Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -

– గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు..
– సహాయ చర్యలు మరింత వేగవంతం : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
– ఇలాంటి ఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
– సిగాచి పరిశ్రమ సందర్శన
నవతెలంగాణ-పటాన్‌చెరు

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమను సందర్శించారు. రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ స్పెషల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, పరిశ్రమలు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రటరీ దాన కిషోర్‌, జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరతోష్‌ పంకజ్‌, అగ్నిమాపక శాఖ, పొల్యూషన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, పరిశ్రమల శాఖ సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులతో పరిశ్రమలో పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రమాదానికి దారితీసిన కారణాలు, పరిశ్రమల భద్రతా ప్రమాణాలు, సేఫ్టీ మెకానిజం నిర్వహణపై సంబంధిత శాఖలతో సమీక్షించారు. పరిశ్రమలో రియాక్టర్లు, డ్రైయర్లు, ఫైర్‌ ఫైట్‌ సిస్టమ్‌, ఉద్యోగుల రక్షణ మార్గాలు, ఇతర భద్రతా అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. . ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, మృతుల వివరాలుచ మృతుల ఐడెంటిఫికేషన్‌ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల కోసం ఐలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా త్వరలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా సాగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి : కూనంనేని సాంబశివరావు
సిగాచి పరిశ్రమలో జరిగిన సంఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి గురైన బాధితులను ఆస్పత్రికి వెళ్లి సీపీఐ బృందం పరామర్శించింది. అనంతరం సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన తీరును, సహాయచర్యల వివరాలను పరిశ్రమ ఎండీతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలో జరిగిన దుర్ఘటన ఇప్పటివరకు దేశంలో ఏ పరిశ్రమలో కూడా జరగలేదని, దీనికి పూర్తి బాధ్యత పరిశ్రమ యాజమాన్యం, సంబంధిత అధికారులు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, సేఫ్టీ అధికారులు, లేబర్‌ కమిషనర్లు, ప్రభుత్వం వహించాలన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించాలని డిమాండ్‌ చేశారు.
ప్రమాదాల్లో కమిటీల ద్వారా కేసులు వేయటమే తప్ప సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని, సాక్షాత్తు పరిశ్రమ యాజమాన్యమే కార్మికులకు సంబంధించిన సంఖ్య లెక్కలు చెప్పలేకపోవడం దారుణమన్నారు. చనిపోయిన వారికి ప్రగాఢ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వి. ప్రకాశ్‌ రావు, సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి శ్రీమాన్‌, జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్‌, సహాయ కార్యదర్శి ఎంఏ రెహమాన్‌, ఆనంద్‌, ఎండీ మహబూబ్‌ ఖాన్‌, అశోక్‌ రెడ్డి, పాండు, మొయినుద్దీన్‌, ఆసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -