No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- Advertisement -

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా విశదపరిచారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎఫ్ఓ వికాస్ మీనా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లా బాలభవన్, ఇతర డాన్స్ అకాడమీల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా బాలభవన్ చిన్నారులు తల్లి భారతి వందనం గీతంపై నృత్య ప్రదర్శనతో పాటు ఆత్మ రక్షణ ఆవశ్యకతను చాటుతూ కర్రసాము విద్యను ప్రదర్శించారు. సతీష్ డ్యాన్స్ మాస్టర్ నేతృత్వంలో శివా ఆర్ట్స్ కళాకారులు పేరిణి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సిద్దార్థ కళాక్షేత్రం విద్యార్థులు శివస్త్రోత్రం పై సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.

శివాని నాట్యాలయం చిన్నారులు గిరిజన సంస్కృతిని చాటేలా లంబాడా నృత్యంతో తమ ప్రతిభను చాటుకున్నారు. చైర్మన్ అనిల్ ఈరవత్రి, కలెక్టర్, సీ,పీ, ఇతర అధికారులు కళాకారుల వద్దకు వెళ్లి వారిని అభినందించి జ్ఞాపికలు బహూకరించారు. కాగా, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. బీసీ సంక్షేమ శాఖ, గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్యం, అగ్నిమాపక, రవాణా శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర నిఘా కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన డ్రోన్ వ్యవస్థను పరిచయం చేస్తూ ప్రయోగాత్మకంగా పనితీరును ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, అటవీ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, ఫిషరీస్, విద్యా శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. 
జెడ్పీ కార్యాలయంలో పతాకావిష్కరణ గావించిన కలెక్టర్..
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ సీఈఓ సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన ప్రజాప్రతినిధులు, అధికారులు..
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చైర్మన్ అనిల్ ఈరవత్రి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad