నవతెలంగాణ – కంఠేశ్వర్
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వం పరిశీలించి రైతులతో చర్చించారు. గత నెల రోజులుగా కోసిన వరి ధాన్యాన్ని రోడ్లమీద ఆరబెట్టినప్పటికీ అధికారులు సకాలంలో కొనుగోలు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసి నీటి ప్రవాహంతో కొంత ధాన్యం కొట్టుకుపోయిందని తడిసిన ధాన్యానికి మొలకలు వచ్చి మురిగిపోతున్న పరిస్థితి వచ్చిందని దీని మూలంగా రైతాంగం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. ఆరుగాలం కష్టపడి రైతాంగం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని ప్రకృతి వైపరీత్యము మూలంగా తన కళ్ళముందే తడిసి మొలకెత్తుతుంటే రైతుల బాధ వర్ణనాతీతం అని ఆయన అన్నారు సకాలంలో కొనుగోలు చేసి ధాన్యాన్ని తరలిస్తే రైతులకు ఈ బాధ ఉండేది కాదని. సంచులు సకాలంలో అందించకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించటానికి లారీలు సకాలంలో రాకపోవడంతో పాటు హమాలీలు కొరత ఉండటం వలన రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని. ఈరోజు మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి, గుత్ప, కల్లెడ తదితర గ్రామాల రైతుల ధాన్యాన్ని పరిశీలించటం జరిగింది.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులకు మరింత నష్టం జరగకుండా ఆదుకోవాలని పరుగు పేరుతో నష్టపరచవద్దని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు రాష్ట్రంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రకటిస్తున్నప్పటికీ. ఇంకా వందలాది లారీల ధాన్యం రోడ్లమీదనే కుప్పలు పోసి ఉన్నాయని గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన తడిసి వాసన వస్తున్నాయని రంగు మారుతున్నాయని ధాన్యానికి మొలకలు వస్తున్నాయని దీన్ని సాకుగా చూపి ధాన్యం కొనుగోలు చేయటంలో ప్రభుత్వం కానీ రైస్ మిల్లర్లు కానీ గురి చేస్తే రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్, సిపిఎం నాయకులు కటారి రాములు, దినేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.