Wednesday, May 7, 2025
Homeట్రెండింగ్ న్యూస్రాయపర్తిలో కల్తీ పెట్రోల్ కలకలం..

రాయపర్తిలో కల్తీ పెట్రోల్ కలకలం..

- Advertisement -

బంకులో పెట్రోల్ కల్తీపై అనేక అపోహాలు
30 బైకులకు పెట్రోల్ కొట్టిన తర్వాత పెట్రోల్ వ్యవహారం బట్టబయలు
ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులకు తిరిగి పైసలు ఇచ్చిన వైనం
కల్తీ విషయం బయటకు పోకుండా మల్లాగుల్లాలు పడుతున్న నిర్వాహకులు
నవతెలంగాణ – రాయపర్తి: రాయపర్తి శివారులోని  వినాయక ఫ్యూయల్ స్టేషన్(హెచ్ పి పెట్రోల్ బంక్)లో పెట్రోల్ కల్తీ జరిగినట్లు పలువురు వాహనదారులు ఆరోపించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. వినాయక ఫ్యూయల్ స్టేషనులో గత రెండు రోజుల నుండి పెట్రోల్ లేదు. పెట్రోల్ బంకు నిర్వాహకులు మంగళవారం సాయంత్రం బంకులో పెట్రోల్ అందుబాటులోకి తెచ్చారు. గత రెండు రోజులుగా పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. బంకులో పెట్రోల్ ఉందనే సమాచారంతో ద్విచక్ర వాహనదారులు బంకుకు చేరుకొని సుమారు 30 బైకుల్లో పెట్రోల్ పోయించుకున్నారు. ఇదే క్రమంలో పలువురు వాటర్ బాటిల్లో పెట్రోల్ పోయించుకోగా పెట్రోల్ తెల్లగా ఉందని గ్రహించారు. బంకు నిర్వాహకులు ఇప్పుడే పెట్రోల్ అన్ లోడ్ చేశామని, ట్యాంక్ లో ఉన్న కచరా పైకి వచ్చిందని, దాని వల్లే పెట్రోల్ తెల్లగా వస్తుందని వాహనదారులను నమ్మించే ప్రయత్నం చేశారు. బాటిళ్లలో ఉన్న పెట్రోల్ ను వారి బకెట్లో పోసుకొని మళ్ళీ పెట్రోల్ ను బాటిలలో కొట్టారు. ఈసారి పెట్రోల్ మరింత తెల్లగా ఏమాత్రం పెట్రోల్ వాసన లేకుండా వచ్చింది. దాంతో కంగుతిన్న నిర్వాహకులు పెట్రోల్ బాటిల్లను తీసుకొని తిరిగి పైసలు ఇచ్చారు. మరి కొంతమందికి శాంపిల్స్ తీసుకున్న పెట్రోల్ పోశారు. ముందు కొన్ని బైకులకు పెట్రోల్ కొట్టారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అని పలువురు అడిగారు. ఏం చెప్పలేం అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. విషయం బయటకు పోకుండా బంకులో ఉన్న లైట్లు మొత్తం ఆఫ్ చేశారు. ఈ బంకులో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది రెండవసారి. సంబంధిత అధికారులు మొద్దు నిద్రను వీడి బంకును తనిఖీ చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -