తొమ్మిది మంది మృతి
12 మందికి తీవ్రగాయాలు
పాట్నా : బీహార్‌లో మంగళవారం ఘోర విషాదం చోటు చేసుకుంది. నలంద జిల్లాలో ఒక ఆలయం వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందారు. వీరిలో ఎనిమిది మంది మహిళలే. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని బీహార్ షరీఫ్ అనే పట్టణంలోని మేఘ్రా ప్రాంతంలో ఉన్న శీతల్ మాత ఆలయం వద్ద ఈ దారుణం జరిగింది. సాధారణంగానే ఈ ఆలయం వద్ద మంగళవారం నాడు భారీ రద్దీ నెలకొని ఉంటుంది. ఇక చైత్రమాసం లో చివరి మంగళవారం, మహావీర్ జయంతి కావడంతో ఆలయానికి ప్రజలు పోటెత్తారు. అయితే అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. క్యూలైన్లలో రద్దీగా ఉన్న సమయంలో వ్యాప్తిచెందిన ఒక రూమర్‌తో తొక్కిసలాట ప్రారంభమయింది. క్షణాల వ్యవధిలో ప్రజలు ఒకరిమీద ఒకరు పడిపోయారు. వారిని తొక్కుకుంటూ మరికొంత మంది వెళ్లిపోయారు. దీంతో ఈ దారుణం జరిగింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో పోలీసులు, ఆలయ సిబ్బంది ఎవ్వరూ లేరని ప్రత్యక్షసాక్షలు తెలిపారు. తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిన తరువాతే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జీ కూడా చేయాల్సి వచ్చింది. తరువాత స్థానికులు, పరిపాలన అధికారులతో కలిసి సహయక కార్యక్రమాలు ప్రారంభించారు. క్షతగాత్రులను, మృతదేహాలను బీహార్ షరీఫ్‌లోని సాదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తరువాత ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు.
పోలీసుల్ని అక్కడకు తరలించడం వలనే..
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బీహార్‌లో బీజేపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం ఈ ఆలయం వద్ద రద్దీని ఉంటుందని తెలిసినా ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. మంగళవారం ఇదే జిల్లాలోని రాజ్‌గిర్ పట్టణంలో నలంద యూనివర్శిటీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఉంది. ఈ పర్యటన కోసం భారీ సంఖ్యలో పోలీసుల్ని అక్కడకు ప్రభుత్వం తరలించిందని, ఆలయం వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. ఈ విమర్శల నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కోసం జిల్లా అధికారుల నేతృత్వంలో బీహార్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీప్ నగర్ స్టేషన్ హౌస్ అధికారి రజ్మానీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే, మృతుల కుటుంబాలు ఒక్కొరికీ రూ. 6 లక్షల పరిహారాన్ని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నలందలోని ఒక ఆలయం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం అత్యంత హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని సోషల్‌మీడి యాలో తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలు ఒక్కొకరికీ రూ 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50 వేలు పరిహారం ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేశారు. బాధిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని చెప్పారు.
బీహార్ ఆలయంలో తొక్కిసలాట
- Advertisement -
- Advertisement -



