ఆ కాలువకు భీంరెడ్డ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు రెండో దశ నిర్మాణమని, ఆ కాలువకు మాజీ పార్లమెంటు సభ్యులు, కమ్యూనిస్టు నేత భీంరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. సూర్యాపేటలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజాసంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరామ్‌సాగర్ రెండో దశ నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలు జరిగాయన్నారు. మిర్యాలగూడ మాజీ పార్లమెంటు సభ్యునిగా, కమ్యూనిస్టు నాయకునిగా భీంరెడ్డి నరసింహారెడ్డి ప్రాజెక్టు సాధన కోసం విశేష కృషి చేశారని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల పోరాటాన్ని, బీఎన్ త్యాగాన్ని విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎలాంటి ఆలోచన చేయకుండా, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా శ్రీరామ్ సాగర్ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సీపీఐ(ఎం), వామపక్షాలు దశాబ్దాల కాలం పోరాటం చేశాయన్నారు.
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి ఒప్పించి మెప్పించి బీఎన్‌రెడ్డి ప్రగతినగర్ వద్ద శంకుస్థాపన చేయించారని చెప్పారు. ఆ ప్రాజెక్టు సాధన కోసం బీఎన్‌రెడ్డితోపాటు మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట్ నరసింహారెడ్డి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఆర్‌ఎస్పీ-2కు బీఎన్‌రెడ్డి పేరు పెడతామని చెప్పి మోసం చేసిందన్నారు. గతంలో బీఎన్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వివిధ వేదికలపై మాజీ మంత్రి జానారెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలు సైతం పేరు పెడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును జిల్లాలో ఇంకేదానికి పెట్టినా తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయమై పునరాలోచన చేయాలన్నారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, జె.నరసింహారావు, మద్దెల జ్యోతి, ప్రజా సంఘాల నాయకులు ఎం రాంబాబు, మడ్డి అంజిబాబు, షేక్ జహంగీర్, చిన్నపంగా నరసయ్య, కాసాని కిషోర్, ఉప్పుల రమేష్ పాల్గొన్నారు.
కమ్యూనిస్టుల పోరాట ఫలితమే ఎస్సారెస్పీ-2
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES