– బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
– యూపీ పోలీసు చీఫ్‌లకు
అలహాబాద్ హైకోర్టు హెచ్చరిక
న్యూఢిల్లీ : ఎన్‌కౌంటర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయనట్లైతే కోర్టు ధిక్కార చర్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్‌లోని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరించింది. బాధ్యులపై వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పేరు సంపాదించుకోవడానికి లేదా ఒక్కసారిగా ప్రమోషన్లు పొందేందుకు పోలీసు అధికారులు, నిందితుల కాళ్లపై తుపాకులతో కాల్పులు జరుపుతున్నారని జస్టిస్ అరుణ్ కుమార్ దేశ్వాల్ పేర్కొన్నారు. ఇటువంటి పద్దతుల పట్ల కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటిని ‘హాఫ్ ఎన్‌కౌంటర్లు’గా అభివర్ణించింది. శిక్షించాల్సిన అధికారం న్యాయ వ్యవస్థ పరిధిలో వుంటుంది తప్ప ప్రభుత్వ పరిధిలో కాదని వ్యాఖ్యానించింది. పోలీసు దాడిలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఒకరు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ”భారత్ ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగంలో పేర్కొన్న నైతిక విలువలు, ఆదేశిక సూత్రాల ప్రకారం నడవాల్సి వుంటుంది. చట్టసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థల పాత్ర ఏమిటనేది రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్వచించింది.” అని బెంచ్ పేర్కొంది. 2014లో పియుసిఎల్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ మార్గదర్శకాలను చాలా స్పష్టంగా నిర్వచించింది. వీటిని ఎస్‌పిలు, సీనియర్ ఎస్‌పిలు, కమిషనర్లు వారి పరిధిలో ఉల్లంఘిస్తే వారిపై కోర్టు ధిక్కారం కింద వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఈ కేసులో పోలీసు అధికారులెవరూ గాయపడలేదని కోర్టు తెలిపింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు తుపాకులను ఉపయోగించాల్సిన అవసరం, ఔచిత్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పోలీసులు తరచూ విధానాలను, పద్దతులను విస్మరిస్తున్నారని పేర్కొంటూ నిందితులు తీవ్రంగా గాయపడిన కేసుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన ఆరుగురు మార్గదర్శకాలను జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్ తప్పనిసరిగా నమోదు చేయాలని, పోలీసులా లేదా ప్రత్యేక బృందాలా ఎవరు అరెస్టు చేశారో వివరాలివ్వాలని, గాయపడిన వారికి వైద్యసాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే బాధ్యులకు రివార్డులు లేదా ప్రమోషన్లు ఇవ్వవద్దని సూచించింది.
ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు సరికాదు
- Advertisement -
- Advertisement -



