని మోసం చేసినట్టు ఫిర్యాదు చేశారని తెలిపారు. విశాఖపట్నంలో విద్యులతోపాటు డాక్టర్స్‌ ఉష, రవిని అరెస్టు చేశామన్నారు. సరోగసి పేరుతో చాలా మంది వద్ద డబ్బులు తీసుకున్నారని, ఆడపిల్లలకు రూ.3 లక్షలు, మగ పిల్లలకు రూ.4 లక్షలు ఎజెంట్స్‌కు ఇచ్చారన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన బాధితులను విశాఖపట్నం పిలిపించి అక్కడే పిల్లలను ఇస్తామని నమ్మించేవారన్నారు. నిందితుల్లో చాలా మంది మహిళలు ఉన్నారని డీసీపీ తెలిపారు. సృష్టి కేసు నమోదు తర్వాత చాలా మంది బాధితులు పోలీసులను కలిసి మరిన్ని వివరాలు చెప్పారని అన్నారు. ‘ఐవీఎఫ్‌’ కోసం వచ్చిన వాళ్లను సరోగసి వైపు నమ్రత మళ్లించిందన్నారు. ఒక జంటకు సరోగసి పేరుతో డబ్బులు తీసుకుని, చనిపోయిన శిశువును ఇచ్చారన్నారు. మళ్లీ ప్రాసెస్‌ కోసం మరో రూ.15 లక్షలు అవుతాయని చెప్పారన్నారు. ఈ బాధితులు సైతం ఫిర్యాదు చేశారన్నారు. మరో దంపతులకు వేరే వారి పిల్లలను ఇప్పించారని, అయితే డీఎన్‌ఏ మ్యాచ్‌ కాలేదన్నారు. సికింద్రాబాద్‌లో ఉన్న ఆస్పత్రిని కేవలం కన్సల్టెన్సీగా వాడుతున్నారని, ఇక్కడ ‘ఐవీఎఫ్‌’ పేరుతో శాంపిల్స్‌ తీసుకుంటున్నారని అన్నారు. సరోగసి మిగతా ప్రాసెస్‌ అంతా వైజాగ్‌లో చేస్తున్నారని తెలిపారు.
సరోగసి తల్లులుగా..
మహిళా నిందితుల్లో చాలామంది అండాలు అమ్ముకున్న వారున్నారని డీసీపీ తెలిపారు. సరోగసి తల్లులుగా నటించిన వాళ్లు ఉన్నారన్నారు. సరోగసి కోసం సంప్రదించే దంపతులకు కొన్నిరోజుల తర్వాత ఒక ఫేక్‌ అల్ట్రా స్కాన్‌ రిపోర్ట్‌ పంపేవారన్నారు. సరోగసి పద్ధతిలో మీకు పుట్టబోయే పాప స్కానింగ్‌ రిపోర్ట్‌ అని నమ్మించేవారన్నారు. అదే సమయంలో నమ్రత ఏజెంట్లు ఓ గర్భిణిని వెతికిపెడతారని, 9 నెలల తర్వాత వైజాగ్‌లో డెలివరీ చేసి, ఆ శిశువును సరోగసి ద్వారా పుట్టిన పాపగా నమ్మించి దంపతులకు అప్పగించేవారని తెలిపారు. ఈ కేసును సిట్‌కు బదిలీ చేసినట్టు తెలిపారు. అదనపు ఎస్పీ స్థాయి అధికారిచేత ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తుందని వివరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img