– పత్తి కొనుగోళ్లలో వేగం పెంచాలి : వ్యవసాయ శాఖ, సీసీఐ అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇంకా తెరుచుకోని జిన్నింగ్ మిల్లులను వెంటనే ప్రారంభించాలనీ, పత్తి కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగతరం చేయాలని వ్యవసాయ శాఖ, సీసీఐ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో పత్తి కొనుగోళ్లపై అధికారులను మంత్రి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా 328 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసినప్పటికీ, వాటిలో కొన్ని ఇప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడం తన దృష్టికి వచ్చిందన్నారు. అన్నింటిలోనూ కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సీసీఐ అధికారులను ఆదేశించారు. సమ్మె విరమించి మిల్లులన్నీ ప్రారంభిస్తామని మిల్లర్లు చెప్పినప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల మిల్లులు పనిచేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డితో మంత్రి మాట్లాడారు. మిల్లులను తెరిపించాలన్నారు. రైతులకు అంతరాయం లేకుండా పత్తి కొనుగోళ్లు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇప్పటికే 1.32 లక్షల మంది రైతుల నుంచి 2.35 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరించామని పేర్కొంటూ కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు.
విత్తన ముసాయిదా బిల్లుపై రైతుల అభిప్రాయాలు సేకరించి పంపండి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా చట్టం 2025పై రైతునేస్తం కార్యక్రమం ద్వారా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు వేదికల నుంచి రైతులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్ పథకంలో భాగంగా 5500 క్వింటాళ్ల వరి విత్తనాలను 50 శాతం సబ్సిడీపై సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విత్తన ముసాయిదా చట్టంపై మంత్రి క్షుప్తంగా వివరించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి రాతపూర్వకంగా అభిప్రాయలు సేకరించి, ప్రభుత్వానికి సమర్పించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు. ఆయిల్ పామ్ పంటల్లో అంతర పంటల సాగు ఆవశ్యకత గురించి, వరి పంట కోత అనంతరం వరి కొయ్యలను కాల్చకుండా భూమిలో దున్ని పర్యావరణాన్ని సంరక్షించాల్సిన అవసరం గురించి రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. పంట అవశేషాల లేదా వ్యర్థాల నిర్వహణపై లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ ఎం.కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మెన్ బి.అన్వేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. విత్తన బిల్లు 2025 ను మరింత సమర్థవంతంగా, సమగ్రంగా రూపొందించేలా పలు సూచనలు చేశారు. రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు సునీల్ మాట్లాడుతూ.. కొత్తగా తీసుకురావాల్సిన అవసరమున్న చట్టాల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
మిగతా జిన్నింగ్ మిల్లులనూ ప్రారంభించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


