నవతెలంగాణ-రాయపోల్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకుంది. మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో విశేష సేవలు, అసంక్రామిక వ్యాధుల నియంత్రణలో సమర్థ చర్యలు, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాటుఫారం ఆన్‌లైన్ సేవల సమర్థ అమలులో ప్రతిభ కనబరిచినందుకు ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఎంపికయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కుటుంబ సంక్షేమ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగతు చేతుల మీదుగా అవార్డును రాయపోల్ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మహారాజు బల్లా అందుకున్నారు. అదేవిధంగా గజ్వేల్ డివిజన్ పరిధిలో ఉత్తమ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంగా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి ఎంపిక కావడం మరో విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లింగారెడ్డిపల్లి మెడికల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్ ప్రియాంక, హెల్త్ అసిస్టెంట్ ప్రేమకు మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ మహారాజ్, డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాయపోల్ పీహెచ్‌సీ, ఆయుష్మాన్ మందిర్ ఉత్తమంగా ఎంపికై రాష్ట్రస్థాయిలో అవార్డులు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ అవార్డులు రావడం మరింత బాధ్యత పెంచిందని, వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు బాధ్యతాయుతంగా పని చేస్తూ మరింత గుర్తింపు తెచ్చే విధంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ స్థాయి ఆరోగ్య కార్యకర్తల సమిష్టి శ్రమ కీలకమని అధికారులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాయపోల్ పీహెచ్‌సీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బందిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. ధనరాజ్, గజ్వేల్ డిప్యూటీ వైద్యాధికారి ఎం. శ్రీనివాస్, వైద్యాధికారి డా.అశ్లేష తదితరులు పాల్గొన్నారు.
రాయపోల్ పీహెచ్‌సీకి రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



