Sunday, October 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు16న రాష్ట్ర క్యాబినెట్‌

16న రాష్ట్ర క్యాబినెట్‌

- Advertisement -

నీటిపారుదల, స్థానిక ఎన్నికలపై సమాలోచన

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రమంత్రివర్గ సమావేశం ఈనెల 16న జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై డైలమా నెలకొనడంతో ఈ క్యాబినెట్‌ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమై రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తాజాగా జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించడంతో ఈ చర్చకు ఆస్కారం కలిగిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై సీబీఐ విచారణ చేయాలని గతంలోనే మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈమేరకు సీబీఐకి లేఖ రాసింది. అయితే ఇంకా ఈ అంశంపై సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. కాగా హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతున్నది.

పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి ముగింపును ఇచ్చే విషయమై ఈ సమావేశంలో తీవ్ర చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. ఇకపోతే ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్‌ టాపిక్‌ స్థానిక సంస్థల ఎన్నికల జీవో తొమ్మిదిపై స్టే వచ్చిన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. పంచాయతీరాజ్‌ ఎన్నికలు దాదాపు నెలరోజులపాటు వాయిదా పడ్డాయి. అనంతర పరిస్థితి ఏంటనే అగమ్యగోచరంగా ఉంది. ఈ ఎన్నికలు వాయిదా పడటంతో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలపాలైంది. సీఎం రేవంత్‌కు ప్రతిష్టాత్మకంగా తయారైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధత లేకుండానే జీవో ఇవ్వడం ద్వారా ఎన్నికలకు ఎలా వెళతారని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరకు స్టే ఇవ్వడంతో ఎన్నికలకు ఫుల్‌స్టాప్‌ పడింది. అలాగే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేసింది. దీనిపై క్యాబినెట్‌లో పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -