Sunday, April 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎల్డీఎఫ్‌లా లేబర్‌కోడ్‌లు అమలు చేయబోమని చెప్పండి

ఎల్డీఎఫ్‌లా లేబర్‌కోడ్‌లు అమలు చేయబోమని చెప్పండి

- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డికి సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు సవాల్‌
రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు
అమెరికా యుద్ధోన్మాదంతో ఉపాధికి గండిపడిందని ఆవేదన
వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆందోళన
సీఐటీయూ సావనీర్‌ ఆవిష్కరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేరళం ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. అక్కడి ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై విషం కక్కిన సీఎం రేవంత్‌రెడ్డిపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేరళం గురించి, అక్కడి అభివృద్ధి, సంక్షేమంపై ఇష్టానుసారంగా మాట్లాడిన మీరు… అక్కడి ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ప్రకటించిన విధంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేయబోమని ప్రకటించండి చూద్దాం…’ అంటూ సీఎంకు సవాల్‌ విసిరారు. శనివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం ఐదో మహాసభల సావనీర్‌ను రాఘవులు ఆవిష్కరించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య, ఆర్‌ సుధాభాస్కర్‌, ఎస్వీ రమ, జె మల్లిఖార్జున్‌, ఎ మల్లేశం, బాలమణి, ఎం అడివయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ… కేరళంలో కార్మికుల, పేదల పక్షాన నిలబడుతున్న ఎల్డీఎఫ్‌ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయని వివరించారు. బీజేపీ, కాంగ్రెస్‌ కూడబలుక్కుని ఎల్డీఎఫ్‌ను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారంలో అభూత కల్పనలతో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌పై, సీపీఐ(ఎం)పై విషం చిమ్మారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆయన దాటవేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చు కోవటమేగాక.. కేరళం సీఎంపై అవాకులు చవాకులు పేలటం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని సూచికల్లో, ముఖ్యంగా మానవాభివృద్ధి సూచికల్లో కేరళం దేశంలోనే అగ్ర భాగాన నిలిచిందని రాఘవులు గుర్తు చేశారు. అక్కడి నమూనాతో తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై దృష్టి సారించాలని ఆయన రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు.

యుద్ధంతో రాష్ట్రంలో ఉపాధికి గండి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ కలిసి చేస్తున్న దురాక్రమణ యుద్ధం వల్ల మన దేశంలో, రాష్ట్రంలో ఉపాధికి గండి పడిందని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం కొనసాగుతోందని, ఆ ఎలక్షన్లలో రాజకీయ లబ్ది పొందేందుకు వీలుగా బీజేపీ, ఎన్డీఏ కూటమి మతవైషమ్యాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశమైన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని ఖండించకపోవటంతో ప్రధాని మోడీ వైఫల్యం బట్టబయలైందని విమర్శించారు. దీంతో ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో మత విద్వేషాలను రెచ్చగొట్టటం ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై దాడి వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర దుష్ప్రభావం పడిందన్నారు. ముఖ్యంగా కార్మికవర్గంపై దీని ప్రభావం మరింతగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పారిశ్రామిక, వ్యాపార, సేవా రంగాల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని చెప్పారు. దీంతో లక్షలాదిమంది ఉపాధి కోల్పోయారని వాపోయారు. ఎరువుల కొరత వల్ల రైతాంగం అయోమయంలో పడిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లేబర్‌ కోడ్‌లపై కార్మికవర్గం నుంచి ప్రతిఘటన ప్రారంభమైందన్నారు. దళితులు, మైనారిటీలు, మహిళలు లైంగిక వేధింపులకు, దాడులకు, అన్యాయాలకు గురవుతున్నారని తెలిపారు. సామాజిక తరగతులను మోసగించటానికి, రాజకీయంగా లబ్ది పొందేందుకే కేంద్రం మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లును తెస్తోందని అన్నారు. అంతేతప్పితే ఈ విషయంలో బీజేపీకి, ప్రధాని మోడీకి రాజకీయ నిజాయితీ లేదని రాఘవులు ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -