42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ పిలుపు
సకల జనులు పాల్గొనాలి.. బీసీల ఆకాంక్ష ఢిల్లీకి వినిపించాలి
అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక, ప్రజాసంఘాల మద్దతు
కేంద్రం తీరును నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ప్రదర్శనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ శనివారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. సకల జనులు ఈ బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. బీసీల ఆకాంక్షలు ఢిల్లీకి వినిపించేలా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ బంద్‌కు మద్దతునివ్వాలంటూ అన్ని రాజకీయ పార్టీలనూ బీసీ జేఏసీ ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలూ ఈ బంద్‌కు మద్దతును ప్రకటించాయి. బీసీ బిల్లును అడ్డుకుంటు న్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితేనే మద్దతు ఇస్తామనీ, బంద్‌లో పాల్గొంటామ ని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది. దానిలో భాగంగానే శుక్రవారం రాజ్‌భవన్ ముట్టడిని చేపట్టింది. బిల్లుకు అడ్డుపడుతున్న బీజేపీ కూడా ఈ బంద్‌కు మద్దతు ఇవ్వడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, గవర్నర్ వ్యవహారశైలికి నిరసనగా శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రబంద్ నేపథ్యంలో ప్రయివేటు పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామంటూ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆర్నెల్లైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. అయితే రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఆర్డినెన్స్‌పైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసింది. ఆ జీవో ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి హైకోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ని దాఖలు చేసింది.
అయితే సుప్రీంకోర్టు ఆ స్టేను సమర్థించింది. ఎస్‌ఎల్‌పీని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన రాష్ట్రబంద్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇస్తుండడంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్నది ఎవరు?అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది. రాష్ట్రబంద్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకమా?, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమా? లేదంటే కోర్టులకు వ్యతిరేకమా?అని బీసీ జేఏసీని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ద్వారా కులగణన చేపట్టి దాని ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. కేంద్రం ఆమోదించకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసింది. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
బీసీలకు రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు చెప్తున్నాయి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. లేదంటే పార్లమెంటులో బిల్లు ఆమోదించి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్‌లో బీసీ రిజర్వేషన్లను చేరిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీసీ మేధావులు సూచిస్తున్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించిన బీజేపీ కేంద్రంలో మాత్రం ఆ పని చేయకుండా అడ్డుకుంటుండడం గమనార్హం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బంతి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. కేంద్రం ఆమోదిస్తేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి తీసుకెళ్లాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.