Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం18న రాష్ట్ర బంద్‌ సెగ ఢిల్లీని కదిలించాలి

18న రాష్ట్ర బంద్‌ సెగ ఢిల్లీని కదిలించాలి

- Advertisement -

రాజ్యాంగ సవరణ మాత్రమే బీసీలకు శ్రీరామరక్ష : బీసీ జేఏసీ చైర్మెన్‌ ఆర్‌.కృష్ణయ్య
నవతెలంగాణ – బంజారాహిల్స్‌
ఈనెల 18న జరిగే రాష్ట్ర బంద్‌ సెగ ఢిల్లీకి తాకాలని బీసీ జేఏసీ చైర్మెన్‌ ఆర్‌.కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సీనియర్‌ జర్నలిస్టు రమణకుమార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ జర్నలిస్టుల అసోసియేషన్‌ సమావేశానికి బీసీ జేఏసీ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఈ పోరాటం ఆగదని, బీసీలంతా ఏకమై రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బంద్‌ ముగింపు కాదని.. ఆరంభం మాత్రమేనని వర్కింగ్‌ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం బీసీల పట్ల వ్యవస్థలు వ్యతిరేకంగా ఉన్నాయనడానికి నిదర్శనమని వైస్‌ చైర్మెన్‌ వీజీఆర్‌ నారగోని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీసీ జేఏసీ కోచైర్మెన్‌ డి.రాజారాం యాదవ్‌ అన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. సమగ్ర కులగణన మొదలుకొని.. బిల్లును రాష్ట్రపతికి పంపడం, అది పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్‌ తేవడం, ఆర్డినెన్స్‌ గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉండగానే జీవో 9ని తీసుకురావడం వరకు రేవంత్‌ రెడ్డి చేసిన తప్పిదాల వల్లే కోర్టులు బీసీ రిజర్వేషన్ల పిటిషన్లను కొట్టేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించినట్టుగానే.. రాజ్యాంగ సవరణ ద్వారా బీసీల రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టు.. రిజర్వేషన్ల అమలును రాష్ట్రాలకే అప్పగించాలని, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టుల అసోసియేషన్‌ నాయకులు మేకల కృష్ణ, కొత్త లక్ష్మణ్‌ పటేల్‌, నీలకంఠం ముదిరాజ్‌, బొమ్మ అమరేందర్‌, వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -